AP మన్‌ కీ బాత్‌’ ఆలకిస్తారా... ?

by Ravi |   ( Updated:2023-08-01 03:05:27.0  )
AP మన్‌ కీ బాత్‌’ ఆలకిస్తారా... ?
X

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకోవడానికి ప్రతినెలా ‘మన్‌ కీ బాత్‌’ నిర్వహిస్తారు. 2014 అక్టోబర్‌లో మొదలైన ‘మన్‌ కీ బాత్‌’ ఇప్పటికే 103 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. దేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు అన్ని ప్రదేశాల ముచ్చట్లూ తన ‘మన్‌ కీ బాత్‌’లో చెప్తుంటారు. కానీ, ఎందుకో మరి... ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ‘మన్‌ కీ బాత్‌’ (ఆకాంక్షలను) మాత్రం ఆయన ఎప్పుడూ చెప్పరు!!

‘ఆ.. మన ఏపీకేం మన్‌ కీ బాత్‌ ఉంటుందిలే!’ అనుకుంటే, మీరూ ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల్లాగే ఆలోచిస్తున్నట్టు లెక్క! ఎందుకంటే, ఒకవేళ ‘ఏపీకా మన్‌ కీ బాత్‌’ నిర్వహిస్తే... ప్రజలు విభజన హామీలను ఏకరువు పెడతారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్‌ ఏమయ్యాయని అడుగుతారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు ఎందుకివ్వట్లేదంటారు. పరిశ్రమలేవి? ఉద్యోగాలేవి? అని ప్రశ్నిస్తారు. అంతకు మించి తొమ్మిదేళ్లు గడిచినా మాకు రాజధాని ఏది, అమరావతి భూమి పూజకు మీరు తీసుకొచ్చిన పార్లమెంట్ మట్టి, నీళ్లలో ఉన్న రహస్యం ఏంటి? అని ధైర్యంగా అడుగుతున్నారు. ఇదీ ‘ఏపీ మన్‌ కీ బాత్‌’! పీపుల్స్‌ పల్స్‌ బృందం రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజల మనసులోని మాటను తెలుసుకుంటోంది. ఈ నేపథ్యంలో వారు ప్రధానంగా విభజన హామీల గురించి, అభివృద్ధి గురించి అడుగుతున్నారు. హైదరాబాద్‌ లాంటి రాజధానిని నిర్మించడం ఏపీకి సాధ్యంకాదా..? అని బాధపడుతున్నారు.

ఆంధ్రా నేతలకు వినపడదా..?

ఎక్కడో ఢిల్లీలో ఉండే ప్రధాని మోదీకి ఏపీ ప్రజల ‘మన్‌ కీ బాత్‌’ వినపడలేదంటే... ‘సరేలే’ అనుకోవచ్చు. కానీ, నిత్యం ప్రజల్లోనే ఉంటామని చెప్పుకునే వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన నాయకులకైనా ‘ఏపీ మన్‌ కీ బాత్‌’ వినిపించుకోవాలి కదా?! 40 ఏళ్ల కింద తెలుగువాడి ఆత్మగౌరవం కోసమే పుట్టిన తెలుగుదేశం ఇప్పుడు తెలుగు ప్రజల కోసం ఏం చేస్తున్నది? ఏపీ యువకులు, శ్రామికులు, రైతుల మనోభావాలకు అనుకూలంగానే అధికార వైఎస్సార్సీపీ నడుచుకుంటుందా? జనం కోరికలను తెలుసుకొనే జనసేన ముందుకెళ్తుందా? అంటే ఈ పార్టీ పేర్లలోనే ప్రజలున్నారు తప్ప, ప్రజలతో సంబంధాలు ఏనాడో కోల్పోయాయి. ప్రజలు అనుకుంటున్నది ఒకటైతే, పార్టీలు చేస్తున్నది మరొకటి! క్షేత్ర స్థాయిలో పార్టీలకు, ప్రజలకు ఉన్న ఈ గ్యాప్‌ స్పష్టంగా కనపడుతోంది.

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు..

గత ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు ఇస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తేస్తామని వైఎస్సార్సీపీ ప్రచారం చేసుకుంది. 22 మంది ఎంపీలను గెలిపిస్తే, ఈ నాలుగేళ్లలో ప్రత్యేక హోదా గురించిగానీ, విభజన హామీల గురించిగానీ మాట వరసకు కూడా పార్లమెంటులో లేవనెత్తలేదు. కానీ, సమర్థింపుగా బీజేపీకి తగినంత సంఖ్యా బలం ఉంది కాబట్టి, వీలున్నప్పుడు విభజన హామీలను డిమాండ్‌ చేస్తున్నామని కప్పదాటు ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఎన్డీఏలో నేరుగా భాగస్వామ్య పక్షం కాకపోయినా, మోదీ ప్రభుత్వానికి జగన్‌ అవసరమైనప్పుడల్లా పార్లమెంటులో మద్దతు ఇస్తున్నారు. బీజేపీ ఎలాంటి బిల్లు తీసుకొచ్చినా సమర్థిస్తున్నారు. ఇక, టీడీపీ కూడా వైఎస్సార్సీపీతో పోటీ పడి పార్లమెంటులో బీజేపీకి మద్దతు తెలుపుతున్నది. ఢిల్లీలో ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే, గల్లీలో పవన్‌ కళ్యాణ్‌ కూడా బీజేపీ జపమే చేస్తున్నారు. మోదీ కాస్త వంగమంటే ఈ మూడు పార్టీల వాళ్లు సాగిలపడి వంగివంగి దండాలు పెడుతున్నారని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను పట్టించుకోకుండా కేవలం ‘బీజేపీ మన్‌ కీ బాత్‌’ వింటూ ఈ మూడు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను తాకట్టు పెడుతున్నాయనే విమర్శలున్నాయి.

అందరూ బీజేపీ పక్షమే..

రాష్ట్రంలో ఒక ఎంపీ స్థానం కూడా లేని బీజేపీకి ఏపీ నుండి 25 ఎంపీల మద్దతు లభించడం దేశ రాజకీయాల చరిత్రలోనే విశేషం. బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నందుకు ప్రతిఫలంగా జగన్‌ పరిమితికి మించి అప్పులు పొందుతున్నారు. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జగన్‌ తమ దత్త పుత్రుడంటూ ప్రశంసించారు. బీజేపీ నేతలు దక్షిణాదిన తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో గవర్నర్లతో రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా... ఏపీలో మాత్రం జగన్‌ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా ఏదో ఒక పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉంది. ఆఖరికి ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా ప్రతిపక్షం ఉంది. కానీ, ఏపీలో మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ కోర్టులోనే ఉండటం గమనార్హం! అందరూ ప్రభుత్వ పక్షమే అయితే, ప్రజల పక్షం ఎవరుంటారు? ఇక, 2014 నుంచి 2019 మధ్య ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం గొంతెత్తిన స్వయం ప్రకటిత మేధావులంతా మూగబోయారు. జగన్‌ బావ చల్లని చూపు కోసం, ఆయన కళ్లల్లో ఆనందం చూడటం కోసం వాళ్లంతా ఇప్పుడు నోరే మెదపడం లేదు.

జనం ఎటువైపు ఉన్నారు..?

ఏడాది కింద ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ గుంటూరు జిల్లా ఇప్పటంలో ప్రకటించిన నాటి నుంచే పీపుల్స్‌ పల్స్‌ బృందం క్షేత్రస్థాయిలో పొత్తుల గురించి అడగటం మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఏ మూలన అడిగినా 90 శాతం మంది వైఎస్సార్సీపీ అభిమానులు తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలంటున్నారు. దీనికి తగ్గట్టుగానే సింహం సింగిల్‌గా వస్తుందని వైసీపీ చెప్తోంది. ఇక, జనసేన, బీజేపీ పొత్తును మాత్రం ఎవ్వరూ జీర్ణించుకోవడం లేదు. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాలని 85 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. అయితే, ఈ 85 శాతం మంది ఈ రెండు పార్టీల మధ్య మూడో పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని కుండలు బద్దలు కొడుతున్నారు. అక్కడక్కడా కొంతమంది బీజేపీకి బదులు కమ్యూనిస్టులతో కలిసినా ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు. బీజేపీ పొత్తు విషయంలో టీడీపీ, జనసేన పార్టీలు తమ కార్యకర్తలు, నాయకులతో రహస్య ఓటింగ్‌ నిర్వహించినా నిస్సందేహంగా ఇదే అభిప్రాయం వెలువడుతుంది.

కాంగ్రెస్‌, బీజేపీలను వెలివేశారు..

రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్‌ని, విభజన హామీలను నేరవేర్చకుండా దాగుడుమూతలాడుతున్నందుకు బీజేపీని ప్రజలు ద్వేషిస్తున్నారు. ఈ రెండు పార్టీలకు ఏపీలో ఆదరణ అనేది సమీప భవిష్యత్తులో కూడా ఒక కల మాత్రమే! పీపుల్స్‌ పల్స్‌ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ప్రతివర్గం ఈ రెండు పార్టీలను క్షమించబోమని చెప్పడమే దీనికి తార్కాణం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలపడాలని కొత్త అధ్యక్షురాలిని నియమించిన బీజేపీ, ముందుగా ఏపీ పరిస్థితులను అధ్యయనం చేయాలి. 2009లో ఏపీలోని 175 స్థానాలకుగాను 159 చోట్ల పోటీ చేసిన బీజేపీ కేవలం 2.46 శాతం ఓట్లు పొంది, 159 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే... 4 గెలిచి 5 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఇక, 2019లో 173 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగితే, అన్ని చోట్లా డిపాజిట్‌ కోల్పోయింది. నోటాకు వచ్చిన 1.28 శాతం కంటే తక్కువ 0.84 శాతం ఓట్లతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

బీజేపీ అంటే భయం ఎందుకు..?

నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీని చూసి ఆంధ్రాలోని ఈ మూడు ప్రధాన పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి? ఎందుకు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నాయి? అంటే, 2019లో వైఎస్సార్సీపీకి బీజేపీ లోపాయికారిగా సహకరించినందుకే ఓడిపోయామని టీడీపీ, జనసేన భాష్యం చెప్పుకుంటున్నాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలతో పాటు నిధుల విషయంలో టీడీపీని కేంద్రం ఇబ్బంది పెట్టిందనే ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలు సక్రమంగా జరగాలంటే తమకు బీజేపీ అండ అవసరమని టీడీపీ, జనసేన భ్రమపడుతున్నాయి. కానీ, ఏదైనా ఒక రాష్ట్రంలో తనకు నచ్చిన పార్టీని బీజేపీ అధికారంలోకి తీసుకురాగలదా? ఈ ప్రశ్నకు వాస్తవిక పరిస్థితుల ఆధారంగా సమాధానాన్ని అన్వేషించాలి. ఎందుకంటే, ఒకవేళ బీజేపీకి అంత శక్తే ఉంటే పశ్చిమబెంగాల్‌, బీహార్‌, హిమాచల్‌, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? తమిళనాడులో బీజేపీ చెప్పినట్టే నడుచుకున్న అన్నాడీఎంకేని ఎందుకు తిరిగి గెలిపించుకోలేకపోయింది? ఢిల్లీ, పంజాబ్‌లలో ఏం చేయగలిగింది?

అంతెందుకు, తెలంగాణలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నాయకులను వదిలేసి, బీజేపీ నాయకుల డబ్బు సీజ్‌ చేస్తున్నప్పుడు కనీసం ప్రతిఘటించగలిగిందా? ఏపీలో నాటి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసులు కేసు పెట్టినప్పుడూ, బీజేపీ నాయకుడు సత్యకుమార్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేసినప్పుడైనా ముందుకొచ్చి సాయం చేయగలిగిందా? రోజూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడే ఒక వైసీపీ ఎంపీని సీఐడీ వేధిస్తుంటేనైనా కనికరించిందా? పైగా తన నియోజకవర్గానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రొటోకాల్‌ ప్రకారం ఆ ఎంపీని ఆహ్వానించకపోతే, కనీసం బీజేపీ అభ్యంతరమైనా చెప్పిందా? ఇలాంటి సంఘటనలను ప్రాక్టికల్‌గా పరిశీలించి, అధ్యయనం చేస్తే... రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం నామమాత్రమేనని టీడీపీ, జనసేనకు తెలిసొస్తుంది. బీజేపీకి రాష్ట్రంలో ప్రజా మద్దతు లేకపోయినా వారిచేతిలో ఉన్న ఈడీ, సీబీఐ, ఐటీ ఎజెన్సీలంటే పార్టీలకు భయం. తాము చేసిన తప్పులు బయటపడుతాయనే భయంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే...

టీడీపీ, జనసేన భయపడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, పరోక్ష పొత్తు సాగిస్తున్న వైఎస్సార్సీపీ గెలుపుకు తలుపులు తెరిచినట్టే! తొమ్మిదేళ్లలో విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న బీజేపీతో అంటకాగితే, అది టీడీపీ, జనసేనలకు ధృతరాష్ట్ర కౌగిలే అవుతుంది! అయినా, రాష్ట్ర ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా ముందుకెళ్తామంటే... బీజేపీతో పొత్తు అవసరాన్ని, ఇప్పటి వరకు రాష్ట్రానికి బీజేపీ చేసిన న్యాయం గురించి, ఈ పొత్తు ఫలితంగా భవిష్యత్తులో రాష్ట్రానికి కలిగే లాభం గురించి ప్రజలకు వివరించడం టీడీపీ, జనసేనకు పెద్ద సవాల్‌గా మారుతుంది. రాష్ట్రంలో 95శాతం మంది ముస్లిం ఓటర్లు బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. 2014లో బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీకి కేవలం 33 శాతమే ముస్లిం ఓట్లు వస్తే, 2019లో బీజేపీకి దూరం కావడంతో 46 శాతం ముస్లింలు టీడీపీకి ఓటేశారు. టీడీపీ అత్యధిక సీట్లు కోల్పోతున్న రాయలసీమలో 18 లక్షలకు పైగా ముస్లిం ఓట్లున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో నడ్డా, విశాఖలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్సీపీకి ఉన్న ముస్లిం, క్రిస్టియన్‌ ఓటును పదిలంగా ఉంచడానికే తప్ప, పొత్తు పెట్టుకుంటే టీడీపీ, జనసేనలకు మేలు చేసే అవకాశమే లేదు.

ప్రజల తీర్పే.. వారి తలరాతలు!

ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు పొలిటికల్‌ బాక్సర్‌ అయ్యి ఉండి కూడా, ఏడాదికో మాట, ఎన్నికకో యూ టర్ను తీసుకుంటూ తన ప్రతిష్టను తానే దెబ్బతీసుకుంటున్నారు. మళ్లీ బీజేపీతో జతకడితే ఆయన ప్రతిష్ట మసకబారడం ఖాయం. 2019 ఓటమికి ప్రజాతీర్పే కారణమని ఇప్పటికీ ఆయన ఒప్పుకోలేకపోతున్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు! ప్రజా తీర్పే రాజకీయ పార్టీల తలరాతలు!! దీనిని అర్థం చేసుకుని, ‘ఏపీ మన్‌ కీ బాత్‌’ని ఆలకించి వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన నడుచుకుంటేనే వారికి భవిష్యత్తు ఉంటుంది. ఒక్కసారి ఆయా పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అనేది విశ్వసనీయ సంస్థలతో సర్వే చేయించుకోవాలి. క్షేత్ర పరిస్థితులను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసిన తర్వాతే, నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో చారిత్రక తప్పిదానికి పాల్పడిన వారవుతారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవంటారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ విషయం మరోసారి రుజువవుతుంది.

- జి.మురళికృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

[email protected]

Advertisement

Next Story

Most Viewed