మా త్యాగాలకు గుర్తింపు ఏది?

by Ravi |   ( Updated:2023-04-30 00:30:21.0  )
మా త్యాగాలకు గుర్తింపు ఏది?
X

ప్రాణాలర్పించి తెలంగాణ రాష్టాన్ని తెస్తిమి...మాకు అమరవీరుల సంస్మరణ సభలు లేకపాయే... మా కుటుంబాలకు ప్రభుత్వం తరపున గుర్తింపు లేకపాయే, కేసీఆర్‌ను వారు మా ఇంటి పెద్ద కొడుకని, మా కుటుంబాలను అదుకుంటాడనుకున్నాము, కానీ రాష్టం వచ్చి 10 సంవత్సరాలు కావస్తున్నా అమరవీరుల కుటుంబాలతో మాట్లాడరైతిరి, వారి కుటుంబాలకు ఒక భరోసా కలిపించరైతిరి, మా కొడుకు రాష్టం కొరకు త్యాగం చేసినా మాకు పెద్ద కొడుకుగా రాష్ట్ర సాధనలో ముందుండి నడిచిన కేసీఆర్ ఉన్నారని మురిసిపోయాము. ఆయన కేసీఆర్ అమరుల తల్లుల కడుపుకోతని అర్థం చేసుకుంటారని అనుకుని గత 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాము, కానీ పిలుపు మాత్రం రాకపాయే....రాష్టసాధన ఉద్యమం చేసిన కేసీఆర్‌కి ఉద్యమకారులు ఎందుకు గుర్తు రావటం లేదు? ఎందుకు కేసీఆర్‌కి, అమరవీరుల కుటుంబాల వారికి దూరం పెరిగింది? అమరుల తల్లుల కడుపుకోత తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచానికి తెలుసు. ఎంతో మంది అమరవీరుల ఆత్మలు ఈ రోజు వరకు ఘోషిస్తున్నాయని తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు అర్థం కావడం లేదు? ఎల్‌బి నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెట్టగానే 1200 మంది అమరవీరుల త్యాగానికి, వారి కుటుంబాలకు న్యాయం జరిగినట్టేనా?

హామీలు ఏమయ్యాయి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే, పది లక్షలు రూపాయలు మంజూరు, ఒక ఉద్యోగం ఇవ్వగానే వారి బాధలు అన్నీ దూరం అయ్యాయా? ఒక్కసారి కేసీఆర్ ఆలోచన చేయాలి...అసలు అమరుల కుటుంబాలకు ఏం కావాలి ...ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అలాంటి పదవుల కోసం ప్రాణాలు కోల్పోయారా? కాదు కదా. మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకే కావాలని. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కోసం తమ ప్రాణాలు కోల్పోయిన తీరు ప్రపంచంలో ఎక్కడా చూడలేమని, అలాంటి గొప్ప త్యాగనిరతి కలిగిన వారిని ఎక్కడా చూడలేదని వారికిచ్చిన హమీలు ఏమయినాయి?

కేసిఆర్ అడుగులో అడుగు వేసుకుంటూ, నిప్పు అంటించుకుని ఒకరు... ఎదురుగా వస్తున్న ట్రైన్‌కి ఎదురెల్లి ఒకరు.. ఉరి కొయ్యల మీద వేలాడబడి మరొకరు... పురుగుల మందు అమృతంలా భావించి ఒక చెల్లి, ఒక అమ్మ నాన్న తల్లి.. ఇలా అసలు తెలంగాణ భవనం ఎలా ఉంటుందో తెలియని 14 సంవత్సరాల పిలగాడు కూడా నర్సంపేటలో ఆటలాడుకునే వయసులో రాష్టం కోసం ఆత్మ బలిదానం చేశాడు.

మా అభిప్రాయం అక్కరలేదా?

అసలు తెలంగాణ అమరవీరుల సంస్మరణ స్థూపంలో ఏం ఉంది. 179 కోట్ల రూపాయలు వెచ్చించి, ఖర్చు చేసి కట్టే స్థూపం అసలు తెలంగాణ అమరవీరుల సంస్మరణ కోసమా? లేక మేము వీరికి ఏ పని చేయలేదని కట్టినరా?

ఈ స్థూపంలో నిప్పు అంటించుకుని త్యాగం చేసిన ఆనవాలు ఎక్కడా కనిపించవ్. భూమి పూజ నుండి ఈ రోజు వరకు ఈ స్థూపం గురించి అమరుల కుటుంబాలకు ఎటువంటి సమాచారం లేదు. ఈ స్థూపం నిర్మాణ సమయంలో ఒక కమిటీని ఏర్పరచి అమరుల కుటుంబాల విజ్ఞతులను పరిగణలోకి తీసుకొని స్థూప నిర్మాణం చేయాలని విజ్ఞప్తినీ చేసినా పట్టించుకోకుండా

ఈ స్థూపం నిర్మించారు. మేము ఊహించినట్టే మాకు కూడా ఈ రోజు అర్చ్ రూపంలో ఇది అమరవీరుల స్థూపమనీ బయట బోర్డు పెడితే తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది

అసలు ఈ స్థూపంలో ఏం ఉంటాయి అనే అనుమానాలు మాకు ఉన్నాయి. ఈ స్థూపంలో అమరుల సమాచారం ఉంటుందా? ఒకవేళ పెడితే ఏ రూపంలో పెడతారు? వారి ఫొటోతో కూడిన ఆల్బమ్ ఉంటుందా? పోని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన 600 మంది వివరాలు అయినా పెడతారా? అసలు ఈ స్థూపం ఓపెనింగ్‌కు అమరుల కుటుంబాలకు పిలుపు వస్తుందా? శ్రీకాంతాచారి తల్లి కడుపు కోత ఎలానో 1200 వందల మంది వీరుల ఆత్మలు కూడా అలానే కదా, కానీ ఒక్క శ్రీకాంతాచారి తల్లి కడుపుకోతకి న్యాయం జరిగితే అందరికి జరిగినట్లు కాదు కదా? అసలు అమరుల కుటుంబాలకు ఏం కావాలో అడిగే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా?

మేమవరో ఎలా నిరూపించుకోవాలి?

అసలు మేము ప్రభుత్వాన్ని కోరిందేంటి, ప్రతీ వీరునికి న్యాయం చేయాలని, 80 జీఓ అమలు చేయాలని, విద్యా, వైద్య సేవలు అందించాలని, 300 గజాల స్థలంలో పక్కా గృహ నిర్మాణం, ప్రతీ జిల్లాలో అమరుల స్థూప నిర్మాణాలు, ప్రభుత్వం ప్రతీ వీరుని పేరు మీద నివాళి అదే కదా మేం కోరింది. దయచేసి అర్థం చేసుకోండి. మమ్మల్ని పిలిచి మాకేం కావాలో తెలుసుకొని న్యాయం చేయండి. మీరు మా త్యాగలను మర్చిపోలేదు అనుకుంటున్నాం. 179 కోట్ల రూపాయల తో నిర్మించిన ఈ స్థూప నిర్మాణంలో 20 మంది సందర్శనకు వస్తే... వారు కూర్చునే అవకాశం కూడా లేదు. నివాళి అర్పించాలంటే ఒక 20 మందికి కూడా సరిపడ జాగ లేదు. ఒక్క వీరుని పేరు లేకుండా...ఒక్క కుటుంబాన్ని సంప్రదించకుండా వారిని ఎలాంటి అభిప్రాయం అడగకుండా ఏనిమిదేండ్లుగా నిర్మించారు మరి ఏనాడూ మీకు మాతో మాట్లాడాలనిపించలేదా?

ఈ స్థూపం ఆకృతి రూపం దాల్చి ఉంది సరే కానీ త్యాగం ఏ రూపంలో కనపడుతుంది కానీ త్యాగం ఏ రూపంలో కనపడుతుంది. అసలు మేము స్థూపంను చూసే హక్కులేదా? మేము స్థూపం వద్దకు వెళ్తే ఎవరు మీరనే ప్రశ్న అడుగుతూ ఉన్నారు....మేమే అమరవీరుల కుటుంబ సభ్యులమని ఏ విధంగా వారికి చెప్పాలి ఎలా నిరూపించుకోవాలి. ప్రభుత్వపరంగా మాకు ఎటువంటి గుర్తింపనేది లేదు. ఇచ్చిన జీ ఓ 80 తప్ప ఇంకోటి లేదు మాకు. అది కూడా ఇప్పుడు రద్దు చేశారు... మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా త్యాగాలని బ్రతికించి వీరుల కుటుంబాలలో వెలుగు నింపండి. ఆత్మ బలిదానం చేసి విచ్ఛిన్నం అయిన కుటుంబాలకి కాస్త ధైర్యం ఇచ్చి మాతో మాట్లాడండి .

నరేష్ నాయక్

తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక

85005 85982

Advertisement

Next Story

Most Viewed