- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యమం చేసింది ఎవరు... సంబరాలు ఎవరు చేస్తుర్రు..!?
‘నేను రాను బిడ్డో సర్కార్ దావాఖానాకు’ అని ఇంకా వినిపిస్తూనే ఉంది...! ‘బొంబాయి పోతా రాజిగో’ అని సంతోషన్న పాడిన పాట ఇంకా మోగుతూనే ఉంది...! తెలంగాణ కొలువులు పక్క రాష్ట్రం వానికి ఇస్తుంటే ‘అవ్వోనివా నువ్వు అయ్యోనివా తెలంగాణోనికి తొలి పాలోనివా’ ఇంకా గుండెల్లో రగులుతూనే ఉంది... స్వరాష్ట్ర సాధన కోసం మా అమరుల బిడ్డల కోసం మేము పాడిన పాట ‘వీరులారా వీర వనితలారా అమ్మ ఋణంకై ఒరిగినారా’ ఇంకా అలపిస్తూనే ఉంటిమి.
పరాయి పాలన కష్టాల కడలి నుండి గట్టెక్కాలని సబ్బండ వర్గాలన్ని కలిసి సద్దన్నం తిని రోడ్ల మీద పోరుచేస్తే తెలంగాణ సాధించింది ఏంది? ప్రాణాలు సైతం అర్పించిన మా అమరవీరుల బిడ్డలకు వచ్చిన గుర్తింపు ఏది? వారి త్యాగాల ద్వారా సాధించిన స్వరాష్ట్రం సాగించిన ఖ్యాతి ఏది? ఉద్యమాల ఉయ్యాల ఊగుతూ , పోరు పాటలు పాడిన యువకులకు ఇచ్చిన కొలువులు ఎన్ని? నీళ్ళ పేరుతో రణం సాగించి తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆపింది ఎన్ని?
తెలంగాణ మూగపోయిందా?
నైజాంలను తరిమిన ఈ తెలంగాణ, రజాకార్లను వెంబడించిన ఈ తెలంగాణ, రైతు సాయుధ పోరాటం నడిపిన ఈ తెలంగాణ, పోరాడే బిడ్డలని ఎందరినో కని, పెంచి ప్రపంచానికి పరిచయం చేసిన ఈ తెలంగాణ, లోకానికే ఉద్యమం పాఠాలు బోధించిన ఈ తెలంగాణ, సమర గీతాలు ఆలపించిన ఈ తెలంగాణ, విద్యార్థి, యువజన హక్కుల పోరాటం కోసం వేదికైన ఈ తెలంగాణ, పుడితే ఒక్కటి - చస్తే రెండు అని పుట్టిన కాడ నుండి గిట్టే వరకు సమ సమాజం కోసం పోరాడిన బిడ్డలకు ఊపిరి పోసిన ఈ తెలంగాణ, తొలి మలి దశ ఉద్యమ స్ఫూర్తితో కెరటంలా ఎగిసిన ఈ తెలంగాణ ఎందుకో ఈ రోజు మూగబోయింది.
స్వరాష్ట్ర సాధనే ఈ తెలంగాణకు, మా తల్లి తెలంగాణకు విముక్తి అని మేము పోరు చేస్తే... లాఠీ దెబ్బలు మేము తింటే, అక్రమ కేసులు మేము బనాయించుకుంటే, తెలంగాణ రాష్ట్రం కోసం మా బిడ్డలు ప్రాణాలు అర్పిస్తే, తెలంగాణ కోసం మేము జీవితాలు త్యాగం చేసి చెయ్యెత్తి జై తెలంగాణ అని మా రాష్ట్రం మాకు కావాలే అని శ్రీ కృష్ణ కమిటీ ముందు నినదిస్తే, ఉద్యోగాలు వదిలి, చదువులు వదిలి ఆంధ్రోడి సర్కార్‌పై మేము తిరుగుబాటు చేస్తే ఇప్పుడు గద్దెను ఎక్కిన ఈ రాజులు చేసింది ఏంది?
మిద్దెనెక్కి తెలంగాణను ఏలుతూ నాటి నైజాం పాలనను, మొన్న ఆంధ్ర సర్కార్‌ను కలిపి సాగిస్తున్న ఈ పాలనలో మాకు దక్కిన వాటా ఏడబాయే? సామాజిక న్యాయం కోసం , సమ సమాజం కోసం, నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం, ఆత్మగౌరవం కోసం మేము పోరాడి, ప్రాణాలు అర్పించి సాధించిన రాష్ట్రంలో మా బిడ్డలకు ఇచ్చింది ఎవరు ఎత్తుకుపోయే? ఎరుపు రంగు పూలు పూసిన తెలంగాణాలో కరువు వచ్చిన పాట పాడి, కన్నీళ్లు వచ్చినా పాట పాడి, ఆర్తనాదాన్ని కూడా పాటగా మలిచి కన్నీళ్లనే మంచినీరుగా తాగుతూ ముందుకు కదిలి ఒకటిగా పోరాడితే ఇప్పుడు తెలంగానోడి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి మీద పడ్డట్టు ఉండే
మనవాడే మనల్ని ముంచితే..
నైజాం రాజులని ఓడించిన మనం, దొర గడిలనే కూల్చిన మనం, రజాకార్లను వెంబడించిన మనం, బాంచన్ గిరిని తన్ని తరిమిన మనం... ఎందుకో ఈ చిన్న దొరను తరమలేకపోతున్నం ... ఆయన ఇసిరే బిస్కెట్‌లకు అమ్ముడుపోయిన వారి పిడికిలినీ అంతమొందిస్తూ... ఆ దొరకు, ఆ దొర కొరకు వ్యతిరేకంగా పోరాడే బిడ్డలు ఎందరో...?
దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం, ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం, అన్న మహాకవి కాళోజీ మాటలు యాది చేస్తూ మన వాడే , మన ప్రాంతం వాడే మనల్ని ముంచుతుంటే వాడిని పాతర వేయడం మన బాధ్యత.
అమరుల బలిదానాలు మీద సాధించుకున్న రాష్ట్రంలో అమరుల కుటుంబాలకు గుర్తింపు ఏది? వారిని స్మరించుకోవడం కోసం వారి స్థూపం నిర్మించడం కోసం దశాబ్ద కాలం పట్టింది, ఆ కుటుంబాలను ఆదుకోవటానికి శతాబ్దం పడుతుందో ఏమో!? చీమల పుట్టను పాములు అక్రమించినట్లు. ఉద్యమం ఎవరు చేసే... సంబరాలు ఎవరు చేస్తుర్రు,
లాఠీ దెబ్బలు తిన్నది ఎవరు, పదవులో ఎవరు? ఉండే... తిండి, నిద్ర మానేసి రోడ్ల మీద వంట వార్పులు చేసుకుంటూ, ఆంధ్రకు అనుకూలం అనే ముద్ర పడిన జిల్లాలో ఉద్యమం చేసి అందరం కలిసి రాష్ట్రం సాధిస్తే, ఉద్యమం చేసే వారి మీద దాడులు చేపించిన వారు, ధర్నాలు చేస్తుంటే ఎగతాళి చేసిన వాళ్ళు, సకల జనుల సమ్మె చేస్తుంటే అడ్డుకున్న వారు నేడు దశాబ్ది తెలంగాణ సంబరాలు చేస్తున్నారు..
వారికి ఆపన్న హస్తమేది?
ఆత్మగౌరవం కోసం పోరాడి తెలంగాణ సాధించుకుంటే, అదే అంద్రోడి సర్కార్‌లో ఉద్యమాన్ని అడ్డుకున్న పెత్తందారులు ఇప్పుడు సంబరం పేరుతో గల్లీలో తిరుగుతూ ఉన్నారు. పెట్టుబడిదారులు తెలంగాణ నాయకులు ఐతే, ఉద్యమం చేసిన వారు కనుమరుగై పోయారు. చేతికి అందిన బిడ్డలను, ఉద్యోగం చేసే కొడుకులను పోగొట్టుకొని గుండెలు అవిసేలా విలపించిన ఆ కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన ధైర్యం ఏది.
ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళకు కట్టేలా పాడిన, రాసిన పాట అమ్ముడుబోయినా.., జనాలను జాగృతి చేసిన మాటకు సంకెళ్లు వేసినా... ‘తెలంగాణ ఎప్పుడూ నిండు గర్భవతి గానే ఉంటది, ప్రశ్నించే గొంతుకలను కంటనే ఉంటది’ అని రాసిన నర్సన్న మాటలు స్మరించుకుంటూ పిడికిలి ఎత్తి పోరు సాగించటానికి కాళోజీ వారసులుగా, జయశంకర్ సార్ బిడ్డలుగా ఇప్పటికైనా ఒకటిగా కదులుదాం... సామాజిక తెలంగాణ కోసం పోరు చేద్దాం, అమరుల ఆశయాల తెలంగాణను, తెలంగాణ యువత కోరుకున్న తెలంగాణను, రైతన్నల కష్టాల కడలిని దాటించే తెలంగాణను సాధించుకుందాం.
బిచ్చాల అన్వేష్
యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఖమ్మం
96669 17596