పారితోషికం కోసం ఎదురుచూపులు!

by D.Reddy |
పారితోషికం కోసం ఎదురుచూపులు!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన కోసం రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సర్వే నిర్వహించింది. నవంబర్​ 9వ తేదీ నుంచి నవంబర్​ 23 వరకు ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులను, సిబ్బందితో ఇంటింటి కుటుంబ సర్వే చేయించింది. అయితే సర్వేలో పాల్గొనే సిబ్బందికి స్థాయిని బట్టి పారితోషకం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం నిర్వహించే కుటుంబ సర్వే ఉద్యోగంలో భాగం కాకపోవడంతో పూర్తిస్థాయిలో అందరినీ వినియోగించుకోలేకపోయింది. కేవలం కొన్ని విభాగాల్లోని కొంత మంది సిబ్బందిని నియమించుకుంది. అయితే ప్రభుత్వం చెల్లిస్తానన్న పారితోషికం నాలుగు నెలలైనా ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డ్యూటీ, కుటుంబ సర్వేతో ఇబ్బందులు

కుటుంబ సర్వేలో పాల్గొన్న సిబ్బంది ఒక పూట విధులు, మరో పూట సర్వేలో నిమగ్నమయ్యారు. ఈ సర్వేలో ప్రధానంగా ఎస్జీటీ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు ఎన్యుమరేటర్లుగా విధుల్లో పాల్గొన్నారు. వీరిపై పర్యవేక్షకులుగా ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఇతర శాఖల జిల్లా అధికారులు పని చేశారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించారు. కాగా, ఎన్యుమరేటర్లకు రూ.10 వేలు, పర్యవేక్షకులకు రూ.12 వేల చొప్పున పారితోషికం అందిస్తామని చెప్పారు. ఆపరేటర్లకు ఒక్కో కుటుంబ ఫారానికి రూ.25 చొప్పున చెల్లిస్తామన్నారు. వారందరికీ నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా పారితోషికం చెల్లిస్తామని ఉన్నతాధికారులు వివరాలు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖాతాల్లో జమ చేయకపోవడం దారుణం.

సుమారు రూ.8 కోట్లు బకాయి

రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో సుమారుగా 8 వేల మంది కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల్లో 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 549 గ్రామాల్లో 6 లక్షల 57వేల మంది కుటుంబాలను సర్వే చేసేందుకు 5,344 మంది ఎన్యూమరేటర్లను ప్రతి పది మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్​ వైజర్‌​ను నియమించారు. అదేవిధంగా వికారాబాద్​ జిల్లాలో 20 మండలాల్లో 4 మున్సిపాలిటీలు, 560 గ్రామ పంచాయతీల్లోని 2,77,977 కుటుంబాలను సర్వే చేసేందుకు 2,024 మంది ఎన్యూమరేటర్లు, 208 మంది సూపర్​ వైజర్లను ఎంపిక చేసుకున్నారు. వీరందరి సహాయంతో రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలు కలిపి మొత్తం 8,076 మంది సిబ్బంది సహాయంతో సర్వే చేశారు. ఎన్యూమరేటర్లకు రూ.10వేలు, సూపర్​ వైజర్లకు రూ.12వేల చొప్పున సుమారుగా రెండు జిల్లాల్లో కలిపి రూ.8 కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed