- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఎన్నికల్లో 1989 ఫలితం పునరావృతమవుతుందా?
అది 1989వ సంవత్సరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సంవత్సరం. అప్పటికి రెండుసార్లు తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1983 వరకు రాష్ట్రంలో అఖండ విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీకి అది మింగుడు పడలేదు. ఎలాగైనా 1989 ఎన్నికల్లో విజయం సాధించాలని వ్యూహాలకు పదును పెట్టింది. సరిగ్గా అందుకు ఏడాది క్రితం అంటే 1988వ సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించారు. చేతిలో మంత్రదండంతో ఉండే మర్రి చెన్నారెడ్డి నిజంగానే 1989 ఎన్నికల్లో రాష్ట్రంలో మంత్రమే వేశారు. ఎవరి ఊహలకు అందని రీతిలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారు. ఇందుకోసం సరిగ్గా ఏడాది ముందు పీసీసీ పగ్గాలు చేపట్టిన మర్రి చెన్నారెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కాలని వేసిన మంత్రం ఫలించింది.
అప్పుడు ఫలించిన వ్యూహం
1982 లో పుట్టిన తెలుగుదేశం పార్టీ 1983వ సంవత్సరంలో ప్రభంజనం సృష్టించడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కకావికలమైంది. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యం కొనసాగించింది. అందులో రెడ్డి సామాజిక వర్గం వారే అత్యధికంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1983లో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందిన సమయంలోను కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ 1983లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే, నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు అనంతరం 1984లో అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. 1983 కన్నా 1985లో మరిన్ని ఎక్కువ సీట్లు సంపాదించి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అసలే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం, అందులో రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. కమ్మ సామాజిక వర్గం నుంచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో 1989 ఎన్నికల్లో ఎలాగైనా రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కడమే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి పావులు కదిపారు. ఇందు కోసం పార్టీలకతీతంగా 1988లో హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో రెడ్డి సామాజిక వర్గం అంతా సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఆ వ్యూహం ఫలించింది. తత్ఫలితంగా తెలుగుదేశం పార్టీ 1989 ఎన్నికల్లో ఓడిపోయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతర్గత కుమ్ములాటల ఫలితంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మర్రి చెన్నారెడ్డిని దింపేసినప్పటికీ, ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అటు పిమ్మట కోట్ల విజయభాస్కర్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం.
ఆ వర్గానికి గండి కొట్టాలని..
సరిగ్గా అప్పుడు మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుసరించిన వ్యూహాన్నే, ప్రస్తుతం తెలంగాణలో అమలు చేయాలని రెడ్డి సామాజిక వర్గం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా రెడ్డి సామాజిక వర్గం వ్యక్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని వారి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనకు అనుగుణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుండగా, కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తూర్పు జగ్గారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాడు మర్రి చెన్నారెడ్డి అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యూహం అమలులో ఈ సామాజిక వర్గం రెండుగా చీలి బీఆర్ఎస్‌కు లాభం చేస్తుందా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. లేకుంటే బీఆర్ఎస్ నుంచి గెలుపొందినప్పటికీ పార్టీలకతీతంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని ఎలాగైనా తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని రెడ్డి సామాజిక వర్గానికి దక్కేలా చేయాలని తద్వారా రాష్ట్రంలో వెలమల ఆదిపత్యానికి గండి కొట్టాలన్న ఆలోచన రెడ్డి సామాజిక వర్గంలో స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ ఏ మేరకు సఫలీకృతం చేసుకుంటుందో వేచి చూడాలి.
-మల్లెబోయిన శ్రీనివాస్,
94939 72283