సెంబీ.. తిరగబడ్డ అడవి బిడ్డ కథ

by Javid Pasha |   ( Updated:2023-04-15 02:25:31.0  )
సెంబీ.. తిరగబడ్డ అడవి బిడ్డ కథ
X

అపురూపమైన చిత్రాలు అరుదుగా మాత్రమే వస్తుంటాయి. అటువంటి గొప్ప చిత్రాలు రూపొందించడంలో తమిళ దర్శకులు ముందుంటున్నారు. భిన్నమైన కథాంశాలను.. ఊహకందని పాత్రలను తమిళ దర్శకులు ఎక్కువ సంఖ్యలో ఒడిసిపట్టుకుంటున్నారు. తెలుగులోనూ అటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పటికీ.. మళయాళ, తమిళ చిత్రపరిశ్రమతో పోలిస్తే తక్కువే. అటువంటి ప్రయత్నమే.. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్‌ చేశారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'సెంబీ' ఇటీవల హాట్ స్టార్‌లో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ చిత్ర కథ ఎంతో విభిన్నమైనదే కాక అరుదైనది కూడా. ఈ సినిమా అడవుల్లో బతుకుతున్న ఓ గిరిజన తెగ జీవితాన్నే కాక.. రాజకీయ నాయకుల కుట్రలను, మైదాన ప్రాంతాల్లో ఉండే జనం.. గిరిజనుల మీద అలవర్చుకున్న తప్పుడు అభిప్రాయాలను బట్ట బయలు చేసింది.

అమ్మమ్మ దగ్గర పెరుగుతున్న చిన్నారి సెంబిపై.. కొందరు కామాంధులు రాక్షసంగా ప్రవర్తిస్తారు. లైంగికదాడికి తెగబడతారు. ధన బలం, రాజకీయ బలం, అంగబలంతో తమకు తిరుగులేదని భావిస్తారు. పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతారు. అడవి తేనె, పండ్లు సేకరించడం, దాన్ని వ్యాపారులకు అమ్ముకొని మోసపోవడం మాత్రమే తెలిసిన అమాయకమైన వృద్ధురాలు తన మనవరాలికి న్యాయం చేయగలిగిందా? ఆ క్రమంలో ఆమెకు ఎటువంటి సవాళ్లు ఎదురయ్యాయి అన్నది చిత్ర కథ. సెంబిపై లైంగికదాడికి తెగబడ్డ దుర్మార్గులు సమాజంలో పలుకుబడి గలిగిన వ్యక్తులు. నిందితుల్లో ఏకంగా ఒకడు ప్రతిపక్ష నేత కుమారుడు. ఈ కథలో కొసమెరుపు ఏమిటంటే.. సదరు ప్రతిపక్ష నేత గిరిజన బాలికకు న్యాయం చేయాలంటూ రాష్ట్రమంతా ఉద్యమిస్తాడు. ఆ అంశం ఆధారంగానే ఎన్నికల్లో గెలవాలని చూస్తుంటాడు. ఇటువంటి సన్నివేశాలతో ఈ సినిమా ఆద్యంతం మలుపులతో, ఉత్కంఠభరితంగా సాగుతుంది.

కోవై సరళ నటవిశ్వరూపం

సినిమాలో ఎక్కువ భాగం ఓ బస్సులోనే ఉంటుంది. గిరిజనుల పట్ల సగటు మనుషులు, సామాన్యులు ఎటువంటి దృక్ఫథాన్ని కలిగిఉంటారో అబద్ధాలను ఎంత తేలిగ్గా నమ్మి.. వాటిని ప్రచారం చేస్తారో ఈ సినిమాలో వ్యంగ్యంగా చూపించారు దర్శకుడు. సెంబీ అమ్మమ్మ పాత్ర పోషించిన కోవై సరళకు ఎన్ని మార్కులేసినా తక్కువే. ఎందుకంటే ఇంతకాలం మనం కోవై సరళను ఓ కమెడియన్ గా మాత్రమే చూశాం. కానీ ఈ సినిమాలో ఆమె తన నటవిశ్వరూపాన్ని చూపించింది. గిరిజన మహిళగా తన పాత్రకు న్యాయం చేసింది. తాను కేవలం కామెడీ పాత్రలే కాదు.. ఎటువంటి పాత్రలైనా అలవోకగా చేయగలనని నిరూపించింది. న్యాయం చేయాలంటూ సెంబీ అమ్మమ్మ పోలీసులను ఆశ్రయిస్తే.. వాళ్లు ఎలా ప్రవర్తించారు? అత్యాచార ఘటనను మసిమూసి మారేడుకాయ చేసేందుకు ఎటువంటి కుట్రలు చేశారో మనకు చూపించారు. ఈ చిత్రంలోని పాత్రలన్నీ నిత్యం మనచుట్టూ కనిపించే వాళ్లే. అబద్ధాలను నమ్ముతూ.. తప్పుడు ప్రచారాలు చేస్తూ.. నిజాల గురించి కనీసం లాజిక్‌ల గురించి పట్టించుకోకుండా అను నిత్యం పుకార్లను వ్యాపింపజేస్తూ ఉండే జనం మనచుట్టూ కనిపిస్తుంటారు. అటువంటి వాళ్లనే ఈ సినిమాలోనూ పాత్రలుగా ఎంపిక చేశారు, నిందితులు బలవంతులు కాబట్టి.. నేరం తాము చేయలేదని నిరూపించడానికి తొక్కాల్సిన అన్నీ అడ్డదారులు తొక్కుతారో ఈ సినిమాలో చూపించారు.

ఆద్యంతం సహజత్వం..

ఫోక్సో చట్టాన్ని ఈ సినిమాలో సవివరంగా చర్చించారు. సాధారణ ప్రజలు సైతం తలుచుకుంటే బాధితులకు ఎలా న్యాయం చేయొచ్చో చూపించారు. సినిమాలో ఒక్కటంటే ఒక్క అసహజ సన్నివేశం కూడా లేదు. ఎక్కడా మనకు సాగదీత అనిపించదు. చిత్రంలోని ప్రతి సన్నివేశం అవసరమైంది. కొడై కెనాల్ ప్రకృతి అందాలు, సహజసిద్ధమైన వేషధారణ, పాత్రల చిత్రీకరణ చిత్రానికి మరిన్ని సొబగులు తీసుకొచ్చాయి. లైంగికదాడికి గురైన బాలిక.. నేరానికి పాల్పడ్డ వారిని గుర్తించే క్రమంలో ఎటువంటి భావోద్వేగానికి గురవుతుందో చక్కగా చూపించారు. న్యాయస్థానం, పోలీస్ స్టేషన్, ఆస్పత్రి ఇలా అన్ని చోట్లను ఎంతో సహజంగా చిత్రీకరించారు. కోవై సరళ చిత్రాన్ని అంతా తానై నడిపించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. ఆమె తన నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తునే .. ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. పోలీస్ అధికారితో ఆమె ప్రవర్తించే తీరు.. బస్సులో గిరిజనులను .. మైదాన ప్రాంత జనం తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆమె రియాక్షన్ మరో లెవెల్ లో ఉంటుంది. కోవై సరళ నటనలోని రెండో కోణాన్ని మనం ఈ సినిమాలో చూడొచ్చు. ఇక ఈ పాత్రకు కోవై సరళ ఒప్పుకోవడం ఆమె సినీ జీవితంలో తీసుకున్న అతి గొప్ప నిర్ణయంగా భావించవచ్చు. ఇక దర్శకుడు కూడా ఈ పాత్రకు ఆమెను సంప్రదించడం గొప్ప విషయం.

ఇటువంటి సినిమాలు అరుదుగా మాత్రమే వస్తుంటాయి. గిరిజన బాలికకు చేసిన చిన్నారి నటనను ప్రశంసించకుండా ఉండలేము. చిత్ర కథను ఎత్తుకున్న తీరు.. ముందుకు నడిపించిన తీరు.. క్లైమాక్స్‌లో జరిగే కోర్టు సీన్స్ అన్నీ మనసును హత్తుకుంటాయి. కన్నీరు తెప్పిస్తాయి. అవతలివాడు ఎంత బలవంతుడైనా మనం నిజాయితీగా ప్రయత్నిస్తే కోర్టుల్లో న్యాయం జరుగుతుందని ఈ మూవీ నిరూపించింది. ఇప్పటికీ చాలా మందికి ఫోక్సో చట్టం గురించి అవగాహన ఉండకపోవచ్చు. ఆ చట్టం ఎంత బలమైనదో.. ఎంతటి బలవంతుడినైనా ఎలా బోనెక్కిస్తుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమా సెంబీ.


- అరవింద్ రెడ్డి మర్యాద

81793 89805


ఇవి కూడా చదవండి:

కళాత్మక సజీవ చిత్రణ ‘మూన్ లైట్’

Advertisement

Next Story