ఆ అస్పృశ్యత.. ఈ అస్పృశ్యత ఒక్కటే!

by Ravi |   ( Updated:2025-02-20 01:15:25.0  )
ఆ అస్పృశ్యత.. ఈ అస్పృశ్యత ఒక్కటే!
X

డోనాల్డ్‌ ట్రంప్‌ భారతదేశంలోని అక్రమ వలసదారులను బేడీలు వేసి భారతదేశానికి పంపడం బాధాకరమైన విషయం. ఇది దేశవ్యాప్తంగా అందరి మనసులను కలచివేసింది. అగ్ర దేశంగా, ప్రజాస్వామిక దేశంగా పేరు పొందిన అమెరికా ఇంత అమానవీయంగా వ్యవహరించటం గురించి ప్రజాస్వామ్య వాదులు ఖిన్నులు అయ్యారు. నిజానికి వీరు అక్రమ వలసదారులే.. అలా వెళ్లడం కూడా భారతదేశానికి అవమానకరమే. అక్రమ వలసదారులను నేను ఉపేక్షించనని అమెరికా అధ్యక్షుడు ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట నిజమే. కానీ ఇంత దూకుడుగా వ్యవహరిస్తారని అనుకోలేదు.

అయితే ఈ రోజు అమెరికా భారతీయులకు బేడీలు వేసినందుకు బాధపడుతున్నవారంతా, భారతదేశంలో అంతర్గతంగా కొన్ని వేల సంవత్సరాలు అస్పృశ్యుల్ని ఊరికి దూరంగా ఉంచి అమానుషంగా వేధించారని తెలుసుకోవాలి.

అస్పృశ్యత అసలు బహిష్కరణ!

భారతదేశం కూడా అంతర్గతంగా కుల వ్యవస్థ వల్ల, అస్పృశ్యత వల్ల, స్త్రీ అణచివేత వలన మానవ శ్రమను భారతదేశంలోని వనరులకు సమన్వయించుకోలేకపోవడం వలననే ఆర్థికంగా ఎదగలేకపోతుంది. ఈ విషయాన్ని డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆనాడే చెప్పారు. భారతదేశంలో రూపాయి విలువ పెరగాలంటే భారతదేశంలో అస్పృశ్యత పోవాలి, కులం పునాదులు కూలాలి, స్త్రీ అభ్యుదయం జరగాలి. అయితే ఈ రోజున అమెరికా భారతీయులకు బేడీలు వేసినందుకు బాధపడుతున్నవారంతా భారతదేశంలో అంతర్గతంగా కొన్ని వేల సంవత్సరాలు అస్పృశ్యుల్ని ఊరికి దూరంగా వుంచి అమానుషంగా వేధించారని తెలుసుకోవాలి. ఈనాటికి అస్పృశ్యతను మానసికంగా, భౌతికంగా విద్యాపరంగా పాటిస్తున్న వారంతా ఒకసారి అంతర్గతంగా జరుగుతున్న అవమానం గురించి కూడా బాధపడాల్సి వుంది. అంబేడ్కర్‌ ఈ విషయంగా తన అస్పృశ్యులెవరు? గ్రంథంలో వివరిస్తూ ఒకే దేశంలో పుట్టిన దేశీయుల్ని అనేక పేరులు పెట్టి అస్పృశ్యతను అంటగట్టి, మైల పేరుతో వేధించిన వారు ఒకసారి పునరాలోచించుకోవాలని ఆనాడే చెప్పారు.

కార్మికుల కొరత తప్పదు!

ఇక 2021 నాటికే భారతీయులు 7,00,000 లక్షలకు పైగా అమెరికాలోకి ప్రవేశించారని అంచనా వేశారు. అమెరికా నుండి సామూహిక బహిష్కరణలను సమర్థించేవారు ఇది అమెరికా కార్మికులకు మంచిదే అని చెపుతున్నారు. సామాజిక రాజకీయ శాస్త్రవేత్తలు ఇది అవాస్తవం అని చెబుతున్నారు. ఇకపోతే అమెరికన్లకు ఉద్యోగాలను కల్పిస్తామని, వారి వేతనాలను పెంచుతామని ట్రంప్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్టీఫెన్‌ మిల్లర్‌ వాదన. అనధికార వలస కార్మికులు ఇలాంటి ఉద్యోగాల కోసం స్థానికంగా జన్మించిన కార్మికులతో పోటీ పడుతున్నారని ఈ వాదన చెబుతోంది. అయితే ఇది వాస్తవం కాదని అనేక అధ్యయనాల వల్ల తేలుతోంది. నిజానికి నమోదు కాని వలసదారులు తరచుగా అమెరికన్‌ కార్మికులు కోరుకోని ఉద్యోగాలను తీసుకుంటారని ఇవి చెబుతున్నాయి. ఇందుకు ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎంప్లాయర్స్‌’ కోవిడ్‌-19 మహమ్మారి కాలంలో సుమారు 1,00,000 సీజనల్‌ వ్యవసాయ ఉద్యోగాలలో ఎంత మంది నిరుద్యోగ అమెరికన్లు చేరతారో తెలుసుకోవడానికి నిర్వహించిన సర్వే ఒక మంచి ఉదాహరణ. లక్ష ఉద్యోగాలకు గాను కేవలం 337 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని సర్వే చెప్పింది. కాలానుగుణ వలసదారులు లేకపోతే, కార్మికుల కొరత (ఆహార కొరత) కొనసాగే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

వ్యవసాయంపై అధిక ప్రభావం!

అనధికార వలసదారులు చేపట్టే అతి సాధారణమైన 15 వృత్తులలో అమెరికాలో జన్మించిన కార్మికులు- అనధికార వలస కార్మికులు ఎంత మంది ఉన్నారనే సంగతిని ‘బ్రూకింగ్స్‌’ అధ్యయనం చెబుతోంది. స్థానిక కార్మికులు, అధికారిక వలస కార్మికుల కంటే అనధికార వలసదారులు తక్కువ జీతం, ప్రమాదకరమైన, తక్కువ ఆకర్షణీయమైన ఉద్యోగాలను ఎక్కువగా తీసుకుంటారని ఈ అధ్యయనం ప్రధానంగా తేల్చింది. అక్రమ వలస కార్మికులను బలవంతంగా పంపి వేసే చర్య వల్ల అనేక రంగాలపై వివిధ స్థాయిల్లో కార్మికుల సరఫరాపై ప్రభావం పడుతుందని ‘ది ఎకానమిస్ట్‌’ ఎత్తి చూపింది. ముఖ్యంగా వ్యవసాయంపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. అమెరికాలోని 25 లక్షల మంది వ్యవసాయ కార్మికులలో దాదాపు 40 శాతం మంది అనధికార వలస దారులేనని అంచనా. వీరి తొలగింపు వల్ల గృహ నిర్మాణం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అనధికార వలసదారులు గృహ నిర్మాణ శ్రామిక శక్తిలో ఆరవ వంతు ఉన్నారు. నిజానికి ఏ దేశమైనా అక్రమ వలసదారులను నిషేదించడంలో తప్పులేదు. కాని వారిని బేడీలు వేసి, సంకెళ్ళు వేసి అవమానకరంగా పంపవలసిన అవసరం లేదు.

ఈ బహిష్కరణతో అమెరికాకే నష్టం!

అంబేడ్కర్‌ ఈ పరిశోధనలోనే మరొక మాట చెప్పారు. ఆయా దేశాలవారు తమ దేశాలకు వలస వచ్చిన వారిని అస్పృశ్యులుగా చూశారని అందువల్ల వారిని బహిష్కరించడానికి ప్రయత్నించారని, భారతదేశంలో మూలవాసులైన, దేశీయుల్నే బహిష్కరణకు గురిచేశారని, దీనివలన భారతదేశం తన జీవశక్తినే కోల్పోయిందని, ఎవరు శ్రామికులో, ఎవరు ఉత్పత్తి పరికరాలను కనిపెట్టారో, ఎవరు నదీ నాగరికతను సృష్టించారో ఆ మూలవాసులను బహిష్కరించడం వల్ల భారతదేశం ఎంత నష్టపోతుందో అర్థం చేసుకోవలసిన అవసరం వుంది. అమెరికా కూడా ఇప్పుడు వలస వాదులను వెళ్ళగొట్టడం వలన ఇంతకంటే ఎక్కువ నష్టపోయే ప్రమాదం వుంది. ఏదైనా మనిషిని, సమాజాన్ని దేశం పేరు చెప్పి, వర్ణం పేరు చెప్పి, ఆచారం పేరు చెప్పి, నియమం పేరు చెప్పి ద్వేషించినవారంతా మళ్ళీ అదే బహిష్కరణకు గురి అవుతున్నారు.

శ్రమజీవిని ద్వేషిస్తే వట్టి పోవలసిందే!

ఈ విషయాన్ని సామాజిక శాస్త్రవేత్తలు బుద్ధుడు, మహాత్మా ఫూలే, డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌, పెరియార్‌ రామస్వామి నాయకర్‌ వీరందరు ముందే చెప్పారు. కారంచేడు, చుండూరు ఉద్యమాల తర్వాత దళితుల ఆత్మగౌరవం పెరిగాక, భూస్వామ్య కులాలు ఊరులు వదిలిపెట్టాల్సి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. శ్రమ జీవిని ద్వేషిస్తే ఊరు, దేశం, ఖండం ఎంత గొప్పవాడైనా వట్టిపోవాల్సిందే. శ్రమజీవులు దేశానికి జీవగర్రలు. అందుకే అంబేడ్కర్‌ చెప్పారు. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేం, దేశాన్ని నిర్మించలేరని. అందువల్లనే డోనాల్డ్‌ ట్రంప్‌తో పాటు దేశీయ పాలకులు కూడా అంతర్గత అస్పృశ్యతను నివారించుకునే ఆచరణాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. మొత్తం ప్రపంచానికి మానవుడే కేంద్రం. మానవత్వమే జీవన దర్శనం. ప్రపంచ పాలకవర్గం మొత్తం ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది. అంతర్గతంగా బహిర్గతంగా ఒకే దిశగా ఒకే అవగాహనతో ఆలోచిద్దాం. అస్పృశ్యత నివారణ దిశగా నడుచుకుందాం. శ్రమయేవ జయతే.

డా. కత్తి పద్మారావు

98497 41695



Next Story