వివాదాల ధరణి.. ఆరేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు

by Aamani |
వివాదాల ధరణి.. ఆరేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు
X

దిశ బ్యూరో, కరీంనగర్ : భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. రోజురోజుకు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఫలితంగా సమస్యలు జటిలంగా మారుతున్నాయి. రైతులను ఆశల పల్లకిలో ఎక్కించి.. గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన ధరణి కూడా భూ సమస్యలను పరిష్కరించడం లేదు. ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా, కొత్త సమస్యలను పుట్టించి, పలు వివాదాలకు కారణమైంది. ఫలితంగా రైతులు భూ సమస్యలు పరిష్కరించాలని రెవెన్యూ కార్యాలయాలకు, జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ నిర్వహించే ప్రజావాణి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

కరుణించని ధరణి..

ఇల్లందకుంట మండలంలోని టేకుర్తి గ్రామానికి చెందిన మంద స్వరూప భర్త ఐలయ్య పేరుపై ఎకరం 10 గుంటల భూమి ఉంది. అందులో 25 గుంటల భూమి ఇతరుల పేరుతో ధరణిలో నమోదైంది. ఆ 25 గుంటల భూమిని తమ పేరు మీద రికార్డుల్లోకి ఎక్కించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సదరు రైతులు గత ఆరేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పలుమార్లు అధికారులకు మొర పెట్టుకోవడంతో వారు మోకా మీదికి వచ్చి సర్వే చేశారు. నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించారు. అయినా ధరణి రికార్డుల్లో మాత్రం మారడం లేదు.

వివాదాలమయం..

సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామానికి చెందిన ఓ రైతుకు 24 గంటల భూమి ఉండేది. ఆ 24గుంటలకు సంబంధించిన రైతుబంధు డబ్బు కూడా వచ్చేవి. అయితే కొంతకాలం తర్వాత ఏమైందో ఏమో కానీ.. సదరు రైతుకు తెలియకుండానే ఆ 24 గంటల నుంచి 10 గుంటల భూమి ఇతరుల పేరు మీద ధరణి రికార్డుల్లోకి ఎక్కింది. సదరు రైతు కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. అధికారులు రేపు మాపు అంటూ తిప్పించుకుంటున్నారే తప్ప సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి తన సమస్యను పరిష్కరించాలంటూ సదరు రైతు వేడుకుంటున్నాడు. ఇలాంటి సమస్యలు నిత్యం జిల్లాలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. భూ సమస్యల పరిష్కారం కోసం అంటూ తీసుకొచ్చిన ధరణి కొత్త వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రైతుల మధ్య గొడవలకు కారణం అవుతుంది.

భూమి అమ్మి‌‌ బిడ్డ పెళ్లి చేద్దామనుకున్నా..: మంద స్వరూప, ఐలయ్య, టేకుర్తి, ఇల్లంతకుంట

మాకు మా ఊరిలో ఎకరం 10 గుంటల భూమి ఉండేది. ధరణి వచ్చిన తర్వాత అందులో 25 గుంటలు ఇతరుల పేరు మీద నమోదైంది. ధరణి రికార్డుల్లో తారుమారు చేసి మాకు అన్యాయం చేసిర్రు. మా బిడ్డ పెండ్లి కి ఎదిగింది. ఆ భూమి అమ్మి వచ్చిన పైసలతో బిడ్డ పెళ్లి చేద్దామనుకుంటే ధరణి మాకు లేని దరిద్రాన్ని తీసుకొచ్చింది. కలెక్టరమ్మ స్పందించి మా సమస్యను పరిష్కరించాలి.



Next Story

Most Viewed