బీసీగణనా? కులగణనా?

by Ravi |
బీసీగణనా? కులగణనా?
X

కొన్ని నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం, బిహార్‌ రాష్ట్రంలో చేపట్టిన కులగణనకు సంబంధించిన ప్రధాన అధికారి అయిన ఐ.ఏ.ఎస్. అధికారి రాజేందర్‌‌ను ఆహ్వానించి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. బిహార్‌ పరిణామాలను ఆయన సవివరంగా వివరించడంతో తెలంగాణ ప్రభుత్వం కులగణన నిర్వహించాలని సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చింది. అప్పటికే వకుళాభరణం కమిషన్‌ ప్రభుత్వానికి సూచించిన సిఫారసుల మేరకు మంత్రి మండలి సైతం కులసర్వేకు ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించుకున్నది. అందుకు అనుగుణంగా జీవోఎంఎస్‌. నెం. 26ను మార్చి 15న ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఇది ఇంతవరకు సవ్యంగానే ముందుకు సాగింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయాన్ని విస్మరించింది. జీవో విడుదల చేసి ఇప్పటికీ సుమారు ఆరు నెలలు దాటవస్తున్నా.. కులసర్వేకు సంబంధించిన నిర్దిష్టమైన ప్రణాళికలతో ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్‌కు కొత్త పాలక మండలిని నియమించింది. ఈ కమిషన్‌నే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్‌ల శాతాన్ని నిర్ణయించడానికి వీలుగా నియమించినట్టు జీవోలో తెలిపింది. దీంతో కులగణన అంశం మాటేమిటని బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.

ఈ నేతలకు స్పష్టతనివ్వాలి!

స్థానిక సంస్థల ఎన్నికలను ఓటర్ల జాబితా పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లలో చెప్పినా.. బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాత్రం కులగణన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని బహిరంగ సమావేశాలలో ప్రకటిస్తున్నారు. దీని కారణంగానే ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఇటీవలి బీసీ కమిషన్‌ జీవోలో కేవలం బీసీ కులాల సర్వే అంటున్నారు. మరి ముఖ్యమంత్రి, మంత్రులు దీనిపై పూర్తి భిన్నమైన ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వానికి నిర్మాణాత్మక విధాన నిర్ణ యాలు ఉండాలి. సమిష్టిగా మంత్రిమండలిలో చర్చించుకుని దరిమిలా, ప్రభుత్వ పాలసీని ప్రజలకు తెలియపరచాలి. కులగణన వలన అందుబాటులోకి వచ్చే గణాం కాలు, సమాచారం ఆధారంగా చర్యలను చేపడితే సమాజంలో అంతరాలు తగ్గడానికి, అభివృద్ధిని అందుకోని వర్గాలను ప్రగతి పథంలోకి తీసుకురావడానికి గొప్ప అవకాశంగా తీసుకొని ప్రభుత్వం తన ప్రణాళికలను కొనసాగించాలి.

కుల సర్వే చేయడమే బెటర్!

కులగణన వెంటనే చేపట్టాలని రాష్ట్రంలో క్రమంగా ఉద్యమాల తీవ్రత పెరుగుతూనే ఉంది. ఆమరణ దీక్షల స్థాయికి చేరుకుంది. కులసంఘాల నేతలకు దీనిపై ఒక స్పష్టత ఇస్తే అనవసర ఆందోళనలు దూరమవుతాయని గట్టిగా నమ్ముతున్నాం. రేవంత్‌ ప్రభుత్వం కులగణన చేస్తామని జీవో ఇచ్చి జాప్యం చేయడం సరైన పద్ధతి కాదు. అందుకే వీలైనంత తొందరగా రాష్ట్రంలో మొత్తం జనాభా కులసర్వేకు ప్రభుత్వం ముందుకు రావాలి. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టబోయేది కేవలం బీసీ కులాల సర్వేనా? లేదా మొత్తం కుల సర్వేనా? సమాజానికి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజల్లో అనవసర గందరగోళాన్ని సృష్టించిన వాళ్లమవుతాం.

దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు

99599 12341

Advertisement

Next Story

Most Viewed