సెప్టెంబర్ 17 పై సైద్ధాంతిక చర్చ ఎందుకు?

by Ravi |   ( Updated:2024-09-17 01:15:30.0  )
సెప్టెంబర్ 17 పై సైద్ధాంతిక చర్చ ఎందుకు?
X

సెప్టెంబర్ 17ను విమోచనమా, విలీనమా... వంటి సైద్ధాంతిక చర్చలకు పోకుండా ఈ తేదీని 'ప్రజాపాలన' దినోత్సవంగా ఖరారు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనం సృష్టించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి సరిగ్గా పదేండ్లు పూర్తి కావస్తుంది. 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా'! అని గర్జించిన గద్దర్ మన మధ్య లేరు. అయితే 'పొద్దు' 2014 లోనే పొడిచింది. కానీ అందరికీ వెలుతురు నివ్వలేదన్న నిరాశ తెలంగాణ ప్రజల్లో ఉన్నది. ఆ నిరాశా నిస్పృహల వల్లనే ప్రజలు కేసీఆర్‌ను ఇంటికి పంపి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు.

'తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే అంతా అయినట్టు కాదు. అసలు పనంతా అక్కడి నుంచే మొదలవుతుంది' అని 'ఒడువని ముచ్చట'లో ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. సరిగ్గా ఆ మాటలు ఆచరించవలసి ఉన్నది. అందులో కేసీఆర్ ఫెయిలయ్యారు. రేవంత్ రెడ్డి తన 9 నెలల పాలనలోనే అద్భుతాలు చేయలేరు. కానీ ప్రజామోద కార్యక్రమాలు చేపట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఉద్దేశ పూర్వకంగా విస్మరించిన అంశాలన్నింటినీ రేవంత్ పూర్తి చేయాలనుకోవడం వెనుక నిర్దిష్ట వ్యూహం ఉన్నది.

'తెలంగాణ 2' నే బెటర్!

2014 నుంచి 'తెలంగాణ 1' పాలన గత డిసెంబర్ వరకు సాగింది. ఇక తొమ్మిది నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని 'తెలంగాణ 2' గా నిర్వచించడం సబబుగా అనిపిస్తున్నది. కేసీఆర్ ప్రజాపాలన సాగించలేదా? అని ప్రశ్నించేవారున్నారు. రేవంత్ రూపొందించిన 'ప్రజాపాలన'కు, కేసీఆర్ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించారు. కేసీఆర్ సర్కారు తొలి టర్మ్ బాగున్నట్లే కనిపించింది. అయితే ఎన్నికలను 'ముందస్తు'కు జరిపి రెండో టర్మ్ కూడా అధికారంలోకి వచ్చారు. ప్రతి పక్షాలు సిద్ధంగా లేనప్పుడే 'సర్జికల్ స్ట్రైక్' చేసే ఉద్దేశంతో అలా 'ముందు'కు జరపకపోతే బహుశా రెండోసారి ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చేవారో తెలియదు. అందుకే తెలంగాణ ప్రజల గోడు 'ఒడువని ముచ్చట'గానే మిగిలిపోయింది.''తెలంగాణకు న్యాయం జరగడానికి చేసే ప్రయాణంలో ప్రత్యేక రాష్ట్రం గమ్యం మాత్రమే. అదే అంతిమం కాదు. చిన్న చిన్న విజయాలకు కూడా పెద్ద పోరాటం అవసరం కావచ్చును'' అని ప్రముఖ రచయిత, సంపాదకులు కె. శ్రీనివాస్ 2001లోనే వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా ''న్యాయపోరాటం కొనసాగించవలసిందే'' అని కూడా ఆయన అన్నారు.

బయటపడ్డ 'లోపలి మనిషి'

తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం పోరాడారు. పరపాలన పీడ విరగడ కోసం యుద్ధం చేశారు. అరవై ఏండ్ల కల సాకారమైంది. దాని క్రెడిట్ అంతా తనదేనని కేసీఆర్ చెప్పుకుంటారు. శ్రీకాంతాచారి సహా 1200 మందికి పైగా బలిదానాలు, ఎందరో ఎన్నో విధాలుగా చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితమే తెలంగాణ అని ప్రజలకు తెలుసు. మరీ ముఖ్యంగా మావోయిస్టుల ఆధ్వర్యంలో 1997లో వరంగల్‌లో జరిగిన 'వరంగల్ డిక్లరేషన్' తెలంగాణ మలి ఉద్యమానికి ఊపిరులూదింది. కేసీఆర్ ఏ క్షణంలో 'మాది ఫక్తు రాజకీయ పార్టీ' అని ప్రకటన చేశారో, ఉద్యమ పార్టీ బూర్జువా పార్టీగా, స్వార్ధపూరిత, అవకాశవాద పార్టీగా, భూస్వామ్య, పెట్టుబడిదారుల పార్టీగా మారిపోయింది. కేసీఆర్ లోపలి 'ఫ్యూడల్ మనిషి' వెలుపలికి రాగానే ప్రజల్ని బానిసలుగా, వెట్టిచాకిరి చేసేవారుగా, నీ బాంచన్ కాల్మొక్తా అనే వాళ్లుగా వ్యవహరించారు. సామాన్య ప్రజలు, రైతులను 'బిచ్చగాళ్లుగా' మార్చడానికి ప్రయత్నించారు.

తిరస్కరించలేదు.. తిరగబడ్డారు

బీఆర్ఎస్ 'కుటుంబ పాలన'ను ప్రజలు 2023లో తిరస్కరించారనడం కన్నా 'తిరుగుబాటు' చేశారని అనడమే సమంజసం. రాష్ట్ర రాజధానిని మరింత నంజుకు తినడానికి వీలుగా వలసవాదులకు పెద్దపీట వేశారు. అదే సమయంలో తెలంగాణ వాదానికి, ఉద్యమానికి గుండె అయిన పల్లెల్లో ఆయన గ్రాఫ్ పతనమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమితంగా బాధపడుతున్న సెక్షన్లు.. 1.రియల్ ఎస్టేట్ వ్యాపారులు. 2. ఈ రాష్ట్రాన్ని నంజుకు తినడానికి అలవాటుపడ్డ అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు. ''అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. వాటిని చూపి అదే అభివృద్ధిగా ప్రజల్ని భ్రమల్లో పెట్టారు'' అని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ వాదం పట్ల, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం పట్ల రేవంత్‌కు స్పష్టత ఉన్నది. ''తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ స్వేచ్ఛను హరించడాన్ని ఆమోదించరు. తమ ఆత్మగౌరవానికి భంగం కలిగితే రియాక్షన్ వైల్డ్‌గా ఉంటుంద''ని, అలాగే '' తెలంగాణ ప్రజల చైతన్యం ఎంతటి వారినైనా ఇంటికి పంపుతుంది'' అని ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.

మార్పు గట్టిగా మొదలైంది!

రేవంత్ రెడ్డి 9 నెలల పాలనలో అద్భుతాలు చేయలేదు. కానీ ప్రజామోద కార్యక్రమాలు చేపట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల రుణమాఫీతో మంచి పేరు సంపాదించారు. అలాగే 'హైడ్రా' పేరిట ఒక ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పి యావత్తు తెలంగాణలో కబ్జాల నుంచి చెరువులు, కుంటలు, జలాశయాలను కాపాడే ఉద్యమానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇక ప్రొఫెసర్ కోదండరాంకు తగిన గౌరవం లభించింది. అందెశ్రీ 'జయ జయహే' గీతానికి గుర్తింపు వచ్చింది. విద్యా, వ్యవసాయ కమిషన్లు ఏర్పాటయ్యాయి. అర్హులైన రైతులకే రైతు భరోసా ఇవ్వదలచుకున్నారు. తెలంగాణ రాజకీయ రంగస్థలాన్ని క్రమంగా రేవంత్ సంపూర్ణంగా ఆక్రమించుకుంటే తమ పరిస్థితి ఏమిటి అన్నదే టిఆర్ఎస్ నాయకుల ఆవేదన. కౌశిక్ రెడ్డి, గాంధీ ఎపిసోడ్‌లో టిఆర్ఎస్ ఓవర్ యాక్షన్, 'హైడ్రా'‌పై నిందలు... రేవంత్ రెడ్డికే మేలు చేస్తున్నవి.

- ఎస్.కె.జకీర్

జర్నలిస్టు.

90526 31212

Advertisement

Next Story