- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధరలు తగ్గేది ఎన్నడు?

దేశంలో రోజు రోజుకు నిత్యావసర ధరలతో పాటు టమాటాలు, మిర్చి ధరలు అమాంతంగా పెరిగి సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదాయం మూరెడైతే ఖర్చు మాత్రం బారెడవుతుండటంతో బతుకు ఎలా సాగించాలన్న సందిగ్ధంలో పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. ప్రతిరోజు ధరలు పెరుగుతుండడంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. నిత్యావసర, కూరగాయల ధరలు రోజు రోజుకు పెరగడంతో పట్టపగలే వినియోగదారుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. చిల్లర దుకాణాల నుంచి సూపర్ మార్కెట్ల దాకా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతుండటంతో సామాన్య ప్రజలు ఇంటి నుండి మార్కెట్‌కు వెళ్లాలంటే జంకుతున్నారు. నిత్యావసర వస్తువుల బ్లాక్ చేసి ధరలను పెంచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు ప్రకటించిన ఆ దిశగా అధికారుల చర్యలు లేకపోవడంతో వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెరిగిన ధరలతో సామాన్య ప్రజల బతుకులు అస్తవ్యస్తంగా మారాయి.
చుక్కలు చూపుతున్న టమాటా, మిర్చి
దేశంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన సామాన్య ప్రజలు వాడే టమాట ధర విపరీతంగా పెరుగుతోంది. ప్రతిరోజు కిలోకు 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఇక మిర్చి అయితే కొనలేక వెనుదిరుగుతున్నారు. నిత్యావసర వస్తువులైన మంచి నూనె, పాలు, పప్పులు రాకెట్ వేగంతో దూసుకుపోయే పరిస్థితి ఉన్నది. దేశంలో సుమారు 27% మంది సామాన్య పేద ప్రజలు పప్పు వాడకం మానేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు సవరణ చర్యలు తీసుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల వ్యూహాల్లో పథకాలు రచిస్తున్నారు తప్ప దేశ ప్రజానీకం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కనీసం ఆలోచన చేయకపోవడం శోచనీయం. మొక్కుబడి పర్యటనలు చేయడం ద్వారా అసలు సమస్యలకు పరిష్కారం లభించదు అని ఇకనైనా గ్రహించాలి.
కూర'గాయా'లు
దీనికి తోడు దేశవ్యాప్తంగా జూలై నెలలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటికీ, సరైన వర్షపాతం నమోదు కాలేదు. తూతూమంత్రంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు లాభసాటిగా వ్యవసాయ రంగం మార్చేందుకు పాలకులు నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలి. నూతన వంగడాలు పంటల సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు శిక్షణ అవగాహన కల్పించాలి. రాబోయే కాలంలో ఆహార ఉత్పత్తులకు ఆటంకం లేకుండా చూడాలి. తద్వారా దేశ జనాభా అనుగుణంగా ఆహార ధాన్యాల భద్రత కల్పించవచ్చు. అధిక ధరలకు కళ్లెం వెయ్యవచ్చు. జీఎస్టీ నెలకు లక్ష యాభై కోట్ల రూపాయలు సమకూరినా సెన్సెక్స్, నిప్టీ వంటివి లాభాల బాట బాటలో పయనించినా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం నియంత్రణ చేయకుండా ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా దేశం వాస్తవ అభివృద్ధి సాధించలేదని గ్రహించాలి. కూరగాయల ధరలు కిరాణా సరుకులతో పోటీ పడుతున్నాయి.
ఇక డీజిల్, పెట్రోల్, విద్యుత్, వంట గ్యాస్ నిత్యావసర ధరలతో సై సై అంటున్నాయి. నిత్యావసర ధరలతో పాటు కూరగాయల ధరలు రోజురోజుకు ఆకాశం అంటుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వడగాడ్పుల దెబ్బ తగిలినా కోలుకోవచ్చు.. కానీ కూరగాయల దెబ్బ తగిలితే మాత్రం కోలుకోలేం అని ప్రజలు గ్రహిస్తున్నారు.
వెయ్యి తీసుకెళితే... పైసా మిగలడంలే...
ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో వాడుకునే కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు మార్కెట్లో కూరగాయల రేట్లు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొన్నది. రోజువారీ కూలీ చేసే ప్రజలు మూడు పూటలు తిండి తినలేని పరిస్థితి ఎదురవుతుంది. ప్రజలకు అవసరమయ్యే ఏదో ఒక వస్తువు ధర రోజురోజుకు విపరీతంగా పెరగడంతో నిత్యం ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నిరుపేదలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. కనీసం నెలకు సరిపడా కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువులు కొనాలంటే సుమారు రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు తీసుకెళ్తే ఒక్క పైసా కూడా మళ్లీ మిగలడం లేదు. సామాన్య ప్రజలు కూలి పని ద్వారా సంపాదించిన రోజు వారి మొత్తం సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోతోంది. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో దిక్కుతోచని స్థితిలో సామాన్య మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. ధరలు పెరిగిన సందర్భాల్లో ప్రభుత్వం ధరలు నిర్ణయించడమే కాక సహకార సంఘాల ద్వారా, ప్రభుత్వ ప్రత్యేక అమ్మకపు దుకాణాల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు సరుకులు అందించాలి. వ్యాపారస్తుల సరుకుల నిల్వపై ఆధికారుల నియంత్రణ ఉండాలి. నియంత్రణకు మించి సరుకులు ఉంటే వ్యాపారస్తులు వాటిని అనివార్యంగా మార్కెట్లోకి విడుదల చేయాలి. సరుకులు మార్కెట్లోకి రాగానే గత ధరలకు ... ఈ ధరలకు పెద్ద తేడా లేకుండా అమ్మకాలు జరగాలి. ప్రతి మార్కెట్లో, కిరాణం షాపు ముందు ధరల బోర్డు పెట్టాలి. దాన్ని తప్పకుండా అమలుపరచాలి.
లకావత్ చిరంజీవి నాయక్
99630 40960