- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమఉజ్జీల పోరు.. సత్తా చాటేదెవరు..?
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ ర్యాంకుల్లో టాప్ 2 జట్ల మధ్య సమరం అంచనాలను మించి జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా చెరి రెండు మ్యాచ్‌లు గెలుచుకున్నారు. ఇక నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో తలపడాల్సి టీ20 సిరీస్ ఎవరిదో తేలనుంది. నాలుగవ టీ20లో గెలిచిన ఉత్సాహంతో కోహ్లీ సేన ఉంటే.. ఓడిన మ్యాచ్‌లలో కూడా టీమ్ ఇండియాను భయపెట్టిన ఇంగ్లాండ్.. సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్నది. ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ గెలిచి టాప్ ర్యాంకును నిలబెట్టుకోవాలని భావిస్తుండగా.. టీమ్ ఇండియా మాత్రం సిరీస్‌తో పాటు అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నది. శనివారం సాయత్రం జరిగే సమఉజ్జీల పోరులో ఎవరు గెలుస్తారో అని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
బ్యాటింగ్‌లో తడబాటు..
ప్రపంచంలో అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లలో టీమ్ ఇండియా ఒకటి. గతంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లక్ష్యాన్ని ఛేదించడంలో, లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలకంగా ఉండేవాళ్లు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలే సగానికి పైగా పరుగులు చేసేవాళ్లు. కానీ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో టాప్ ఆర్డర్ విఫలమైంది. కేఎల్ రాహుల్ వరుసగా నాలుగు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ కోహ్లీ అతడికి అండగా ఉంటున్నారు. రేపటి మ్యాచ్‌లో కూడా కేఎల్ రాహుల్ ఉండటం ఖాయమే. తన ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికైనా రాహుల్ ఒక భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఇక రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడినా పెద్దగా ఆకట్టుకోలేదు. అతడు కూడా పూర్తి ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉన్నది. టీ20 వరల్డ్ కప్ కోసం పరిశీలించిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ తమను తాము నిరూపించుకున్నారు. కెప్టెన్ కోహ్లీ కూడా వరుస అర్దసెంచరీలతో ఫామ్‌లో ఉన్నాడు. స్పిన్నర్ల విషయంలోనే కోహ్లీ తడబడుతున్నాడు. ఈ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. పంత్, శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్‌లో చక్కగా రాణిస్తున్నారు. పవర్ ప్లేలో వికెట్లు త్వరగా పారేసుకోకుండా.. భారీ స్కోర్ చేయగలిగితే.. మిడిల్, లోయర్ మిడిల్ ఆర్డర్‌పై భారం తగ్గే అవకాశం ఉంటుంది.
రెండు స్పిన్నర్ల వ్యూహం కొనసాగిస్తారా?
టీమ్ ఇండియా ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌లో మొదటి నుంచి రెండు స్పిన్నర్ల వ్యూహంతోనే బరిలోకి దిగింది. తొలి మూడు మ్యాచ్‌లలో చాహల్ పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో రాహుల్ చాహర్‌ను బరిలోకి దింపారు. నాలుగో టెస్టులో అతడి స్పెల్ కీలకంగా మారింది. అదే సమయంలో వాషింగ్టన్ సుందర్ మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో భారమంతా పేసర్లే మోశారు. 6వ బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మరి కీలకమైన చివరి మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్ల వ్యూహాన్ని కొనసాగిస్తారా? లేదా మరో పేసర్‌తో బరిలోకి దిగుతారా అనేది చూడాల్సిందే. భువనేశ్వర్, శార్దుల్ ఠాకూర్‌లకు తోడు సిరాజ్ లేదా నటరాజన్‌లను తీసుకుంటే.. వాషింగ్టన్ సుందర్‌ను పక్కన పెట్టే అవకాశం ఉన్నది. టాస్ కీలకంగా మారుతున్న అహ్మదాబాద్ వేదికలో.. ఒక స్పిన్నర్‌తోనే ఆడటం మంచిదని విశ్లేషకులు కూడా అంటున్నారు.
ఇంగ్లాండ్ ఏం చేయబోతున్నది?
ఇంగ్లాండ్ జట్టులో డేవిడ్ మలన్, జాస్ బట్లర్ మరింత నిలకడగా ఆడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు డేవిడ్ మలన్ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. జేసన్ రాయ్ పదే పదే నలబైల మీద అవుటవుతున్నాడు. తన స్కోరును భారీ స్కోరుగా మలచలేక పోతున్నాడు. బెన్ స్టోక్స్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇయాన్ మోర్గాన్‌కు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ అతడు మంచి ఫామ్‌లో ఉండటం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశం. ఇంగ్లాండ్ ఇప్పటి వరకు పేసర్లనే నమ్ముకొని మ్యాచ్‌లు ఆడుతున్నది. జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్ తమ అద్భుతమైన బౌలింగ్‌తో టీమ్ ఇండియా టాప్ ఆర్డర్‌ను బెంబేలెత్తిస్తున్నారు. వీరిద్దరి తోడు క్రిస్ జోర్డాన్ కూడా బంతితో రాణిస్తున్నాడు. ఇక స్పిన్నర్ ఆదిల్ రషీద్ మొదటి ఓవర్ నుంచే స్పిన్‌తో ఆకట్టుకుంటున్నాడు. టీమ్ ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నా.. ఇంగ్లాండ్ మాత్రం ఏకైక స్పిన్నర్‌తోనే నెట్టుకొస్తున్నది. చివరి మ్యాచ్‌లో కూడా ఇదే వ్యూహాన్ని అనురించే అవకాశం ఉంది. ఏదేమైనా సిరీస్ డిసైడర్ అయిన ఆఖరి మ్యాచ్‌లో ఇరు జట్లు నువ్వా నేనా అని తలపడటం ఖాయం.
తుది జట్లు అంచనా:
ఇండియా : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్/ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్/నటరాజన్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహర్
ఇంగ్లాండ్ : జేసన్ రాయ్, జాస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్
వేదిక : నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
సమయం : శనివారం రాత్రి 7.00 గంటలు
లైవ్ : స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు
స్ట్రీమింగ్ : డిస్నీ+హాట్‌స్టార్