మణిపూర్‌ మంటల్ని ఆపలేమా..!?

by Ravi |   ( Updated:2023-05-30 23:45:28.0  )
మణిపూర్‌ మంటల్ని ఆపలేమా..!?
X

భారత ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మణిపూర్‌ జనాభా దాదాపు 34 లక్షలు. ఇక్కడ ‘మెయితీ’ తెగకు చెందిన హిందూ ప్రజలు లోయ ప్రాంతంలో (వ్యాలీ ఏరియా) మెజారిటీగా ఉన్నారు. మెయితీ జాతీయ భాషను అధికంగా మాట్లాడే మణిపుర్‌లో మాదకద్రవ్యాల దురలవాటు పెద్ద సమస్యగా నిలుస్తూ ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణంగా నిలుస్తున్నది. కొండ ప్రాంతాల్లో (హిల్‌ ఏరియా) నాగా, కుకీ-జో మైనారిటీ తెగలు జీవిస్తున్నారు. వీరిలో మెజారిటీ క్రిస్టియన్‌ మతాన్ని ఆచరిస్తున్నారు. అయితే వివిధ జాతుల మధ్య వైరుధ్యాలతో మణిపురి సమాజం అశాంతికి నెలవుగా మారింది. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, తరుగుతున్న వనరులు, జనాభా పెరుగుదల, నిరుద్యోగం, హిందూ ముస్లిం విభేదాలతో మణిపూర్‌లో సమైక్యతకు విఘాతం కలుగుతోంది. ఎస్టీ జాబితాలో తమను చేర్చాలని ఆందోళన చేస్తున్న మెజారిటీ మెయితీ వర్గ ప్రజలకు, తమ ఉనికి ప్రశ్నార్థకం కావచ్చనే భయపడుతున్న మైనారిటీ గిరిజన కూకీ సమూహాల మధ్య 2023 మే 02న జరిగిన అల్లర్లలో 60 మంది వరకు మరణించడం, కనీసం 250 మంది అమాయక పౌరులు గాయపడడం, దాదాపు 1,700కు పైగా భవనాలు అగ్నికి ఆహుతి కావడం, 35,000లకు పైగా మణిపురీ పౌరులు ప్రాణాలు కాపాడుకుంటూ శరణార్థులుగా ఇండ్లు వదిలి ఖాళీ చేతులతో పారిపోవడం జరిగింది.

అల్లర్లకు కారణాలు..

నేడు మణిపూర్‌లో మెయితీ, కూకీ, నాగా వివిధ వర్గాల మధ్య దీర్ఘకాలికంగా నెలకొన్న విభేదాలు భగ్గుమనడం, కేంద్ర రాష్ట్ర పాలకులు, రాజకీయ వ్యవస్థలు సకాలంలో స్పందించకపోవడంతో వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య రేగిన హింసాత్మక ఘటనల్లో ప్రాణ ఆస్తి నష్టం భారీగానే జరిగింది. కూకీ-జో, నాగా మైనారిటీ గిరిజన తెగల మధ్యనే కాకుండా మెజారిటీ మెయితీ (50 శాతం జనాభా), కుకీ-జో, నాగా జాతుల మధ్య విభేదాలు కూడా భగ్గుమనడం తరుచుగా చూస్తున్నాం. మెజారిటీ మెయితీ వర్గాలకే అధిక ప్రభుత్వ నిధులు కేటాయిస్తున్నారని, కూకీ, నాగా గిరిజన తెగల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు అందడంలేదని రెండు వర్గాలు పోరుకు పూనుకుంటున్నాయి. మణిపూర్‌లో అమలులో ఉన్న ప్రత్యేక అధికారాలు కలిగిన సాయుధ బలగాల పట్ల స్థానికుల వ్యతిరేకత, సాయుధ బలగాలపై స్థానిక మహిళల మానభంగ ఆరోపణలు కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. మే 02 తారీఖు చెలరేగిన ఆందోళనలు హద్దులు దాటి రెండు గ్రూపుల మధ్య పోరులో అపార ప్రాణ నష్టం, అపార ఆస్తి నష్టం జరిగింది. మణిపూర్‌లోని మెజారిటీ మెయితీ వర్గానికి చెందిన ప్రజలను ఎస్టీల జాబితాలో చేర్చాలని అనాదిగా కోరుతూ ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మెయితీలను ఎస్టీలుగా గుర్తిస్తే పేదరికం అనుభవిస్తున్న కూకీ గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగి తమ అవకాశాలు సన్నగిల్లుతాయని భావిస్తున్న గిరిజన కూకీలు ఆగ్రహించడంతో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. రెండు వర్గాల మధ్య అల్లర్లు తారస్థాయికి చేరి, వందల ప్రాణాలు గాల్లో కలవడం, వేల మంది గాయపడడం, 30 వేల మంది సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

ప్రభుత్వ నిర్ణయాలు కారణమే!

మెయితీ వర్గాల వారికి ఎస్‌టీ రిజర్వేషన్ న్యాయమైనదేనని దినిపై కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖకు సిఫార్సు చేయాలని రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడంతో తమకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్న ఇతర మైనారిటీ వర్గాలకు ఈ తీర్పు పుండు మీద కారం చల్లినట్లయింది. దీంతో మెయితీలకు అనుకూలంగా ఉన్న రాష్ట్ర హైకోర్టు తీర్పును వ్యతిరేకించిన ‘ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ మణిపూర్‌, అసెంబ్లీ ‘హిల్‌ ఏరియా కమిటీ’ చైర్మన్‌లకు కోర్టు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంతో హింసాగ్ని మరింత పెరిగిందని తెలుస్తున్నది. దీంతో ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ సంఘం రాష్ట్రంలో నిరసన ర్యాలీలు నిర్వహించడం, అది హద్దులు దాటి హింసాత్మకంగా మారడం, రెండు తెగల మధ్య దూరం పెరగడం జరిగింది.

అలాగే బిరేంద్ర సింగ్‌ నాయకత్వంలోని మణిపూర్‌ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం సాయుధ దళాలు, యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌, కూకీ నేషనల్‌ ఆర్గనైజేషన్‌ పట్ల ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా గొడవ పెరగడానికి కారణమయ్యాయి. పైగా రాష్ట్రంలో చర్చిల కూల్చివేత, డ్రగ్ అక్రమ వ్యాపారం, మెయితీలు ఇతర గిరిజన భూములు కొనవచ్చనే ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడానికి కూకీ-జో తెగ సమూహాలు హింసాత్మక దారులను ఎంచుకున్నాయి. ఈ హింసాత్మక ఘటనల్లో అమాయక ప్రజలు శరణార్థులుగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళుతున్నారు.

మణిపూర్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం, అన్ని వర్గాలతో చర్చలు జరపడం, మైనారిటీలకు రక్షణ చర్యలు చేపట్టడం, మెజారిటీ వర్గాల అభిప్రాయాలను గౌరవించడం, మాదకద్రవ్యాల రాకెట్లను కట్టడి చేయడం, తీవ్రవాద గ్రూపులను నియంత్రించడం, ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా సమగ్రాభివృద్ధి దారులు వేయడం, అందరికీ సమన్యాయం అందించడం, అసమానతలు తగ్గించేలా చర్యలు తీసుకుని మణిపూర్‌లో శాంతి పావురాలు స్వేచ్ఛగా ఎగిరేలా సానుకూల వాతావరణాన్ని నెలకొల్పాలి. ఇలాంటి సంక్లిష్టతల నడుమ శాంతియుతంగా విభేదాలు పరిష్కరించుకోవాలి.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037

Advertisement

Next Story

Most Viewed