వరల్డ్ వాక్: దేశాభివృద్ధి పై దృష్టి పెట్టాల్సిన సమయమిదేనా?

by Ravi |   ( Updated:2022-12-06 19:15:52.0  )
వరల్డ్ వాక్: దేశాభివృద్ధి పై దృష్టి పెట్టాల్సిన సమయమిదేనా?
X

విదేశీ పరిశ్రమలు మనదేశంలో స్థాపించడానికి ముమ్మర కసరత్తు చేయాలి. తద్వారా, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెంది, నిరుద్యోగాన్ని నివారించగలం. ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడానికి వీలు కలుగుతుంది. రాబోయే 2047 భారత్ సెంచున్యరీ సెలబ్రేషన్స్ నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాబోయే 2023 సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్కువ జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవిస్తున్న ప్రస్తుత తరుణంలో మన దేశ జనాభాకు అన్ని వేళలా 'ఉచితాల' తాయిలాలు ఇస్తూ పెంచలేము. ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఉచితాలు, సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయి తప్పా, పౌరులు సమగ్ర అభివృద్ధికి దోహదం చేయవని పాలకులు, పౌరులు గ్రహించాలి.

ప్రతిష్టాత్మక జి-20 సంస్థకు డిసెంబర్ ఒకటిన భారత్ సారథ్యం చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వస్తున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పుల నేపథ్యంలో భారత్ కూడా సమయోచిత నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలి.‌ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం(russia-ukraine war) నేపథ్యంలో నాటో దేశాలు(nato countries) రష్యాపై అనేక ఆంక్షలు విధించడం, ఉత్తర కొరియా తరచూ క్షిపణులు ప్రయోగించడం, తైవాన్ విషయంలో తరచూ అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు చెలరేగడం వంటి విషయాలు ప్రస్తుతం ప్రపంచ దేశాలపై పెను ప్రభావం చూపుతున్నాయి.‌ 'జియా పాలిటిక్స్, జియా ఎకనమిక్' విషయాలు తరచూ మారుతున్న ఈ కాలంలో భారత్ జి-20 సారథ్యం(g-20 summit) కత్తి మీద సాము లాంటిది.‌

మన భారతదేశం ఇండో-పసిఫిక్ దేశాలతో ఎక్కువ ఆర్థిక, వ్యాపార సంబంధాలు కలిగి ఉంది.‌ దీనికి భిన్నంగా మన పొరుగు దేశమైన చైనా పశ్చిమ దేశాలతో పాటు, మన పొరుగు దేశాలతో ఎక్కువ ఆర్థిక, వ్యాపార, పెట్టుబడుల విషయంలో చాలా బలీయంగా ఉంది. ఈ సౌత్ ఏషియాలో అన్నింటా 'రీజినల్ కాంప్రెహెన్షివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ (Regional Comprehensive Economic Partnership) ద్వారా ఇప్పటికే చైనా ఆధిపత్యం చెలాయిస్తున్నది. దాదాపు చాలా దేశాలకు చైనా ఉత్పత్తిదారుగా ఉంది. 2021 గణాంకాల ప్రకారం చైనా-ఆసియాన్ దేశాల మధ్య జరిగిన వ్యాపార విలువ 878 బిలియన్ అమెరికన్ డాలర్లు.‌ ఇదే సమయంలో భారత్ -ఆసియన్ దేశాలు మధ్య జరిగిన వ్యాపార విలువ కేవలం 78 బిలియన్ అమెరికన్ డాలర్లు.‌ దీనిని బట్టి మనదేశం సౌత్ ఆసియన్ దేశాలతో ఎంత ఎక్కువగా వ్యాపార సంబంధాలు మెరుగు పరచుకోవాలో ఇకనైనా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.

అమెరికా సామ్రాజ్యవాదం

2014లో భారత్ తీసుకున్న 'ఈస్ట్ పాలసీ' ఇండో-పసిఫిక్ దేశాల మధ్య రాజకీయ పరిణామాల మీద ప్రభావం చూపుతుందని మరువరాదు.‌ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో భారత్ కూడా 'క్వాడ్' కూటమిలో చేరుట వలన ఇండో-పసిఫిక్ దేశాల మధ్య వర్తక వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. అదే సమయంలో పొరుగు ఏషియన్ దేశాలతో మన సంబంధాలు తగ్గుముఖం పట్టాయి. క్వాడ్ కూటమి(Quad alliance) ఏర్పాటు ద్వారా అమెరికా సామ్రాజ్యవాదాన్ని మరో రూపంలో ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోందని చైనా, రష్యా(russia) ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇండో-పసిఫిక్ దేశాలు ప్రపంచంలో 60 శాతం జీడీపీ, 50 శాతం వ్యాపారం కలిగి ఉన్నాయి.

సౌత్ ఈస్ట్‌లో చైనాను నియంత్రించే దిశగా అమెరికా క్వాడ్ కూటమి ఏర్పాటు చేసి, మన దేశాన్ని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక్కడే భారత్ సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ప్రస్తుతం జి-20 సారథ్యం(g20-summit-hyderabad) అందిపుచ్చుకున్న తరుణంలో మన పొరుగు దేశాలతో సౌత్ ఏషియా దేశాలతో ఆర్థిక పెట్టుబడులు, వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకోవాలి.‌ ఇప్పటికే జపాన్(japan), యూరోపియన్ యూనియన్(european union) దేశాలు ఈ ప్రాంతంలో పట్టు పెంచుకుంటున్నాయి.‌ భారత్ నిశితంగా పరిశీలించి, మన అవకాశాలు మెరుగుపరచుకోవాలి.

ఆ పరిశ్రమలను ఆహ్వానించాలి

ప్రపంచ వ్యాపారంలో చైనా(china) 15 శాతం వాటా కలిగి ఉండగా, మన భారతదేశం కేవలం 2 శాతం వాటా కలిగి ఉన్నది. ఇప్పటికే కొన్ని కారణాల వలన కొన్ని పరిశ్రమలు చైనాను వదిలి వెళుతున్నాయి. ఇటువంటి పరిశ్రమలను చాకచక్యంగా జపాన్, వియత్నాం(vietnam) వంటి దేశాలు ఆహ్వానిస్తూ తమ తమ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసుకోడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో భారత్ కూడా చైనాను విడిచి వెళుతున్న పరిశ్రమలను మనదేశంలో స్థాపించడానికి ముందస్తు చర్యలు చేపట్టాలి. గతిశక్తి, ఆత్మ నిర్భర్ భారత్(atmanirbhar bharat), మేక్ ఇన్ ఇండియా(make in india) వంటి పథకాల అమలు ద్వారా స్వదేశీ పరిశ్రమలు స్థాపించడమే కాకుండా విదేశీ పరిశ్రమలు మనదేశంలో స్థాపించడానికి ముమ్మర కసరత్తు చేయాలి. తద్వారా, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెంది, నిరుద్యోగాన్ని నివారించగలం. ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం(Foreign exchange) ఆర్జించడానికి వీలు కలుగుతుంది.

రాబోయే 2047 భారత్ సెంచున్యరీ సెలబ్రేషన్స్(2047 centenary celebrations) నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాబోయే 2023 సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్కువ జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవిస్తున్న ప్రస్తుత తరుణంలో మన దేశ జనాభాకు అన్ని వేళలా 'ఉచితాల' తాయిలాలు ఇస్తూ పెంచలేము. ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఉచితాలు, సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయి తప్ప, పౌరులు సమగ్ర అభివృద్ధికి దోహదం చేయవని పాలకులు, పౌరులు గ్రహించాలి.

అందరికీ ఉపాధి కల్పించాలి

దేశ జీడీపీ(gdp), తలసరి ఆదాయం(Per Capita Income) పెరిగి, వాస్తవ అభివృద్ధి సాధించడానికి, ప్రతీ ఒక్కరికీ కూడు, గూడు,గుడ్డ లభించాలంటే అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి.‌ ప్రతీ సంవత్సరం కొన్ని లక్షల మంది యువత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. వీరందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే పారిశ్రామిక, సేవా రంగాలలో మరింత పెట్టుబడులు ఆహ్వానించడం మన ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం.వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి.

కావున జి-20 సారథ్యం వహిస్తున్న ప్రస్తుత మన భారతదేశం(g-20 summit,hyderabad) ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని దేశ భవిష్యత్తుకు భరోసా కలిగించే రీతిలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.‌ అదే సమయంలో ప్రపంచ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడానికి, సుస్థిర శాంతిని కాపాడే ప్రయత్నంలో తన వంతు పాత్ర సమగ్రంగా పోషించాలని కోరుకుందాం.


ఐ. ప్రసాదరావు

63056 82733

Advertisement

Next Story