పదేళ్లలో.. విఫలమే తప్ప, వికసిత్ ఎక్కడ?

by Ravi |   ( Updated:2024-05-14 01:16:08.0  )
పదేళ్లలో.. విఫలమే తప్ప, వికసిత్ ఎక్కడ?
X

2014 ఎన్నికలకు ముందు, సంవత్సరానికి రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన మోదీ సర్కార్ ఈ పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో, ఎన్ని ప్రభుత్వ కంపెనీలు ప్రైవేటుపరం చేసి ఎన్ని ఉద్యోగాలు తొలగించిందో లెక్క చెప్పాలి. ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు బాకీ పడిన మోదీకి దేశంలో రోజురోజుకు కోట్లల్లో నిరుద్యోగులు పెరిగిపోతుంటే కనబడడం లేదా?

దేశంలో బడా పారిశ్రామిక కంపెనీలు సైతం ఉద్యోగాలు కల్పించలేక ఉన్న దివాలా తీస్తున్నాయి. ఉన్నత చదువులు చదివిన వారు సైతం ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇక్కడ ఉపాధి లేక దేశం విడిచి విదేశాలకు వెళుతుంటే, విదేశాలలో కూడా ఉపాధి లభించని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో నిరుద్యోగులను మోసం చేసే విధంగా ‘అగ్నిపథ్’ తీసుకొచ్చి కేవలం నాలుగు సంవత్సరాలకే ఉద్యోగ పదవీ విరమణను పరిమితం చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహావేశాలతో నిరుద్యోగ యువత ఉన్నారు. విదేశాల్లో ఉద్యోగాలంటూ విదేశీ బాట పట్టిన భారతీయులని అక్కడి యుద్దాలలో, వివక్షల కారణంగా అమాయకులైన భారతీయులను బలి చేశారు. అయినా మోడీ ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యవహరించింది.

పదేళ్లు ఎవరికోసం పనిచేసింది?

మోదీ, దేశంలోని వెనుకబడిన వర్గాల నుంచి పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాననీ చెప్పి, తన గుజరాత్ మిత్రులను మాత్రమే ప్రపంచ కుబేరులను చేసి, పేదలను మరింత పేదలుగా చేశారు. మేకిన్ ఇండియా అంటూ నిత్యం స్వదేశీ వస్తువులు వాడాలని మాట్లాడే మోదీ.. స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహాలు ఇవ్వలేకపోయాడు. వారికి ఉపాధి సృష్టించలేకపోయాడు. కొత్తగా యూనివర్సిటీలను, పారిశ్రామిక సంస్థలను స్థాపించలేక, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ, ప్రైవేటు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వారికి 16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు. కానీ అర్ధాకలితో ఉంటూ 140 కోట్ల మంది అవసరాలను తీర్చడానికి తమ చెమటను దారపోస్తున్న రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేకపోయాడు. కనీసం పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు, పైగా రైతులను తీవ్రవాదులను చూసినట్టు చూసి వారిపై తుపాకులు ఎక్కుపెట్టాడు. అంటే బీజేపీ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో అర్థం అవుతుంది. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పినా కనీసం గ్రామీణ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం గాని, వాటికి మార్కెట్లను గానీ సృష్టించలేదు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తానని వారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని వెనకేసుకొస్తున్నడు. ఎలక్ట్రోరల్ బాండ్లతో బీజేపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినా.. తామేదో దేశానికి మంచి చేశామని అనుకుంటున్నారు. అలాగే దేశంలో డిజిటల్ ఇండియా అంటూ వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్ చేయించారు. కానీ సైబర్ నేరగాళ్ల బరితెగింపులతో పౌరుల సమాచారానికి, ఆన్‌లైన్ లావాదేవీలకు భద్రత లేకుండా పోయింది. ఇప్పటికే దాదాపు 16 లక్షల కేసులు సైబర్ క్రైమ్‌లో నమోదయ్యాయి. మనదేశంలోని సైబర్ భద్రత ఉల్లంఘనలపై విదేశీ సంస్థలు చెబితే తప్ప మనకు తెలియని దుస్థితిలో మోదీ డిజిటల్ ఇండియా పాలన ఉంది.

ఆర్థిక పరిస్థితి మార్చలేకపోయారు..

లక్షల కొద్ది డబ్బులు పెట్టి చదువుకోలేని పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను, యూనివర్సిటీలో చదివే స్కాలర్స్‌కు ఫెలోషిప్‌లు కూడా ఇవ్వలేకపోయారు. దేశంలో ఉండే ప్రతి నదినీ అనుసంధానించి వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని ఒడిసిపట్టి తాగు, సాగునీటి కోసం దేశంలో ప్రతి మారుమూల ప్రాంతానికి నీరు అందిస్తానని గొప్పగా ప్రచారం చేసుకున్న మోదీ, చేతులెత్తేసి కనీసం ఆ నీటిని నిలువ చేయాల్సిన భారీ ప్రాజెక్టులను కట్టలేదు. కాలువలు తొవ్వలేదు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య సరిగ్గా నీటి పంపకాలు చేయలేకపోయారు. అలాగే తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోని హక్కులను ఇప్పటికీ నెరవేర్చలేకపోయింది. ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు లేని కులాలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఆరోగ్యం పాడైతే అడవుల్లో నివసించే ఆదివాసీ బిడ్డలకు అందుబాటులో ఆసుపత్రులను, ఆ ప్రాంతాల్లోకి అంబులెన్స్ వెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించలేనీ మోదీ ఆదివాసీ గిరిజనులకు హక్కులు ఎలా ఇస్తాడు?, కరోనా సమయంలో కూలీలు నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు వదిలితే, వారి బాధలను బీజేపీ ప్రభుత్వం, దేశం కళ్ళారా చూస్తూ ఉండిపోయింది. కానీ వారి ఆకలిని తీర్చే, ఆర్థిక పరిస్థితిని మార్చే పని కల్పిస్తానని గ్యారెంటీ మాత్రం ఇవ్వలేకపోయారు.

ఘోరమైన వైఫల్యాలు..

ప్రపంచంలో మానవాభివృద్ధి సూచీలో.. ఆకలిలో, పేదరికంలో, పత్రికా స్వేచ్ఛలో, సంతోషంలో, మౌలిక వసతులు, విద్య, ఉపాధి కల్పించడంలో మనం స్థానం ఎక్కడో చివరలో ఉంది. ఇప్పటికీ దేశంలో 80 కోట్ల మందికి పైగా ఇప్పటికీ రేషన్ బియ్యమే ఆధారంగా బతుకుతున్నారు. అంటే మన ఆర్థిక వ్యవస్థ ప్రజలకు అన్నం పెట్టే ఆధారం చూపించలేకపోయింది. దేశ ఆదాయం కాకుండా వ్యక్తి తలసరి ఆదాయం పెంచలేని ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎలా ఎదుగుతుంది? దేశం అనేక సమస్యలతో కొలువుదీరిన వాటికి పరిష్కారం చూపించలేక, ఈడీ, సీబీఐలతో ముఖ్యమంత్రులనే అక్రమంగా అరెస్టు చేస్తూ, దేవుడి పేరుతో, సీఏఏ చట్టంతో, మత రాజకీయాలతో, మంగళసూత్రాలతో ప్రజల మానసిక అంశాలపై దెబ్బకొట్టి వారి విలువైన ఓటును దొంగిలించే పనిలో బీజేపీ పరివారం ఉంది. అసలు దేశంలో మతం కాకుండా ప్రజల ఆర్థిక అభివృద్దిను పెంచే అభివృద్ధి ఎక్కడుందో తెలియదు. మోడీ పదేళ్ల పాలన విఫలమే తప్ప, వికసిత్ భారత్ ఎక్కడ ఉంది? ఇలాంటి ఘోరమైన వైఫల్యాలే ఇండియా కూటమి గెలుపుకు నాంది కాబోతుంది.

డాక్టర్. మండ్ల రవి

ఉస్మానియా యూనివర్సిటీ

9177706626

Advertisement

Next Story