నిరుద్యోగ తయారీ కార్ఖానాలు..

by Ravi |   ( Updated:2025-03-14 01:15:16.0  )
నిరుద్యోగ తయారీ కార్ఖానాలు..
X

దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, మౌలిక వసతులు మెరుగుపరచి, బోధనను శక్తివంతంగా మార్చేందుకు నియా మకాలు చేపడుతుంటాయి. కానీ తెలంగాణలో ‘ప్రత్యేక రాష్ట్రం’ ఏర్పాటైన తర్వాత పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఇవి తీవ్ర సంక్షో భం లో కూరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఎలా చదువుతున్నారు? ఎలా పరీక్షలు రాస్తున్నారు? ఎలా పట్టభద్రులు అవుతున్నారు? అనేదే పెద్ద ప్రశ్న. ఇవి కేవలం నిరుద్యోగులను తయారుచేసే కర్మాగారాలుగానే మిగిలి పోతున్నాయనడంలో సందేహాం లేదు.

రాష్ట్రంలో గత పదకొండేళ్లుగా 82 శాతం ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉండగా, నిధుల తగ్గుదల, నిర్వహణ లోపాలు విశ్వవిద్యాలయాల స్థాయిని తగ్గించేశాయి. నిధులు, నియామకాలు లేక యూనివర్సిటీలను నడపలేమని వైస్ ఛాన్సలర్లు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినా, పరిస్థితి మారలేదు. స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే 'కామన్ రిక్రూట్మెంట్ బోర్డు' ప్రక్రియ నిలిచిపోయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా‘నియామక ప్రక్రియ’ను కూడా అమలు చేయలేదు.

ఈ నీరసం.. ‘ప్రైవేట్’కు ప్రోత్సాహం!

తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరతతో విద్యా ప్రమాణాలు పడిపోగా, మార్గదర్శకత్వం లేక పరిశోధన మందగించి, మెరిట్ స్కాలర్‌షిప్‌లు తగ్గాయి. నియామకాలు నిలిచిపోవడం, పదవీ విరమణలతో విభాగాలు ఖాళీగా మారి, నిధుల లేమితో స్వయం ప్రతిపత్తి దెబ్బతింది. బడ్జెట్ కొరతతో అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోగా, భవనాలు, ల్యాబ్స్, గ్రంథాలయాలు పాడైపోతున్నాయి. కొత్త తరగతులు, హాస్టల్స్, టెక్నాలజీ వసతులు అభివృద్ధి చేయలేక తాత్కాలిక అధ్యాపకులపై ఆధారపడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం వల్ల కళాశాలలు నష్టపోతుండగా, హాస్టల్, మెస్సింగ్ వసతులు తగ్గుతున్నాయి. నిధుల కొరతతో పరిశోధన ప్రాజెక్టులు ఆగిపోగా, ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్ సెంటర్లు అభివృద్ధి కరువైంది. రీజినల్ క్యాంపస్‌లు, అనుబంధ కాలేజీలు మూతపడే స్థితి వచ్చిందని విమర్శలు పెరుగుతుండగా, విశ్వవిద్యాలయాల బలోపేతంపై నిర్లక్ష్యం, ప్రైవేట్ యూనివర్సిటీల ప్రోత్సాహంపై సందేహాలు నెలకొన్నాయి. 2018-19లో '10 ప్రైవేట్ యూనివర్సిటీల' ఏర్పాటు బిల్లుతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలహీనపడిందని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై స్పష్టత లేక సామాన్య విద్యార్థులకు సమస్యగా మారిందని ఆరోపణలు ఉన్నాయి.

దిగజారిన విద్యా ప్రమాణాలు..

యూజీసీ ప్రకారం యూనివర్సిటీల్లో ప్రతి విభాగానికి కనీసం ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు సహాయ ఆచార్యులుండాలి. అధ్యాపకుల రిటైర్మెంట్‌తో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడంతో కాంట్రాక్ట్, గెస్ట్ అధ్యాపకులపైనే ఆధారపడుతున్నారు. వీరు తక్కువ వేతనంతో, కంటిన్యుటీ లేకుండా పనిచేయడంతో విద్యార్థులకు నాణ్యమైన గైడెన్స్ లేకుండా పోతోంది. క్లాస్‌రూమ్ లెక్చర్లు తగ్గిపోవడం, ల్యాబ్ సెషన్లు జరగకపోవడం, ప్రాక్టికల్స్‌కు తగిన ఫ్యాకల్టీ లేకపోవడం నిత్యసమస్యగా మారింది. అధ్యాపకుల కొరత కొన్ని విభాగాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సైన్స్‌ కోర్సులలో పరిశోధన తగ్గిపోయింది. కొత్త కోర్సులు ప్రవేశపెట్టలేక పోతుండగా, ఇతర రాష్ట్ర యూనివర్సిటీల్లో నూతన కోర్సులు అందుబాటులోకి వచ్చినా, తెలంగాణ యూనివర్సిటీలు పాత సిలబస్‌తోనే కొనసాగుతున్నాయి. ఇక డేటా సైన్స్, ఏఐ, బిగ్ డేటా, బ్లాక్‌చైన్, బయోటెక్నాలజీ కోర్సులకు అధ్యాపకుల కొరత ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్లిపోతున్నారు. న్యాక్, ఎన్నైఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో పతనం కొనసాగుతూ, రీ-అక్రిడిటేషన్ ఆలస్యం అవుతోంది. పరిశోధన తగ్గిపోవడం, ఫ్యాకల్టీ-స్టూడెంట్ రేషియో తగ్గుతుండటంతో తెలంగాణ యూనివర్సిటీలు నేషనల్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడ్డాయి. దీని ప్రభావంగా యూజీసీ, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిధులు కూడా తగ్గిపోతున్నాయి.

‘పరిశోధన’పై ప్రతికూల ప్రభావం

పరిశోధన గ్రాంట్లు పూర్తిగా తగ్గిపోవడంతో గత 11 ఏళ్లలో తెలంగాణ విశ్వవిద్యాలయాలు CSIR, ICSSR, DST, DBT, UGC వంటి జాతీయ సంస్థల నుండి నిధులు పొందడంలో విఫలమయ్యాయి. మౌలిక సదుపాయాల కొరతతో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. పీహెచ్.డి, ఎం.ఫిల్ విద్యార్థులకు మార్గదర్శకత్వం లేక, గైడ్‌ల కొరత వల్ల పూర్తి కాల పరిశోధకులు నష్టపోతున్నారు. స్కాలర్‌షిప్‌లు నిలిచిపోవడం, ఫండింగ్ లేక పరిశోధనలు ఆగిపోవడం సమస్యగా మారింది. పరిశోధన పత్రాల సంఖ్య తగ్గిపోవడంతో Scopus, Web of Science, UGC-CARE Indexed Journals‌లో ప్రచురణలు తగ్గిపోయాయి. 2014-2024 మధ్య టాప్-100 జాతీయ పరిశోధనా సంస్థల జాబితాలో తెలంగాణ యూనివర్సిటీలకు స్థానం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రభుత్వం పీహెచ్.డి, ఎం.ఫిల్ విద్యార్థులకు ప్రత్యేక నిధులు కేటాయించి, సిలబస్ ఆధునీకరించి, పరిశోధన పథకాల కోసం నూతన మార్గదర్శకాలు రూపొందించాలి.

‘బోధనేతర’ సిబ్బంది పైనా నిర్లక్ష్యమే!

రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాలుగా బోధనేతర సిబ్బంది నియామకాలు ఆగిపోవడంతో పరిపాలన వ్యవస్థ స్తబ్దతకు గురైంది. కొద్ది మంది సిబ్బందిపై అధిక పనిభారం పడడంతో, ఒక్కో వ్యక్తి పలువురు పనులను నిర్వర్తించే పరిస్థితి ఏర్పడింది. కొత్త నియామకాలు చేపట్టకుండా తాత్కాలిక ఉద్యోగుల్ని, ఒప్పంద పద్ధతిలో తక్కువ జీతంతో, భద్రత లేకుండా కొనసాగిస్తున్నారు. దీనివల్ల వారికి ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, పెన్షన్, ఇతర హక్కులు లేకుండా పని చేయాల్సి వస్తోంది. రెగ్యులర్ నియామకాల కాలయాపన‌తో పాటు పదవీ విరమణల కారణంగా హెడ్ క్లర్క్, లైబ్రేరియన్, ల్యాబ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ఇతర పరిపాలనా పోస్టులు సైతం ఖాళీగా మారుతున్నాయి. ఫలితంగా పరీక్షల నిర్వహణ ఆలస్యం అవుతోంది. యూనివర్సిటీల్లో ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

నంగె శ్రీనివాస్

ఎడ్యుకేషన్, సోషల్ ఎనలిస్ట్.

94419 09191

Next Story

Most Viewed