ఒలింపిక్స్‌లో మనమెక్కడ!?

by Ravi |   ( Updated:2024-08-16 00:45:36.0  )
ఒలింపిక్స్‌లో మనమెక్కడ!?
X

జూలై 26న పారిస్‌లో ప్రారంభమైన విశ్వక్రీడలు పదిహేడు రోజుల పాటు నిర్వహించి 32 క్రీడలు 48 విభాగాలలో 329ఈవెంట్స్‌ను నిర్వహించారు. దీంతో మూడుసార్లు ఒలింపిక్స్‌ను నిర్వహించిన ఏకైక నగరంగా పారిస్ వినుతికెక్కింది. మొత్తం ఈ ఒలింపిక్స్‌లో 329 స్వర్ణ పతకాలతో పాటు 1044 మెడల్స్ ప్రధానం చేయడం జరిగింది. పతకాల వేటలో ఎప్పటిలానే చైనా, అమెరికాలు హోరాహోరిగా తలపడ్డాయి. అమెరికా 40 స్వర్ణాలతో మొత్తం 126 పతకాలు గెలుచుకుని అగ్రస్థానంలో ఉంటే, చైనా 40 స్వర్ణాలతో 91 ఇతర పతకాలను గెలుచుకొని రెండో స్థానంలో నిలిచింది. మనదేశం 6 పతకాలు సాధించి 71వ స్థానంలో ఉంది.

ఆధునిక ఒలింపిక్స్ 1896సం.లో ప్రారంభమైతే, 1900లో జరిగిన రెండో ఒలింపిక్స్‌లో ఇండియా అరంగేట్రం చేసింది. ప్రారంభ ఒలింపిక్స్‌లోనే అదరగొడుతూ భారత్ రెండు పతాకాలను గెలుచుకుంది. అయితే 128 ఏళ్ల చరిత్ర కలిగిన ఒలింపిక్స్‌లో మనం ఇప్పటి వరకు సాధించిన పతకాల సంఖ్య కేవలం 41. అందులో స్వర్ణాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. దేశం సాధించిన పది స్వర్ణాలలో ఎనిమిది హాకీ జట్టే సాధించినవి కావడం కొసమెరుపు. పతకాల మొత్తంలోనూ హాకీదే అగ్రస్థానం.

డిస్‌క్వాలిఫై ఆటలే ఎక్కువ..

పారిస్ ఒలింపిక్స్‌కు అమెరికా నుంచి అత్యధికంగా 558 ప్లేయర్స్ పాల్గొన్నారు. నాలుగున్నర కోట్ల జనాభా ఉన్న స్పెయిన్ నుంచి 383 మంది, కోటి జనాభా ఉన్న బెలారస్ 45మంది ఒలింపిక్స్‌కు వెళితే, 145 కోట్ల జనాభా ఉన్న ఇండియా నుంచి 117మంది మాత్రమే ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడం జరిగింది. పైగా పారిస్ ఒలింపిక్స్‌లో నిర్వహించిన మొత్తం క్రీడలు 32 కానీ అందులో మన క్రీడాకారులు పాల్గొన్నది కేవలం 12 క్రీడలలోని, 16 విభాగాలలో 62ఈవెంట్స్‌ను మాత్రమే ఆడటం జరిగింది. ఇప్పటివరకు మనదేశం ఒలింపిక్స్‌లో ఆడిన వాటికంటే ఆడ టానికి క్వాలిఫై కాకుండా వెనుదిరిగిన వాటి సంఖ్యే అధికం. చాలా ఆటళ్లో ఏళ్లకు ఏళ్లు గడిచినా అర్హతకు నోచుకోక పోవడం దురదృష్టకరం.

ఈ ఒలింపిక్స్‌లో 6 పతకాలు..

ఈసారి ఒలింపిక్స్‌లో గెలిచిన ఆరింటిలో ఒకటి రజతం, ఐదు కాంస్య పతకాలు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరుపున ప్రథమంగా 10.మీ.ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మనుభాకర్ కాంస్యం సాధించడంతో బోణీ మొదలైంది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలుగా మను భాకర్ గుర్తింపు పొందారు. మిక్సడ్ టీమ్ 10మీ.ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మనుభాకర్, సరబ్ జ్యోత్ సింగ్‌లు కలిసి కంచు పతకంను గెలుచుకున్నారు. స్వప్నిల్ కుసలే కూడా పురుషుల 50మీ.ల షూటింగ్‌లో మరో కంచు పతకం చేజిక్కించుకున్నారు. ఈ ఎడిషన్‌లో మూడు పతకాలు షూటింగ్‌లోనే గెలుచుకోవడం విశేషం. మిగతా మూడింటిలో ఒక కాంస్య పతాకాన్ని పురుషుల హాకీ జట్టు గెలిచింది. దీనితో 52 సంవత్సరాల తరువాత వరుసగా రెండోసారి హాకీ జట్టు ఒలింపిక్స్‌లో గెలిచినట్లు అయింది.

ఈ ఒలింపిక్స్‌లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో‌లో రజతంతోనే వెనుదిరిగారు. ఒలింపిక్స్ పురుషుల విభాగంలో భారత్ తరుపున పాల్గొన్న ఏకైక రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్యం దక్కించుకున్నారు. అమన్ ఒలింపిక్ చరిత్రలోనే అతి పిన్న వయసులో పతకం గెలుచుకున్న భారత్ అథ్లెట్‌గా రికార్డు నమోదు చేశారు. మహిళా రెజ్లింగ్‌లో అనూహ్యంగా గెలుపు ముందు నిలిచిన వినేష్ ఫొగట్ స్వర్ణానికి ముందు నిర్థారించిన బరువు కంటే 100గ్రా.లు అధికంగా ఉందని ‌డిస్ క్వాలిఫై కావడం భారతీయులందరిని నిరాశ పరిచింది.

ఆసక్తి కనబరిచే వారిని గుర్తించాలి!

అత్యధిక జనాభా కలిగిన మనదేశం నుండి ఒలింపిక్స్‌లో ఆడేవారు అంతంత మాత్రమే. దీనికి అనేక కారణాలు.. సహజంగా ప్రతి పిల్లవాడు ఆటల పట్ల ఆసక్తిని కనబరుస్తాడు. కానీ క్రీడల పట్ల తల్లిదండ్రులలో అవగాహన లేకపోవడంతో వారి ఆశలను మొగ్గలోనే తుంచివేస్తున్నారు. అసలు దేశంలో సమగ్ర క్రీడా వ్యవస్థ లేదు‌. అందువలన తల్లిదండ్రులు పిల్లలు స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి, వాటిలో ఆడించడానికి వెనకడుగు వేస్తున్నారు. క్రీడల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లలో అరకొర నిధులు కేటాయించడం కూడా ఓ కారణం. అయితే ప్రభుత్వం సమగ్ర క్రీడా విధానం రూపొందించుకుని పాఠశాల స్థాయిలోనే పిల్లల క్రీడానైపుణ్యాలను గుర్తించేలా, పెంపొందించేలా చర్యలు చేపట్టాలి. ఆసక్తి కనబరిచే వారికి శిక్షణనిచ్చి తీర్చిదిద్దాలి. వారి సంపూర్ణ క్రీడా బాధ్యతలను ప్రభుత్వమే చూసుకోవాలి. అలాగే క్రీడాకారులకు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింతగా కల్పించాలి. అప్పుడే పిల్లలు, యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తారు. క్రీడల గురించి ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసి అవగాహనను కల్పించాలి. పాఠశాలలు, కళాశాలలు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తే వచ్చే నాలుగేళ్లకు జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ లో‌నైనా మనం రెండంకెల పతకాలు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది.

డా. సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి

98496 18116

Advertisement

Next Story

Most Viewed