వికసిత్ భారత్ సాధ్యమవ్వాలంటే..

by Ravi |
వికసిత్ భారత్ సాధ్యమవ్వాలంటే..
X

స్వాతంత్ర్యానంతర ప్రజాస్వామ్య పాలనలో అన్ని వర్గాల ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన స్థాయిలో అభివృద్ధి సాధించాలి. అలా కాకపోతే అది ప్రజాస్వామ్యం అనబడదు. ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే ప్రజల స్వేచ్ఛ, సమానతలు కాపాడబడతాయి. రాజకీయ పార్టీలు, నాయకులు తప్పు చేస్తే వాటి ఫలితాలను లక్షల కోట్ల మంది ప్రజలు అనుభవించాల్సి వస్తుంది. కానీ నేతలకు కేసులు తప్ప శిక్షలు పడ్డ దాఖలాలు చాలా తక్కువ.

ఒక వ్యక్తి పేదగా, నిరుద్యోగిగా ఉండటం వారి తప్పు కానే కాదు. మెజారిటీ ప్రజల, యువత ఓట్లతో గద్దెనెక్కి ఉపాధి, ఉద్యోగాలు కల్పించని పాలకులది ఆ తప్పు. జీవనోపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత. అందుకే ఉపాధి, ఉద్యోగ కల్పన సార్వత్రిక హక్కుగా పార్లమెంటులో చట్టం చేయాలి. కుబేరుల సంపదపై అదనపు పన్ను వేసైనా నిరుద్యోగ, పేదరిక పెనుభూతాన్ని దేశం నుండి తరిమివేయాలి. చట్ట సభల్లో చర్చ జరగాల్సింది దీనిపైన కదా! ప్రజలను, యువశక్తిని నిర్వీర్యం చేస్తే, దేశం విపత్కర పరిస్థితులకు దారి తీస్తుంది. ఆ తర్వాత కాయకల్ప చికిత్స చేస్తే- మరణానంతరం మందు ఇవ్వడం లాంటిదే. దేశంలో స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు, ఎగుమతి-దిగుమతి లావాదేవీల వంటివి దేశ అభివృద్ధికి వాస్తవ ప్రతిబింబాలు కాజాలవు. అత్తెసరు ఆదాయాలతో బతుకు బండి భారంగా లాక్కొస్తున్న సామాన్యుల వెతలు తీరినప్పుడే వికసిత భారతం ఆవిష్కరణ అవుతుంది.

ఇంకా నేల చూపులేనా..?

ప్రజలకు కూడు, గూడు సమకూరిస్తే సరిపోదు. నాణ్యమైన విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలి. ఆదాయ అసమానతలు రూపు మాసిపోయి ప్రతి ఒక్కరూ గౌరవ ప్రదంగా జీవించగలగాలి. వీటన్నింటి విషయంలో మనదేశం ఇంకా నేల చూపులే చూస్తుంది అనడానికి ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా 81 కోట్ల మందికి ప్రభుత్వమే ఉచిత ఆహార ధాన్యాలను ఎందుకు అందించాల్సి వస్తోం ది? ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాల సరసన ఇండి యాకు 111వ స్థానం దాఖలా పడింది. ఈ స్థితిలో మానవ అభివృద్ధిలో వెనుకబడిన భారతదేశ సమగ్ర వికాసానికి ప్రభుత్వాలు చేయవలసిన కృషి ఎంతో ఉంది. కానీ నేడు తాజా పరిస్థితులు చూస్తుంటే ఇవి సాధ్యమనిపిస్తున్నాయా?

దైన్యంలో బాలభారతం..

నింగిని తాకుతున్న నిత్యావసరాల ధరల దాటికి ఎంతోమందికి సమతుల ఆహారం అందని ద్రాక్ష అవుతోంది. దేశీయంగా ఐదేళ్లలోపు చిన్నారులు ముప్పై ఐదు శాతానికి పైగా పౌష్టికాహారలేమితో గిడసబారిపోయారని జాతీయ కుటుంబ సర్వే హెచ్చరించింది. 2022-23 పన్నెండున్నర లక్షలమంది చిన్నారులు బడికి దూరమయ్యారన్న అధికారిక నివేదిక బాలభారత ధైన్యాన్ని కళ్లకు కడుతుంది. జనారోగ్యానికి భరోసాగా నిలవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస వసతులు మృగ్యమౌతున్నాయి. ఖరీదైన ప్రైవేటు వైద్యం దెబ్బకు ఏటా ఆరు కోట్ల కుటుంబాలు అప్పుల సుడిగుండంలోకి చేజారిపోతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఆర్థికంగా ఎగబాకినంత మాత్రాన..

ఈ సమస్యలేవీ తీరకుండా ఆర్థిక వ్యవస్థ ఎన్ని లక్షల కోట్ల రూపాయల స్థాయికి ఎగబాకినా ఏంటి ప్రయోజనం!? అభివృద్ధి అంటే ఆర్థికంగానే కాదు, సామాజికంగానూ ముందడుగు వేయడం. కుల, మత, లింగపరమైన వివక్షలకు అడ్డుకట్ట వేయకపోతే ఇండియా ఎన్నటికీ అభివృద్ధి చెందిన దేశం కాలేదు. భావ ప్రకటన స్వేచ్ఛ తో పాటు పౌర హక్కులన్నింటికీ మన్నన దక్కే సమాజంలోనే ప్రజాస్వామ్యం పరిఢ విల్లగలుగుతుంది. సృజన శక్తుల వికాసం సాధ్యపడి అంతిమంగా దేశానికి మేలు జరుగుతుంది. ఇవే నాటి నిస్వార్థ సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళులు..

- మేకిరి దామోదర్,

95736 66650

Advertisement

Next Story

Most Viewed