కార్గిల్ యుద్ధంలో నేలకొరిగిన ఒక వీరుని చివరి మాటలు ఇవే..

by Ravi |   ( Updated:2022-09-03 15:17:48.0  )
కార్గిల్ యుద్ధంలో నేలకొరిగిన ఒక వీరుని చివరి మాటలు ఇవే..
X

కెప్టెన్ విజయంత్ థాపర్ లాంటి వీరులు ఎందరో తమ యవ్వనాన్ని, వ్యక్తిగత సౌఖ్యాలను త్యాగం చేసి దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతూ శత్రుసేనలకు సింహస్వప్నంలా నిలుస్తున్నారు. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం కోసం 527 మంది వీరపుత్రులు అసువులుబాసారు. అందులో తనను తాను ఒక సమిధగా సమర్పించుకున్న కెప్టెన్ విజయంత్ థాపర్‌ను 'విజయ్ దివస్' సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించి మన దేశ భక్తిని చాటుకుందాం.

కార్గిల్ వీరుడు కెప్టెన్ విజయంత్ థాపర్ వీర మరణం పొంది రెండు దశాబ్దాలు. అతని నిష్క్రమణ వలన ఏర్పడిన శూన్యం ఆ వీరుడి తల్లిదండ్రుల గుండెలలో మాత్రం చిరస్థాయిగా గూడు కట్టుకుపోయింది. విజయంత్ థాపర్ కార్గిల్ యుద్ధంలో 29 జూన్ 1999 న వీర మరణం పొందారు. ఆయన శౌర్య ప్రతాపానికి గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'వీర్‌చక్ర' పతకంతో సత్కరించింది. కల్నల్ వీఎన్ థాపర్-తృప్తా థాపర్ దంపతులకు 26 డిసెంబర్ 1976న పంజాబ్‌లోని నంగల్‌లో విజయంత్ థాపర్ జన్మించారు.

ఆయన కుటుంబంలో ముత్తాత, తాత, తండ్రి తరువాత నాలుగో తరం కూడా భారత సైన్యంలో సేవలందించారు. యుద్ధ ట్యాంకు విజయంత్ స్ఫూర్తితో తండ్రి తన కుమారుడికి 'విజయంత్ థాపర్' అని నామకరణం చేశారు. విజయంత్‌కు చిన్నప్పటి నుంచి ఎయిర్‌ఫోర్స్ లేదా ఆర్మీలో చేరాలనే కోరిక ఉండేది. కష్టపడి చదివి డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని 'ఆర్మీ సర్వీస్'లో నియమితులయ్యారు.

మాతృభూమి ఋణం తీర్చుకుంటానని

విజయంత్ ఎంతో దయాగుణం కలిగినవారు. కాలేజీ రోజులలో తండ్రి ఇచ్చిన డబ్బును దుబారాగా ఖర్చు చేయకుండా యాచకులకు ఇచ్చేవారు. తను కుప్వారాలో ఉన్నప్పుడు ఓ అమ్మాయి తల్లిదండ్రులను తీవ్రవాదులు పాశవికంగా చంపేశారు. దీంతో మాట పడిపోయిన రుక్సానాను క్రమం తప్పకుండా కలిసి మానసిక స్థయిర్యం పెంపొందేలా చేశారు. ఆర్థికంగా ఆదుకున్నారు. తన మరణానంతరం కూడా ఆదుకోవాలని కోరారు. 'నేను దుర్బేధ్య సాహస కార్యానికి వెళ్తున్నాను. బహుశా ఈ ఉత్తరం మీకు చేరేనాటికి నేను మిమ్ములను ఆకాశం నుంచి చూస్తూ ఉండవచ్చు. మీరు రుక్సానాను మరచిపోవద్దు' అని కార్గిల్ యుద్ధం సమయంలో తన తల్లిదండ్రులకు ఉత్తరం రాశారు. తాను దేశ సేవ కోసమే జన్మించానని, మరో జన్మంటూ ఉంటే తప్పకుండా సైన్యంలో చేరి దేశ సేవకు అంకితమవుతానని అనేవారు.

విజయంత్ థాపర్ జ్ఞాపకంగా మద్రాస్‌లోని హెలిపాడ్‌కు విజయంత్ థాపర్ పేరు పెట్టారు. కార్గిల్ యుద్ధంలో పర్వత శ్రేణులు పాకిస్తాన్‌కు అనుకూలంగా, మనకు ప్రతికూలంగా ఉంటాయి. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి 22 ఏండ్ల వయసులో కెప్టెన్ విజయంత్ థాపర్ అత్యంత శౌర్య ప్రతాపాపాలను కనబరిచారు. తన ప్రాణాలను సైతం అర్పించారు. 'మరో జన్మంటూ ఉంటే దేశం కోసం మళ్లీ సైన్యంలో చేరి మాతృభూమి ఋణం తీర్చుకుంటా' అని ఆయన చేసిన ప్రతిన వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

కొడుకు త్యాగాలను తలచుకుని

ఏడు పదుల వయసులోనున్న ఆయన తండ్రి థాపర్ ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు తన కొడుకు పేరున ఉన్న పార్క్ వద్దకు జాగింగ్ చేసుకుంటూ చేరుకుంటారు. కొడుకు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. కొడుకు ప్రాణత్యాగం తమ హృదయాలను గర్వంతో ఉప్పొంగేలా చేసిందని చెబుతుంటారు. కొడుకు వీరమరణానికి ముందు తన బృందంతో టోలోలింగ్ పర్వంతంపై శత్రువుల బంకర్‌ను స్వాధీనం చేసుకొవడం ద్వారా యుద్ధంలో విజయం సాధించాడని గర్వంగా చెబుతుంటారు. ఆర్మీ క్యాజువాలిటీ నుంచి ఫోన్ రాగానే గాయపడ్డాడని అనుకున్నాం కానీ, వీరమరణం పొందాడంటే ఒక్కసారిగా మ్రాన్పడిపోయానని అంటారు. కెప్టెన్ విజయంత్ థాపర్ లాంటి వీరులు ఎందరో తమ యౌవనాన్ని, వ్యక్తిగత సౌఖ్యాలను త్యాగం చేసి దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతూ శత్రుసేనలకు సింహస్వప్నంలా నిలుస్తున్నారు. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం కోసం 527 మంది వీరపుత్రులు అసువులుబాసారు. అందులో తనను తాను ఒక సమిధగా సమర్పించుకున్న కెప్టెన్ విజయంత్ థాపర్‌ను 'విజయ్ దివస్' సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించి మన దేశ భక్తిని చాటుకుందాం. జై హింద్ .

(నేడు కార్గిల్ డే, విజయ దివస్)

యేచన్ చంద్రశేఖర్

హైదరాబాద్

88850 50822

Advertisement

Next Story