- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా పుస్తకంలో దొంగలు పడ్డారు!
‘అవును.. నా పుస్తకంలో దొంగలు పడ్డారు. నేను నేర్చుకున్న అక్షరాల సంపదను గద్దల్లాగా ఎత్తుకుపోతున్నారు. నా చదువును దోచుకుని నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నా భవిష్యత్తును మార్కెట్‌లో అమ్మకానికి పెట్టి ఆగం చేస్తున్నారు.’
దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యాధనంబురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
అంటే.. విద్య అనే సంపదను దొరలు దోచుకోలేరు, దొంగలు దొంగలించలేరు. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు వచ్చి దానిని పంచుకోరు. ప్రపంచాన్ని అభివృద్ధి చేసేది విద్య మాత్రమే! అని చెప్పాడో మహాకవి.. కానీ ప్రస్తుతం విద్యను సైతం దొంగతనం చేస్తున్నారు కొందరు మహానుభావులు. వారు చదువురాని వారనుకుంటే పొరపాటే. డిగ్రీలు, పీజీలు పూర్తిచేసి ఉద్యోగులు, అధికారులుగా కొనసాగుతూ ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంతకీ చదువును ఎలా దొంగిలిస్తున్నారు అంటారా? ఇటీవల జరిగిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ ఘటనే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఎన్నో ఏండ్ల తర్వాత రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకొని 2022 అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. అందులో క్వాలిఫై అయిన వారంతా ఎన్నో ఆశలతో మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. మరోవైపు టీఎస్‌పీఎస్సీ నుంచి వివిధ నోటిఫికేషన్లు విడుదల అవుతుండటంతో నిరుద్యోగులంతా కోచింగ్ సెంటర్ల బాట పట్టి వేలకు వేలు ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకున్నారు. ఉన్నట్టుండి మార్చి 11వ తేదీన నిరుద్యోగుల గుండెల్లో టీఎస్‌పీఎస్సీ బాంబు పేల్చింది. కమిషన్‌లోని కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆయా పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ మరుసటి రోజు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటికొచ్చింది. అందులో పనిచేసే ఓ ఉద్యోగి క్వశ్చన్ పేపర్స్‌ను లీక్ చేసినట్టు తేల్చారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీక్ అయినట్టు నిర్ధారణకు వచ్చిన అధికారులు ఆ పరీక్షను రద్దు చేశారు. అప్పటికే ఎన్నో కష్టాలు ఎదుర్కొని రాత్రిపగలు తేడా లేకుండా చదివి ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల నెత్తిమీద పిడుగుపడినట్టుయింది.
హమ్మయ్యా ప్రిలిమ్స్ పాస్ అయ్యాం. మెయిన్స్‌కు బాగా ప్రిపేర్ అయ్యి ఎలాగైనా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్న అభ్యర్థులు సర్వీస్ కమిషన్ ప్రకటనతో ఆందోళనలో పడ్డారు. అప్పటికే ఏండ్లుగా గ్రూప్ 1 పరీక్షలో అర్హత సాధించేందుకు కోచింగ్ సెంటర్లలో, లైబ్రరీల్లో, స్టడీ సెంటర్లలో పుస్తకాలతో కుస్తీ పట్టిన వారి కష్టం వృథా అయింది. రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను జూన్ 11న నిర్వహిస్తున్నట్టు సర్వీస్ కమిషన్ ప్రకటించడంతో అప్పటికే క్వాలిఫై అయిన అభ్యర్థులు పరీక్షలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. క్వశ్చన్ పేపర్లు లీక్ చేసి మారుమూల పల్లెలకు చేర్చినా.. సర్వీస్ కమిషన్ పాలకమండలికి, అధికారులకు తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇప్పటి వరకు ఈ కేసులో సుమారు 20 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే కొందరు విడుదలయ్యారు కూడా. సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాల్లో అవినీతి జరుగుతున్నదని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. కానీ నిరుద్యోగులు వాటిని నమ్మకుండా నిబద్ధతతో పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానీ ఈ ఒక్క ఘటనతో సర్వీస్ కమిషన్‌పై నిరుద్యోగులకు నమ్మకం పోయినట్టయింది. కొందరు ప్రయివేట్ ఉద్యోగాలు మానేసుకుని మరీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహిస్తామని చెప్పడంతో అలాంటి వారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇన్ని రోజులు అప్పు చేసి, దొరికింది తిని, కొన్ని సార్లు పస్తులుండి పరీక్షకు సిద్ధమయ్యారు. నాలుగు నెలల తర్వాత పరీక్షను మళ్లీ నిర్వహిస్తారని ప్రకటన రావడంతో చాలా మంది హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లోని పలు లైబ్రెరీలు, స్టడీ హాల్స్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు తక్కువైపోయారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకే చాలా మంది ఇలా సొంత గ్రామాలకు పయనమయ్యారు.
ఇన్ని రోజులు డబ్బులు, ఆభరణాలనే దోచుకునే దొంగలు ఎక్కువగా మనకు కనిపిస్తే.. ఇప్పుడు ఇలా అధికారులు, ఉద్యోగుల హోదాలో కొనసాగుతూ దర్జాగా నిరుద్యోగుల చదువును దోచుకుని వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. డబ్బులు, ఆభరణాలు దొంగతనానికి గురైతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఇలా చదువు దొంగతనానికి గురైతే భవిష్యత్తు అంధకారమే.
పి.మహేశ్ కుమార్
9292956812