జిల్లాలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి : స్పీకర్

by Kalyani |
జిల్లాలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి : స్పీకర్
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : జిల్లాలో నీటి కొరత లేకుండా, సమృద్ధిగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసన సభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, కాలే యాదయ్యలు పాల్గొని వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లా మొత్తం ప్రజా అవసరాలకు తగ్గట్టుగా నీటి సరఫరా చేపట్టాలన్నారు.

నీటి కొరతను అధిగమించేందుకు గాను ప్రభుత్వం అధిక నిధులను కేటాయించడం జరుగుతుందని స్పీకర్ తెలిపారు. నీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా అవసరమైన బోర్ల మరమ్మత్తు పనులను చేపట్టాలని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా అందించే ఓహెచ్ఆర్ నీటి ట్యాంకులను శుభ్రం చేస్తూ నాణ్యమైన నీటిని సరఫరా చేయాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు కష్టపడి ప్రత్యేక కార్యచరణతో పనిచేసి ప్రజలకు సేవలందించాలని ఆయన తెలిపారు. అలాగే ట్రాన్స్ ఫార్మర్ ల నిమిత్తం దరఖాస్తులు చేసుకున్న రైతులను ఇబ్బందికి గురి చేయకుండా సమస్యను త్వరిత గతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ ఫలాలు..

అర్హులైన ప్రతి పేదవారికి గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు వర్తించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ద్వారా వచ్చిన జాబితాను పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారుల దృష్టికి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేపట్టాలని స్పీకర్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ యువ వికాస్ పథకం కింద యువతకు ఉపాధి కలిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సన్న బియ్యంను పండించేందుకు రైతులను ప్రోత్సహించాలని స్పీకర్ తెలిపారు. సన్న బియ్యం కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల సౌకర్యార్థం నూతన చౌకధర దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అలాగే అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు నష్ట పరిహారాన్ని అందించాలని స్పీకర్ తెలిపారు. పంటలు వేసే సమయం ఆసన్నమైనందున రైతులకు ఎరువులు, విత్తనాలు గోదాముల్లో అందుబాటులో ఉండేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇప్పటికే మంజూరైన రహదారుల నిర్మాణాల పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పీకర్ సూచించారు. సమీక్ష సమావేశంలో సంక్షేమ వసతి గృహాల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు, పెయింటింగ్ వేసిన దృశ్యాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా డిఎస్సిడబ్ల్యూఓ మల్లేశం వివరించారు. తదనంతరం సంక్షేమ వసతి గృహాలకు స్పీకర్ చేతుల మీదుగా వంట సామాగ్రిని అందజేశారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed