ఇదే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష

by Ravi |   ( Updated:2024-02-20 00:30:30.0  )
ఇదే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష
X

కార్యనిర్వహణ శాఖ చేసిన స్వయంకృతాపరాధాలకు కూడా న్యాయ శాఖ వద్ద జవాబుదారీగా ఉండవలసి వస్తుంది. ఉదాహరణకు తెలంగాణలో గత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను చూసినట్లయితే రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించి, చివాట్లు పెట్టి రెండు మార్లు రద్దు చేసినది. నిరుద్యోగుల జీవితాలు అన్యాయం అవ్వకూడదని న్యాయశాఖ అడ్డు తగిలి పరీక్షను రద్దుచేసి ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించి, పూర్తి నియమ నిబంధనలతో సక్రమముగా తిరిగి పరీక్షను నిర్వహించాలని ఆదేశించినది. తాజాగా టీపీపీఎస్‌సి కూడా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిదాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది.

శాసన శాఖ తీసుకున్న నిర్ణయాలను అమలుపరిచేది కార్యనిర్మాణ శాఖ. నిజానికి శాసన శాఖకు నిర్ణయాల్లో సలహాపూర్వకంగా, నిర్ణయం తర్వాత అమలుపరిచే విధంగా కార్యనిర్వహణ శాఖ ఉండాలి. కానీ కార్యనిర్వాహన శాఖపై శాసన శాఖ పూర్తి పెత్తందారీగా మారిపోయింది. అధికార యంత్రాంగం అలసత్వంతో పాటు శాసన శాఖకు బానిసత్వాన్ని కూడా ప్రదర్శిస్తున్నది. ఇటువంటి విధానం వలన పరిపాలనలో ఎన్నో తప్పులు దొర్లాడుతున్నాయి. అవి తప్పని తెలిసినప్పటికీ అధికారులు చూసీచూడనట్టుగా ఉంటున్నారు. ఎన్నో సందర్భాలలో అధికారులు చర్యలకు దిగుదామనుకుంటే శాసనశాఖ అనుమతించకపోవడం, అధికారులపై బెదిరింపులకు దిగటం, మాట వినకుంటే బలవంతపు బదిలీలు చేయటం పరిపాటిగా మారింది.

కనిపించని రక్షణ కవచం

న్యాయశాఖ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కాపాడటమే కాకుండా ప్రభుత్వాలను అదుపు చేస్తున్న విధానం అద్భుతమనే అనాలి. ప్రజాస్వామ్య రక్షణకు ఒక వజ్రాయుధంగా మారింది న్యాయశాఖ. ఇప్పుడు కోర్టులలో నడిచే కేసులలో ప్రజల మధ్య వివాదాల వలన నడిచే కేసుల కంటే, ప్రభుత్వం, ప్రజల మధ్య వివాదాల మీద నడిచే కేసులే ఎక్కువ. అంటే శాసన శాఖ తీసుకునే ఎన్నో నిర్ణయాలు ప్రజలకు, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటున్నాయని అర్థం.ప్రజాస్వామ్యంలో నాలుగో స్థానమైన మీడియాను శాసన శాఖ తన ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తుంది, ఇది ఏనాటికైనా ప్రజాస్వామ్య విధానానికి ప్రమాదమే.

ఈ నాలుగు స్తంభాలాటలో అత్యంత శక్తివంతమైనదిగా శాసన శాఖ మారిపోయింది. ఏకచక్రాధిపత్యంగా నడిపించాలనుకుంటున్న శాసన శాఖకు న్యాయశాఖ అనేది ఒక కొరకరాని కొయ్యగా మారింది.. కానీ ఒక శాఖ మరో శాఖను నియంత్రించడం, అదుపు చేయడం అనేది భారత ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష!

- రాజ్ కుమార్ పాక

రైల్వే కార్మిక నాయకుడు, వరంగల్

95533 33838

Advertisement

Next Story

Most Viewed