- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మణిపూర్.. మంటలను ఎగదోస్తుందెవ్వరు!
దేశాన్ని పాలిస్తున్న ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం సామాజిక రిజర్వేషన్ల ఎత్తివేతకు మొదటి నుంచి కుట్రలు పన్నుతూనే ఉంది. రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేసే యోచనలో భాగంగా కర్ర విరగొద్దు, పాము చావొద్దు అన్న చందంగా ప్రభుత్వ రంగ సంస్థలలో నియామకాలు చేపట్టకుండా నిర్వీర్యం చేయడం. వాటిని నష్టాల్లోకి నెట్టడం. ఆ తర్వాత ప్రైవేటుపరం పేరిట అయిన వారికి అప్పనంగా అప్పజెప్పడం. అందులోని రిజర్వేషన్స్‌ను మాయం చేయడం క్రమంగా ఒకవైపు చేస్తుంది.
మరోవైపు అమలు అవుతున్న రిజర్వేషన్‌లలో ఇబ్బడిముబ్బడిగా అడిగిన వారికి వాటాలు పంచుతూ, వాటి అసలు లక్ష్యాన్నే దెబ్బతీస్తూ అభాసుపాలు చేస్తోంది. జాతుల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టించి ఆ మంటల్లో చలి కాసుకోవడం ప్రభుత్వాలకు పరిపాటే. హర్యానా, రాజస్థాన్‌లలో జాట్, ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ రిజర్వేషన్ పోరాటాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఆ కోవలోనిదే ఇప్పుడు మణిపూర్ మెయితీ, కుకీ తెగల మధ్య మారణహోమం.
ఎందుకీ గొడవలు..
మణిపూర్ రాష్ట్రంలో అత్యధికులు మెయితీ తెగకు చెందినవారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చాలా కాలం పాలించిన రాజవంశం కూడా ఈ తెగవారే. వీరి తరువాత రాష్ట్రంలో సింహభాగం గిరిజనులు. వారిలో ప్రధానమైన తెగలు కుకీలు, నాగాలు. సహజంగా గిరిజనులలో ఉండే అమాయకత్వం, మొండితనం, ధైర్యంతో కూడిన తెగువ వీరిలో నరనరాన జీర్ణించుకుపోయింది. ఆ సహజ స్వభావమే ఒకనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడేలా చేసింది. దేశంలో సాగిన తొలి గిరిజన పోరాటాలలో ఒకటిగా ఈ కుకీ తిరుగుబాటు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి ఉన్న కుకీలు, నాగాలు, ఇతర తెగలు ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ కొండ ప్రాంతాలలో నివసిస్తున్నారు. మొదటి నుంచి వీరందరూ సామాజికంగా ఎస్టీ హోదాలో గుర్తించబడి కొనసాగుతున్నారు. అందువల్ల వీరు నివసించే అటవీ ప్రాంతాలలో వీరికి ప్రత్యేకంగా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లతో పాటు అక్కడి భూములపై ప్రత్యేక ఆదివాసీ హక్కుల చట్టాలను అమలు పరుస్తున్నారు.
అయితే, వీరి కంటే సామాజికంగా ఉన్నత హోదాను అనుభవిస్తున్న మెయితీలు ఈ ప్రాంతాలకు వలస వచ్చారు. నిజానికి వీరు అధికంగా మైదాన, లోయ ప్రాంతాలలో నివసిస్తు వస్తున్నారు. వీరిని సామాజికంగా బీసీ, ఓబీసీలుగా ప్రభుత్వాలు గుర్తించాయి. అయితే కాలక్రమంలో వీళ్ళు తమను కూడా గిరిజనులుగా గుర్తించి విద్య, ఉద్యోగ అవకాశాలతోపాటు, గిరిజనులు నివసించే కొండ ప్రాంతాలలోని భూములపై కూడా సమాన హక్కులు కల్పించాలని పోరాటాలను చేస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికలలో వీరికి మద్దతు పలికిన బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో వారి ఉద్యమానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు మెయితీలు మణిపూర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న మణిపూర్ హైకోర్టు మెయితీలను కూడా కుకీలలాగే ఎస్టీ జాబితాలో కలపాలని తీర్పు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది.
కులాల కుంపట్లను రాజేసి..
మెయితీలను ఎస్టీ జాబితాలో చేర్చితే వారు తమపై ఆధిపత్యం చెలాయిస్తూ తమ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేస్తారని, తాము నివసించే అటవీ భూములను తమకు దక్కకుండా చేస్తారని భావించి రాష్ట్రంలోని అన్ని ట్రైబల్ గ్రూప్స్ కలిసి ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ మణిపూర్‌గా ఏర్పడి సంఘీభావ యాత్రను నిర్వహించాయి. ఆ తరువాత మే నెల నుంచి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా గిరిజనులు తీవ్ర నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టసాగారు. ఇది గిట్టని మెయితీలు తమకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న గిరిజనులపై కోపం పెంచుకుని అమాయక కుకీలు, ఇతర గిరిజనులపై మారణకాండకు తెగబడుతూ వాళ్ల ఆడవాళ్ళపై చేసిన అహంకార, ఆధిపత్య, బలప్రదర్శనకు సంబంధించిన వీడియో ఒకటి 72 రోజుల తరువాత బయటికి రావడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీనిలో మానవత్వం మంట గలిసేలా ఉన్న చర్యలను చూసి మనుషులైన ప్రతి వారు సిగ్గుతో తలదించుకునేలా చేసింది. అయితే గడిచిన మూడు నెలలలో బయటకు వచ్చింది ఈ ఒక్క సంఘటన మాత్రమే. కానీ ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మారణ హోమంలో 142 మంది చనిపోయినట్లుగా, సుమారు 60,000 మంది నిరాశ్రయులయ్యారని, 5,000 దహనకాండ ఘటనలు చోటు చేసుకున్నాయని, 5,995 కేసులు పెట్టి, 6,745 మందిని కస్టడీలోకి తీసుకున్నారని వివిధ మీడియా సంస్థలు చెబుతున్న అంచనా. ఇంతకీ ఏ వెలుగులకీ ప్రస్థానం? నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించడం తప్ప ఏముంది! ఇందు కోసమే మతాల మంటలను, కులాల కుంపట్లను రాజేసి ఓట్లుగా మలుచుకుంటున్న ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు రణరంగం కానిచోటు భూ స్థలమంతా వెదికినా దొరకదు.
డా.సందెవేని తిరుపతి
చరిత్ర పరిరక్షణ సమితి
98496 18166