రెవెన్యూ ప్రక్షాళనతోనే పరిష్కారం! - గరికె ఉపేంద్ర రావు

by Shiva |   ( Updated:2024-06-19 00:00:23.0  )
రెవెన్యూ ప్రక్షాళనతోనే పరిష్కారం! - గరికె ఉపేంద్ర రావు
X

తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ అడుగడుగునా రెవెన్యూ సేవలందించేది, సుమారు 56 రకాల విధుల నిర్వహణతో ప్రభుత్వ పాలనకి వెన్నెముకగా నిలిచేది వీఆర్‌ఓ వ్యవస్థ మాత్రమే. స్వతంత్ర తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మొదటి విడత పాలనలో సమగ్ర కుటుంబ సర్వే మొదలు ప్రతిష్టాత్మక “100 రోజుల్లో రెవెన్యూ రికార్డు ప్రక్షాళన, రైతుబంధు పాసుబుక్కుల పంపిణీ”, సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమర్ధ ఎంపిక ద్వారా రెండోసారి అధికారం చేపట్టడంలో కీలకపాత్ర పోషించి... దేశ చరిత్రలో ప్రథమంగా ఒక నెల మూలవేతనం ప్రోత్సాహకంగా పొందిన ఏకైక ఉద్యోగ వ్యవస్థ అది. కానీ కొందరి తప్పులను బూచిగా చూపి, అసెంబ్లీ సాక్షిగా అప్పటి సీఎం కేసీఆర్ వీఆర్వోలపై తీవ్ర ఆరోపణలు చేసి.. చూరులో ఎలుకలు దూరాయని ఇల్లంతా తగలబెట్టినట్టుగా వీఆర్‌ఓ వ్యవస్థ రద్దు చట్టం-2020 తీసుకొచ్చారు.

రీడెప్లాయిమెంట్ వల్ల నష్టం

సుమారు 6-24 ఏళ్ల రెవెన్యూ క్షేత్రస్థాయి అనుభవం ఉన్న 5138 మంది పూర్వ వీఆర్వోలను నాటి కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా లాటరీ విధానంలో బదిలీ చేశారు. దాదాపు 1200 మంది వీఆర్వోలను ప్రభుత్వానికి వెలుపల “సొసైటీలు, కార్పొరేషన్లు, స్వయంప్రతిపత్తి సంస్థలు, కమిషన్ల”లో నియమించారు. దీంతో మేం పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కోల్పోయాం. ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల మేరకు చెక్కుల రూపంలో, కొన్నిసార్లు 3 నెలలకోసారి జీతాలు వస్తున్నాయి. మాకు జీపీఎఫ్, జీపీఎస్, టిఎస్‌జిఎల్‌ఐ చందా మినహాయిస్తున్నా... అవి ఎక్కడ జమ అవుతున్నాయో తెలియదు. మా సీనియారిటీ పోయింది. రెవెన్యూలో పదోన్నతులు కోల్పోయాం, కొత్త శాఖల్లో పదోన్నతి సంబంధ సమస్యలు, కోర్టు కేసులు తలెత్తుతున్నాయి.

చట్ట ప్రకారం మమ్మల్ని జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన పోస్టుల్లోనే నియమించాలి. కానీ ప్రభుత్వ శాఖల్లో కొన్ని చోట్ల శాంక్షన్డ్ పోస్టులు లేక సుమారు 1000 మందిని అంత కంటే తక్కువైన "తోటమాలి, వార్డ్ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్, మహిళా జీపు డ్రైవర్, రేషన్ డీలర్, హాస్టల్ వర్కర్, వాచ్-మెన్, వంట మనిషి” వంటి తక్కువ స్థాయి పోస్టుల్లో నియమించారు. అలాగే అక్కడి శాఖల్లో కొందరికి పదోన్నతులు ఇవ్వడానికి మా హోదా తగ్గించి కింది స్థాయి పోస్టుల్లో నియమిస్తున్నారు. సుమారు (1,000) మంది ప్రొబేషన్ డిక్లరేషన్, లీవ్ మ్యాటర్ సమస్యలు కలెక్టరేట్లు, సీసీఎల్‌ఏ, సెక్రటేరియట్లో పెండింగ్‌లో ఉండటంతో (6/12/18/24) ఇంక్రిమెంట్లు మంజూరు కాలేదు. 5% IR పెంపుదలకు, కారుణ్య నియామకాలకు అర్హులు కాలేదు. ఇతర ప్రభుత్వ సదుపాయాలు కోల్పోయాం. వేతన బకాయిలు రావడం లేదు. "ధనిక రాష్ట్రం తెలంగాణ అని గొప్పలు పోతున్న తరుణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి జీసీసీలో 16 మందికి గత 22 నెలలుగా వేతనాలు లేవు. ఇలా అడుగడుగునా పూర్వ వీఆర్వోలను గత కేసీఆర్ ప్రభుత్వం వేధించింది.

రెవెన్యూలో ఖాళీలు కూడా ఇవ్వలేదు

మమ్మల్ని రెవెన్యూలో మిగులు సిబ్బందిగా పేర్కొని ఇతర శాఖలకు బదిలీ చేశాక.. అదే శాఖలో 1200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి టీఎస్‌పీఎస్‌సి ద్వారా గ్రూప్ 4 నోటిఫికేషన్లో ప్రకటించారు. గౌరవ వేతనం పొందే “గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏల) వ్యవస్థ”ను 2023లో రద్దు చేశాక, వారిలో 5,000 మందిని సిబ్బంది కొరత, విద్యార్హత పేరుతో రెవెన్యూలోనే జూనియర్ అసిస్టెంట్లుగా సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి మరీ పే స్కేలు వర్తింప చేశారు. దాంతో వీఆర్వో పోస్టు కోసమే పోటీ పరీక్షలో ఎంపికైన వారు, వీఆర్వోలుగా పదోన్నతులు పొందిన, కారుణ్య కోటాలో వీఆర్వోలుగా నియమితులైన వారికి తీవ్ర అన్యాయం జరిగింది. మా సేవలను కించపర్చి, ఉద్యోగ భద్రత తొలగించి, ఆత్మగౌరవంతో జీవించే హక్కుని కాలరాశారు.

‘ధరణి’ పోర్టల్ ఒక నాటకం!

(భూ రికార్డు కంప్యూటరైజేషన్, ధరణి వల్ల క్షణాల్లో లావాదేవీలు అవుతున్నాయని మాజీ సీఎం కేసీఆర్, మాజీ సీస్ సోమేశ్ కుమార్ నమ్మబలికితే... గత బీఆర్ఎస్ పాలనలో సుమారు 2.31 లక్షల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఎలా కబ్జా అయ్యాయి? హైకోర్టు, జిల్లా కోర్టుల్లో లక్షలాది సివిల్ కేసులు ఎందుకు దాఖలు అవుతున్నాయి? గ్రామంలో పరిష్కారం కావాల్సిన సమస్య కోసం నాలుగేళ్లుగా రైతులు హైదరాబాద్ వరకు ఎందుకు వస్తున్నారు? ధరణిలో లక్షలాది అర్జీలు ఎందుకు పేరుకుపోయాయి? ధరణి ఔట్ సోర్సింగ్ ఆపరేటర్లు వచ్చాక అన్యాక్రాంతం అయిన లక్షల కోట్ల విలువైన భూముల విషయంలో ఎవరు బాధ్యత వహిస్తారు? నేడు “వారసత్వం కేసులు” వేలాదిగా ఎందుకు పెరిగాయి? జిల్లా కలెక్టరేట్లు, జిల్లా ఎస్పీ, పోలీస్ కమిషనరేట్లలో నిర్వహించే “ప్రజావాణి”, ప్రగతి భవన్ ప్రజాదర్బార్ దరఖాస్తులలో సుమారు 70% భూసమస్యలవే ఎందుకు వస్తున్నట్టు? సంక్షేమ పథకాల అమలులో గత పదేళ్ళలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం అనర్హుల ఖాతాల్లోకి ఎలా వెళ్ళినట్టు?)

రెవెన్యూలోకి వస్తేనే పరిష్కారం

5138 మందికి ఉమ్మడి పరిష్కారం చూపాలన్నా, మా గత అనుభవం ప్రభుత్వానికి ఉపయోగపడాలన్నా, సమగ్ర భూసర్వే, సమర్ధ రెవెన్యూ రికార్డు నిర్వహణ కోసం రెవెన్యూలో క్షేత్ర స్థాయి సిబ్బంది కొరత తీరాలన్నా... ఆప్షన్లు ఇచ్చి, మాతృ శాఖ రెవెన్యూలోకి వెనక్కి రప్పించడం తప్పనిసరి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తరహాలో క్షేత్రస్థాయిలో గ్రామ రెవెన్యూ యంత్రాంగం పటిష్టమై ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించబడతాయి. ప్రజా సంక్షేమ పథకాలకు ఆర్థిక వనరులు సమకూరుస్తాయి. భూసమస్యలు క్షేత్ర స్థాయిలోనే పరిష్కారమై, శాంతి భద్రతలు విలసిల్లుతాయి. కావున ధరణి కమిటీ, తెలంగాణ ప్రజా ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఆ దిశగా నిర్ణయం తీసుకుని పూర్వ వీఆర్వోలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం సరిదిద్ది, ప్రజలకు భూ సమస్యల విషయంలో విముక్తి కల్పించాల్సిన చారిత్రక సమయం ఆసన్నమైంది.

గరికె ఉపేంద్ర రావు

(అధ్యక్షులు, తెలంగాణ పూర్వ వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ)

99088 25191




Advertisement

Next Story

Most Viewed