- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాపులను వంచించిన వైసీపీ
‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ పాటలు, ప్రచారాలతో రాష్ట్రాన్ని హోరెత్తిస్తోంది వైఎస్‌ఆర్‌సీపీ. అయితే ‘నమ్మి నానబోస్తే పుచ్చులు చేతికొచ్చినట్టు...’ ఒక్క చాన్స్ ఇచ్చిన పాపానికి మాకు నమ్మక ద్రోహం చేశావ్ జగన్ అంటూ ప్రజలు ఈసడించుకుంటున్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ సర్కారు చేసిన నమ్మక ద్రోహంతో రాష్ట్రంలోని ప్రతి వర్గం వంచనకు గురైంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అడుగడుగున వంచనకు గురిచేసిన విధానాన్ని పరిశీలిస్తే.. ‘అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు...అన్నిచ్చాడు మనకు అన్నీ ఇచ్చాడు’ అని సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటున్న వైఎస్సార్సీపీ నాయకులు, ఈ ఐదేళ్లలో కాపులకు ఏమిచ్చారని లెక్కలడిగితే నీళ్లు నములుతున్నారు. ఎందుకంటే, జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే ఉండదు. నిలువునా మోసం చేస్తూనే వారికి గతంలో ఎవరూ చేయని మేలు చేశామని నమ్మకంగా పాయింట్ బ్లాంక్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. కాపుల ఓట్లు కావాలి. కాపు ఉద్యమ నాయకులూ తన పక్కనే ఉండాలి. వారి వల్ల లభించే సీట్లతో తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి. ఇంతే! ఇంతకుమించి, కాపులను ఎదగనీయరు. కాపులు తన బలగంగా ఉండాలి, అదే సమయంలో వారు బలహీనంగా ఉండాలి. ధృతరాష్ట్ర కౌగిలిలా ఒక వైపు మంచి చేసినట్టు నటిస్తూ మరో వైపు పథకం ప్రకారం ఐదేళ్లు కాపులను మోసం చేశారు. ‘కాపు నేస్తం’ అంటూ మాటలు వల్లే వేస్తూనే నాణానికి మరోవైపు వారి అభివృద్ధికి ‘రిక్త హస్తం’ చూపించడం వైఎస్‌ఆర్‌సీపీకే చెల్లింది.
కాపు నేస్తం కాదు.. నిలువునా దగా
గత ప్రభుత్వాలు కాపుల కోసం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటినీ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పాతరేసింది. కాపు ప్రయోజనాల కోసం 2014-19 మధ్య నాటి ప్రభుత్వం ప్రత్యేకంగా కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసింది. దీనికి పోటీగా కాపు సామాజిక వర్గం కోసం ఏటా రూ. 2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఎన్నికల ముందు వైఎస్‌ఆర్‌సీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే మడమ తిప్పి, మాట తప్పారు. ‘కాపు నేస్తం’ పథకాన్ని ఆర్భాటంగా తీసుకొచ్చి ఈ ఐదేళ్లలో రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారు. అంటే గతంలో కంటే సగం నిధులే కేటాయించి, గారడీ మాటలతో కాపులను నిలువునా దగా చేశారు.
గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి రూ.50 వేల నుంచి లక్ష వరకు రాయితీతో రుణాలు ఇచ్చేవారు. 2.11 లక్షల మంది అలా రుణాలు అందుకుని, తమ వ్యాపార, ఉపాధి కలలను సాకారం చేసుకున్నారు. దీంతోపాటు ఆసక్తి ఉన్నవారికి ఎస్.యూ.వీలు కొనుక్కోవడానికి రాయితీలు ఇచ్చి, వారికి ప్రభుత్వమే డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించింది. 284 మంది కాపు సోదరులకు రూ.21.30 కోట్ల ఆర్థిక సాయం అందింది. కాపు యువతకు ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంది. ఆ ఐదేళ్లలో రూ.28 కోట్లు ఖర్చు చేసి 39,739 మంది కాపు యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్‌కి జవసత్వాలే లేకుండా చేశారు. నిరుద్యోగ యువతకు అందించే నైపుణ్య శిక్షణను ఆపేశారు. రాయితీ రుణాల్ని సైతం ఎత్తేసి వారి ఎదుగుదలను అడ్డుకున్నారు.
విదేశీ విద్య, విద్యోన్నతిపై శీతకన్ను
కాపులకు గత ప్రభుత్వంలో అమలైన విదేశీ విద్య పథకంపై కూడా జగన్ సర్కారు శీతకన్ను వేసింది. అధికారంలోకి వచ్చాక మూడేళ్ల పాటు ఈ పథకాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికల ముందు కాపుల నుంచి వస్తున్న వ్యతిరేక జ్వాలలను తగ్గించడానికి ఈ పథకాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చారు. పథకంలో అనేక నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్య పెరగకుండా కుట్ర చేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఉన్నత చదువుల కోసం 1892 మంది కాపు విద్యార్థులను విదేశాలకు పంపిస్తే, వైసీపీ పాలనలో 250 మంది కూడా విదేశాలకు వెళ్లలేదు. గత ప్రభుత్వం సివిల్స్ చదివేందుకు అత్యున్నత శిక్షణ సంస్థల్లో ఉచిత శిక్షణ అందించడానికి అమలు చేసిన విద్యోన్నతి పథకాన్ని కూడా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నిలిపేసింది.
రిజర్వేషన్ కలల్ని కాలరాశారు
కాపులకు రిజర్వేషన్ కావాలన్న కలలను కూడా వైసీపీ కాలరాసింది. కాపుల రిజర్వేషన్ తమ పరిధిలో లేదని అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్తూ కాలయాపన చేసింది. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ఏదైనా కులానికి ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా’ అని గతంలో రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ సమాధానమిస్తూ అవసరం లేదని చెప్పడం ఇక్కడ గమనార్హం. కాపులకు బీసీ రిజర్వేషన్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్తూ వైఎస్సార్సీపీ మోసం చేసింది. మరోవైపు దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారంగా గతంలో టీటీపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇచ్చే 10 శాతంలో 5 శాతం కాపులకు రిజర్వేషన్లను కల్పించింది. అధికారంలోకి రాగానే జగన్ ఈ రిజర్వేషన్ కూడా రద్దు చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేసిన కాపు ఉద్యమ నాయకులు ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నవారి పంచన చేరడం దురదృష్టకరం.
కాపు భవన్ నిర్మాణాలు కట్
కాపు సామాజిక వర్గంలో పేదవారు శుభకార్యాలు చేసుకోవడానికి, సమావేశాలు, ఉపాధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి గత టీడీపీ ప్రభుత్వం కాపు భవన్ నిర్మాణాలు చేపట్టింది. గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మినీ కాపు భవనాల నిర్మాణం చేపట్టగా వైసీపీ అధికారంలోకి రాగానే వాటికి కేటాయించిన నిధుల్ని వెనక్కి తీసుకోవడంతో నిర్మాణ పనులు సగంలోనే ఆగిపోయాయి. ఉదాహరణకు మా అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని కాపు సంక్షేమ భవన నిర్మాణ పనులను రూ.40 లక్షలతో చేపట్టగా, మంజూరైన రూ.18 లక్షల నిధులతో పునాదుల వరకు నిర్మాణమయ్యాయి. జగన్ అధికారంలోకి రావడంతో ఆ పనులు నిలిచిపోయాయి. ఈ భవనం పూర్తయి ఉంటే సమీపంలోని 24 గ్రామాల్లో అత్యధికంగా ఉండే కాపు సామాజిక వర్గం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. రాష్ట్రంలో తలపెట్టిన అన్ని కాపు భవనాల దుస్థితి దాదాపు ఇలాగే ఉన్నాయి.
రాష్ట్రంలో బీసీ, కాపులకు మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ సర్కారు చూస్తోంది. ఈ ప్రభుత్వం కాపులతో పాటు బీసీలకు కూడా ఏమీ చేయకుండా రెండు వర్గాలనూ వంచించింది. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి సమాజంలో అశాంతి నెలకొనకుండా అందరికీ సమన్యాయం అందించడానికి కృషి చేస్తుంది. బీసీ వర్గాల రిజర్వేషన్లకు, హక్కులకు భంగం కలగకుండా కాపు సామాజిక వర్గం వారికి లబ్ధి చేకూర్చడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యం.
దెబ్బ కొట్టే సమయం వచ్చింది
రాష్ట్ర రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కాపులను అన్ని రంగాల్లో జగన్ ప్రభుత్వం దగా చేసింది. కాపుల పునాదులపై దెబ్బ కొట్టింది. ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీని దెబ్బకొట్టే సమయం కాపు సామాజికవర్గానికి ఆసన్నమైంది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ, కాపు సామాజిక వర్గాల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి తమ శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీలు, కాపులపై ఉంది.
- కొణతాల రామకృష్ణ,
అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి