- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విభజన సమస్యలపై, జనామోద పరిష్కారం అవసరం!
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న దాదాపు 15 సమస్యలను కొలిక్కి తీసుకురావడానికి.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10 వ షెడ్యూల్‌లోని సంస్థలు సహా విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల చిక్కుముళ్ల పరిష్కారంపై వీరు చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి గతంలోని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంత మేర ప్రయత్నించినా అనేక కారణాల చేత కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాలకు నిధులు చాలా అవసరం కాబట్టి, ఈ సమస్యల పరిష్కారానికి వీలుగా కార్యాచరణ రూపొందించాలని కృతనిశ్చయం స్పష్టంగా కనిపిస్తుండటం శుభ పరిణామం.
షెడ్యూల్‌లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిలా బిడే కమిటీ కొన్ని సూచనలు, మార్గదర్శకాలు సిఫార్సు చేసింది. ఈ షెడ్యుల్‌లో మొత్తం 91 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 89ని విభజించాలని కమిటీ చేసిన సూచనలకు ఏపీ అంగీకారం తెలిపింది. కానీ 68 కార్పొరేషన్లను మాత్రమే విభజిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ, ఎఫ్‌ఎస్‌సీ వంటి 23 కార్పొరేషన్లలోని ఆయా సంస్థలకు ఉన్న ఆస్తులపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై భిన్న వాదనలు ఉన్నాయి. ఇక 10వ షెడ్యూల్‌లో 142 సంస్థలు ఉన్నాయి. తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ వంటి 30 సంస్థలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి. తెలుగు అకాడమీ సహా భవనాలు, ఇతర అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. రాజ్‌భవన్, లోకాయుక్త, హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణపై ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటున్నది. కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నుల బకాయిలపై వివాదాలున్నాయి. హైదరాబాద్‌లో ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, సీఐడీ కార్యాలయం, మినిస్టర్స్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్లను ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. కానీ లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, సీఐడీ కార్యాలయం, హెర్మిటేజ్ కాంప్లెక్స్ తమకు కావాలని ఏపీ కోరుతున్నది.
పెండింగులో ఉద్యోగుల మార్పు
అలాగే స్థానికత, ఆప్షనల్స్ ఆధారంగా ఉద్యోగుల పరస్పర మార్పు అంశం పెండింగ్‌లో ఉన్నది. ఏపీ స్థానికత కలిగిన 1800 మందికి పైగా విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు వంటి అంశాలు విద్యుత్ బకాయిల అంశం కూడా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి, సుమారు రూ. 24 వేల కోట్లు ఏపీ చెల్లించాలని తెలంగాణ వాదిస్తున్నది. మాకు రూ. 7 వేల కోట్లు రావాలని ఏపీ అంటున్నది. ఇక నీటిపారుదలకు సంబంధించి కృష్ణ జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున అంతర్జాతీయ నీటి పంపిణీ నిబంధనల ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియా నిష్ఫత్తిలో నీటి పంపిణీ చేయాలని, తెలంగాణ 558 టీఎంసీలు కేటాయించాలని వాదిస్తున్నది. కృష్ణ జలాల పంపిణీపై వేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు త్వరలో వెలువడనున్నది కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టుల భవితవ్యం ఈ నీటి కేటాయింపులపైనే ఆధారపడి ఉన్నది.
మూడంచెల్లో పరిష్కారానికి ఒకే
రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి ఆటంకంగా ఉన్న విషయాలను, పరిస్దితులను ఇద్దరు ముఖ్యమంత్రులు స్దాలీపులాకన్యాయంగా ప్రస్తావించారు. విభజన సమస్యల పరిష్కారానికి మూడు దశల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు. చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారులతో కూడిన త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండో దశలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేయనున్నారు. రెండు దశల్లో పరిష్కారం కాని సమస్యలకు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించే అవకాశం లేనందున మూడంచెల్లో పరిష్కరించుకోవాలని నిర్ణయించడం ముదావహం. ఈ క్రమంలో అంశాలవారీగా చొరవ తీసుకుని న్యాయపరమైన చిక్కులపైనా చర్చించాలి. ఇలా వివిధ అంశాలపై ఏకాభిప్రాయానికి వస్తే ఇరు రాష్ట్రాలకు ఆర్థికంగా కొంత వెసులుబాటు వస్తుంది.
ఆలసిస్తే ఆశాభంగం
విభజన చట్టం 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు విభజన కానీ మొత్తం రూ.8 వేల కోట్ల మేరకు ఉంది. పదేళ్లుగా బ్యాంకుల్లో ఉన్న వేల కోట్ల నిధులపై చర్చ జరగాలి. రెండు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పూర్తికాని సంస్థల విభజన తక్షణం చేపట్టాలి. ఆయా సంస్థలకు చెందిన రూ.8 వేల కోట్లను వినియోగించుకోని రెండు రాష్ట్రాలు ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరతతో సతమవుతున్నాయి. కమిటీలతో కాలయాపన చేస్తూ విభజనపై చర్చను మరింత కాలం పొడిగిస్తే ఇరు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ జన ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా చర్యలు అవసరం. ప్రభుత్వ కమిటీలతో పాటు ఇరు రాష్ట్రాలు రాజకీయ, సామాజిక, ఆర్థిక నీటి పారుదల నిపుణుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణీత కాల వ్యవధిలో దీనికి ఓ పరిష్కారం చూపాలి. కేంద్రం కూడా జాప్యం చేయకుండా తన వంతు సహాయ సహకారం అందిస్తే జనామోదంతో విభజన సమస్యలకు పరిష్కారం రాగలదు.
వాడవల్లి శ్రీధర్
99898 55445