- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదీ ప్రజా ఎజెండా! మ్యానిఫెస్టోలు మార్చండి
‘‘ఊపిరి... తీసుకోనివ్వండి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మా అవసరాలు, ప్రాధాన్యతలేమిటో మమ్మల్ని మాట్లాడనిచ్చి, అవి తీర్చే బాధ్యతని ప్రభుత్వాలుగా, పాలకులుగా భుజాలకెత్తుకోండి. అంతే తప్ప, మీకు తోచింది మా నెత్తిన రుద్దకండి’’ ఇదీ, ఎన్నికల ముంగిట తెలుగువాడి ఆవేదన. ‘జనం నిజంగా ఇలా ఆలోచిస్తున్నారా’ అన్న సందేహం ఇది చదివే ఎక్కువమందికి కలగొచ్చు. దీనికి సమాధానం, ‘అవును’ అన్నదే!
నిజానికి వారి గుండెలో గూడు కట్టుకున్నదిదే! కానీ, వారిని అలా మాట్లాడనిచ్చింది ఎక్కడ? వారి ఆశలు, ఆకాంక్షల్ని చెప్పనిచ్చిందెవరు? నిబద్ధతతో దాన్ని మీడియా ప్రతిబింబించిందెప్పుడు? జనం అవసరాలు ఒక మార్గంలో ఉంటే రాజకీయ పార్టీల ఆలోచనలు, సర్కార్ల ఆచరణది మరో బాట! రెంటికీ పొంతనే లేదు! జనాభీష్టం కన్నా తమకు తేలికైన పద్ధతినే పాలకులు జనంపై రుద్దుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, వయసులకు అతీతంగా ఎక్కువ ప్రజానీకం కోరేది పాలకులకు ఎక్కడమే లేదు. ఆ దిశలో... నిజాయితీ విధానాల్లేవు, చిత్తశుద్ధి కార్యాచరణ లేదు. ‘చెక్కర పులిమిన చేదు మాత్ర’ వంటి తప్పుడు విధానాలు, పథకాలతో పబ్బం గడిపేస్తున్నారు. స్వయం సమృద్ధ గ్రామస్వరాజ్యం, స్థానిక ప్రభుత్వాల స్వపరిపాలన, పండుగలా వ్యవసాయ వికాసం, ప్రతి ఊళ్లో బడుల వైభవం, ఊరూరా వైద్య సదుపాయం, తరాలకు సరిపడా సహజవనరుల సంరక్షణ.... ఇదీ, వ్యవస్థ చెరబడితే మూగవోయిన జనం గుండె చప్పుడు. కానీ, గొంతు పెగలనీటం లేదు. ఈ అయిదారు అంశాలే ప్రజా ఎజెండా! దీన్నే అన్ని పార్టీలు తమ ఎన్నికల ఎజెండా చేయాలి. ఎన్నికల ప్రణాళికలు రూపొందించుకునే కాలమిది. వాటితోనే రేపు ఓట్లడగాలి. గెలిచినవారు యధాతథంగా అమలు పరచాలి.
జనజీవనాన్ని ప్రభావితం చేసే అంశాలు చర్చకే రావటం లేదు. విధాన రూపకల్పనలో, చట్టసభల్లో, ప్రసారమాధ్యమాల్లో ఇవి ప్రధానాంశాలే కావటం లేదు, కానీయటం లేదు. ఇతరేతర విషయాలు, ఫక్తు రాజకీయాలు, పరస్పర నిందారోపణలు తెరపైకి వచ్చి అసలైన ప్రజా సమస్యల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. జనం ఆకాంక్షలు వెల్లడయ్యే దారులు మూసుకుపోతున్నాయి. ఉచితాలు, సబ్సిడీల భిక్షతో.. తనకు తోచినట్టు జరిగేలా రాజ్యం అందరి గొంతుల్నీ నొక్కేస్తోంది. ప్రభుత్వంలో తాము భాగమనే భావన ప్రజలకు కలగటం లేదు, అది పాలకులూ గుర్తించడం లేదు. ‘ఇష్టారాజ్యం, వారిచ్చిందే భాగ్యం’ అన్నట్టు తయారయింది.
స్వపరిపాలనను బతికించండి
‘మా ఓటు మమ్మల్ని వేసుకోనీయండి, మా ప్రభుత్వాన్ని మమ్మే ఏర్పరచుకోనీయండి’ అంటున్నారు జనం. రాజ్యాంగ స్ఫూర్తిని చంపి, అధికారాలు, నిధుల పరంగా స్థానిక సంస్థల్ని కేంద్ర-రాష్ట్ర సర్కార్లు నిర్వీర్యం చేశాయి. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికైన సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు నామమాత్రమయ్యారు. నిరసనలు పరాకాష్టకు చేరి, భిక్షాటనలు, ఆత్మహత్యల దాకా వెళ్లింది. ఆర్థిక సంఘం నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి దక్కనీయడం లేదు. అకౌంట్లలోకి డబ్బు వేసిందే తడవు, సర్కారే వెనక్కి తీసుకోవడాన్ని మించిన ఆర్థిక నేరం ఇంకోటేముంటుంది ‘గ్రామసభ’కు తెలియకుండా రోజూ వేల కొలది లారీల్లో ఇసుక అమ్మేస్తారు. ‘నదిని నలిపేస్తారా’ అని హైకోర్టు మందలించినా బుద్దిరాదాయె! గుట్టలన్నీ నేలమట్టమౌతాయి. ఖనిజాలు గల్లంతు! పచ్చగా బతుకుతున్న పల్లెలోకి ఓ ఫ్యాక్టరీ వస్తుంది. జనం బతుకుల్లో కాలుష్య విషం నింపేదాక గ్రామ పంచాయతీకే కబురుండదు. గ్రామసభ మాటకు చెల్లుబాటుండదు. గ్రామంలో ఓ చేతిపంపు రిపేరుకూ... ఊరి నుంచి రాజధాని దాకా మొత్తం వ్యవస్థ కదలాలి. ప్రజలెన్నుకున్న సర్పంచ్ చెక్‌పవర్ ఆయువు, కలెక్టర్ నుంచి ఎమ్మార్వో దాకా అధికారుల అరచేతిలోనే! సర్కార్లిచ్చే అరకొర భిక్షతో తాము ఇంకెన్నాళ్లు బతుకులీడ్చుకు రావాలి అని జనం ప్రశ్నిస్తోంది. ప్రజా ఎజెండా బలపడుతోంది. 73, 74 రాజ్యాంగ సవరణల స్ఫూర్తిని కాపాడుతూ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేస్తేనే జనాభీష్టానికి పట్టం కట్టినట్టు!
ఊరును ఉద్ధరిస్తేనే...
ఊరెందుకు వల్లకాడైంది? గ్రామాల్లో ఉపాధి-ఉద్యోగ అవకాశాలు కొండెక్కాయి. ఆధారమైన వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరిగింది. ప్రకృతి సహకరించక దిగుబడి-మార్కెట్ లేక రాబడి తగ్గి రైతు, రైతు కూలీల బతుకులు కునారిల్లాయి. చేతి వృత్తులు నిస్తేజమయ్యాయి. జనం వలసబాట పట్టి ఊళ్లు ఖాళీ అయ్యాయి. ఉన్నవాళ్లలో అధికులు మద్యం మత్తులో జోగుతున్నారు. సర్కార్లు రాబడిగా చూస్తున్న మద్య విధానం మారాలి. కంటితుడుపుగా కాసులివ్వటం కాకుండా... వ్యవసాయాన్ని చిత్తశుద్ధితో ఆదుకోవాలి. పెట్టుబడి వ్యయం తగ్గేలా చూడాలి. మార్కెట్ కల్పించి, కనీస మద్దతు ధర భరోసా కల్పించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్ని ఏర్పరచాలి. గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ క్రమంలో... వారి నైపుణ్యాలు పెంచే శిక్షణ, స్వయం ఉపాధి, రుణసదుపాయం, పెట్టుబడి వంటివి లభ్యమయేలా చూడాలి. స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు అందరూ ఊర్లను ఉద్ధరించే నిర్దిష్ట బాధ్యతల్ని నిర్వర్తించాలి. అప్పుడుగాని గ్రామ స్వరాజ్యానికి అర్థం ఉండదు. కోవిడ్ విపత్తు కాలంలో చూశాం, ఎటుతిరిగి జనాలు తిరిగి గ్రామాలవైపే మళ్లారు. ఇది సుస్థిరత సాధించాలంటే, సొంతూరికే ‘తిరుగుముఖం వలసలు’ పెరగాలి.
సదువుల సంగతే పట్టదా?
దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. కానీ, వరుస ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వరంగంలో విద్య రోజురోజుకు మసకబారుతోంది. పాఠశాల విద్య నుంచి ఉన్నత వృత్తి విద్య వరకు అన్ని స్థాయిల్లో నాణ్యత పడిపోయి ప్రజలు ఏమీ చేయలేని నిస్సత్తువ ఆవరిస్తోంది. ‘మా బతుకిలా అయింది, కనీసం మా పిల్లలైనా.....’ అనే సగటు మనిషి సెంటిమెంట్‌ను సొమ్ముచేసుకునే వ్యాపార రంగం విద్య, వైద్యంలో తెలుగునాట బలంగా పాతుకుపోయింది. అభివృద్ధి చెందిన సమాజాల్లో ఈ రెండు రంగాలను ప్రభుత్వం తన అధీనంలోనే ఉంచుకుంది. ఇక్కడా అదే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ‘ఆప్’ సర్కారు బడుల్ని ప్రశంసనీయంగా బాగుచేసింది. దానికి ప్రతిపలంగా, ఎమ్సీడీ ఎన్నికల్లో ఆప్ జయకేతనం ఎగిరేసింది. కానీ, దేశంలో దాదాపు అన్ని ప్రభుత్వాలూ విద్యారంగం నుంచి వైదొలగుతూ... ప్రయివేటు రంగానికి ఎర్రతివాచీలు పరిచాయి. ఫలితంగా విద్య ఖరీదై ప్రజలు అల్లాడుతున్నారు. కూలీలు, చిన్న-మధ్యతరహా వేతనజీవుల పాతిక-యాభై శాతం రాబడి పిల్లల చదువులకే చెల్లవుతోంది. ఈ పరిస్థితిని తప్పించమని, బడుల్ని ప్రభుత్వాలే నిర్వహించాలని కోరుకుంటున్నారు.
ఆరోగ్య భరోసాకు అలమటింపు..
మన ప్రజారోగ్య వ్యవస్థ ఎంత లోపభూయిష్టమో... కోవిడ్ కష్టకాలంలో తెలిసొచ్చింది. ప్రయివేటు వైద్యానిదెంత రాక్షస దోపిడీయో కూడా తేటతెల్లమైంది. చాన్నాళ్లుగా నిర్లక్ష్యం చేసిన రంగం వైద్యం. నిధుల కేటాయింపుల్లేక, ఆధునీకరణకు నోచక, అవినీతిని నియంత్రించక... ప్రజారోగ్యం దుర్బరంగా తయారయింది. ప్రయివేటు రంగంలో దోపిడీకి ప్రభుత్వంలో ఉన్నవారే సహకరించిన దౌర్భాగ్యం మన దగ్గరే సాధ్యం. అల్ప, మధ్య ఆదాయాల వారు రోగం, రొష్టు వస్తే పెట్టాల్సిన వైద్య ఖర్చుల కారణంగా ఏటా లక్షల కుటుంబాలు దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నట్టు ప్రపంచబ్యాంకు నివేదిక చెప్పింది. ఏ ప్రజాప్రతినిధీ ఇది పట్టించుకోరు. గ్రామీణ వైద్య వ్యవస్థను మెరుగుపరచుకున్న కేరళ వంటి నమూనాలు మన కళ్ల ఎదుటే అందుబాటులో ఉన్నా... వాటినిక్కడ పాటించే చొరవ పాలకులకు లేదు. నాడు-నేడు కార్యక్రమం కింద ఏపీలో ఇప్పుడిప్పుడే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఢిల్లీలోని ‘మొహల్లా దవాఖాన’ నమూనా అనుసరణకు తెలంగాణ ఈమధ్యే శ్రీకారం చుట్టింది. ప్రయివేటుపరం చేయకుండా విద్యతో పాటు వైద్యాన్నీ ప్రభుత్వమే నిర్వహించాలన్నది ప్రజాభీష్టం. దీన్ని రాజకీయ పక్షాలు తమ ఎన్నికల ఎజెండా చేసి, ఆ మేర అమలు చేస్తే తప్ప సగటు మనిషికి ఉపశమనం లభించదు.
వనరుల రక్షతోనే భవిత
అయిదేళ్లకు ఎన్నికయ్యే ప్రభుత్వాలు కొన్ని తరాలకు చెందిన, చెందాల్సిన సహజ ప్రకృతివనరుల్ని విధ్వంసం చేస్తున్నాయి. అమ్ముకుంటున్నాయి. అడవులు, ఇసుక, ఖనిజాలు, జలవనరులతో సహా సర్వం స్వార్థ ప్రయోజనాల కోసం కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నాయి. ప్రతికూల ఫలితాలు, ప్రభావాలతో సామాన్యులు అలమటిస్తున్నారు. ఎక్కడికక్కడ వనరుల్ని కాపాడుకోవడం, న్యాయబద్ధమైన వినియోగం స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉంటేనే సాధ్యమవుతుంది. అప్పుడే, ఐక్యరాజ్యసమితి చెబుతున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని (ఎస్డీజీ) సాధించగలుగుతాం. ఇదే, పార్టీల ఎన్నికల ప్రణాళికతో తమకు హామీగా లభించాలని సామాన్యుల కోరిక.
‘విప్లవం ప్రత్యక్ష ఉత్పత్తి కాదు, విప్లవ పరిస్థితుల ఉప ఉత్పత్తి’ అంటారు. దేన్నీ తెగేదాకా లాగొద్దన్నది మధ్యేవాద సూచన. తమ సమస్యలపై జనాన్ని గొంతెత్తనీకుండా ఎంతోకాలం అదిమిపెట్టలేరు. పైపూత పథకాలతో చాన్నాళ్లు మభ్యపెట్టనూలేరు. మనసుపెట్టి, మామూలు జనం ఏం కోరుకుంటున్నారో గుర్తించాలి. అదే ప్రజా ఎజెండాగా పరిగణించాలి. ఎన్నికల ప్రణాళికగా మలచాలి. జనాన్ని మెప్పించి, గెలిచి, తు.చ. తప్పకుండా ఆచరించాలి. లేకుంటే..... ప్రజాకవి కాళోజీ చెప్పినట్టు ప్రజలు ‘కాని కాలాలలో కాచుకొని ఉండాలె, కాలమ్ము రాగానె కాటేసి తీరాలె...’ అనుకుంటారు, తస్మాత్ జాగ్రత్త!
దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ,
9949099802
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672