ఆగస్టులో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి

by Harish |
ఆగస్టులో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక వృద్ధిని సూచించే ఎనిమిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి ప్రస్తుత ఏడాది ఆగస్టు నెలలో 11.6 శాతం పెరిగినట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం గణాంకాలను విడుదల చేసింది. జూలైలో ఇది 9.9 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. బొగ్గు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ వంటి రంగాల మెరుగైన ప్రదర్శన ఈ వృద్ధికి కారణమని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రధానంగా సిమెంట్ ఉత్పత్తి మిగిలిన వాటికంటే అత్యధికంగా 36.3 శాతంగా నమోదైంది. సమీక్షించిన నెలలో విద్యుత్ ఉత్పత్తి 15.3 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడం రాబోయే నెలల్లో ప్రధాన పారిశ్రామిక కార్యకలాపాల వృద్ధికి దోహదపడనుంది. కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ నుంచి ఆర్థికవ్యవస్థ కోలుకుంటోందని, పండుగ సీజన్‌తోపాటు డిమాండ్ ఈ వృద్ధికి సహాయపడనున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమీక్షించిన నెలలో స్టీల్ ఉత్పత్తి 5.1 శాతం, రిఫైనరీ ఉత్పత్తి 9.1 శాతం, సహజవాయువు 20.6 శాతం, బొగ్గు ఉత్పత్తి 20.6 శాతం పెరిగింది. ఎరువుల ఉత్పత్తి 3.1 శాతం, ముడి చమురు ఉత్పత్తి 2.6 శాతం క్షీణించాయి.

Advertisement

Next Story