- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నిర్లక్ష్యం కొనసాగితే.. ఎడారిగా దక్షిణ తెలంగాణ!
కాలం మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సీమాంధ్ర పెట్టుబడిదారుల పాలనలో మగ్గిపోతున్న మన తెలంగాణ నేల విముక్తి కోసం పోరాడే అవకాశం పొందాం ఎన్నో పోరాటాలు, త్యాగాలతో రాష్ట్రం సాధించుకున్నాం. నాడు ఆంధ్ర ప్రాంతానికి సాగు జలాలు తరలించుకుపోతుందని పోరాడం.. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో ఏపీ దోపిడీ ఎక్కువైంది. పాలకుల నిర్లక్ష్యం వల్ల కృష్ణా నీటిని వినియోగించుకోవడంలో విఫలమయ్యాం.
కృష్ణాను మళ్లించుకుంటున్నా..
నిజానికి కృష్ణానది జలాల్లో తెలంగాణకు 69 శాతం అంటే 811 టీఎంసీల నీళ్లు దక్కాలి. కానీ కేసీఆర్ అనాలోచితంగా చేసిన సంతకంతో, 37 శాతం అంటే 299 టీఎంసీలు మాత్రమే పొందగలిగాం. సాధించుకున్న ఈ 299 టీఎంసీలను కూడా ఈ తొమ్మిదేండ్లలో ఏ సంవత్సరం పూర్తిగా వినియోగించుకోలేకపోయాం. అదే ఏపీ కేటాయింపును మించి వాడుకుంది. కృష్ణా జలాల వినియోగ సామర్థ్యం పెంచటంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దక్షిణ తెలంగాణ దారుణంగా మోసపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోలిస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులోనూ వివక్ష స్పష్టంగా కనిపిస్తున్నది. పైగా ఈ ప్రాజెక్టు నీటి లిఫ్టింగ్ సామర్థ్యాన్ని కూడా రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించారు. ప్రాజెక్టులో 1,2 పంపులను మాత్రమే పూర్తి చేసి ఉద్దండపూర్ రిజర్వాయర్ని నింపి ప్రజల్ని మురిపించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిండి ప్రాజెక్టుది సైతం ఇదే పరిస్థితి. తుమ్మిళ్ల, గట్టు, తదితర ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయడంపై కూడా శ్రద్ధ చూపలేదు. ఆర్డీఎస్‌ను పూర్తిగా వినియోగానికి తేలేదు. కల్వకుర్తి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకుండా చెరువులు, కుంటలు, ఇతర రిజర్వాయర్లకు నీటిని వదిలి.. నీళ్లు చూపిస్తూ జనాన్ని భ్రమల్లో ముంచుతున్నరు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. పైగా తెలంగాణ రాకముందు చేపట్టిన కల్వకుర్తి(40 టీఎంసీలు), ఎస్ఎల్ బీసీ (40 టీఎంసీలు), నెట్టెంపాడు(25 టీఎంసీలు) ప్రాజెక్టులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం.
పోతిరెడ్డిపాడు, ఇతర ప్రాజెక్టుల ద్వారా కేటాయించిన నీటికి మించి బేసిన్ ఆవల ఉన్న రాయలసీమకు అక్రమంగా తరలించుకునే ప్రయత్నంలో ఉంది ఏపీ. రాయలసీమలో 364 టీఎంసీల స్టోరేజీతో పలు రిజర్వాయర్లను నిర్మించుకుంది. పోతిరెడ్డిపాడు విస్తరణ (14 గేట్ల నుంచి 24 గేట్లకు 40 వేల నుండి 80 వేల క్యూసెక్కులకు), రాయలసీమ లిఫ్ట్ (రోజుకు 3.0 టీఎంసీలు) ద్వారా రోజుకు 11,00 టీఎంసీల కృష్ణా జలాలను తరలించే ప్రణాళికలు వేగంగా అమలవుతున్నాయి. కానీ ఈ తొమ్మిదేండ్లలో మన రాష్ట్రంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న అన్ని ప్రాజెక్టులు కలిపి కూడా రోజుకు ఒక్క టీఎంసీ మించి నీటిని తరలించే ఏర్పాట్లు చేసుకోలేదు. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే దక్షిణ తెలంగాణ త్వరలోనే ఎడారిగా మారే ప్రమాదం ఉంది. హైదరాబాద్ తాగునీటికి కూడా నీటి కొరత ఏర్పడే ముప్పు ఉంది.
ప్రాజెక్టు రీ-డిజైన్ చేయడంతో..
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఆ మేరకు ప్రాజెక్టు నిర్మాణం సాగడం లేదు. స్వరాష్ట్రంలో ఈ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతుంటే, స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కనీసం నిరసన లేదా స్పందన ఇవ్వకపోవడం ఎంత దారుణం.ఈ ప్రాజెక్టును రీ-డైజైన్ చేసి 2015, జూన్ 11న మహబూబ్‌నగర్ జల్లా బూత్పూర్ మండలం కరివెన గ్రామంలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దీని ప్రకారం జూరాల ముందు భాగం నుంచి కాకుండా శ్రీశైలం ప్రాజెక్టు ముందుభాగం నుంచి నీటిని ఎత్తిపోయడానికి (లిఫ్ట్) చేయడానికి ఉద్దేశించారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ముందుభాగంలో రేగుమానుగడ్డ వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథక ప్రాంతానికి ఉత్తరం వైపున పాలమూరు ఎత్తిపోతలకు సర్కారు శ్రీకారం చుట్టింది. అక్కడి నుంచే కొయిల్ సాగర్‌కు మూడు టీఎంసీల నీళ్లు ఇవ్వాలి. జూరాలకు మొదట పంచెదిన్నెలపాడు లిఫ్ట్ ద్వారా కొయిల్‌సాగర్‌కు నీళ్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ ఇప్పటీకి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు.
కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని అంటున్న వారూ లేకపోలేదు. కాగా ప్రస్తుతం ఖర్చు రూ. 60వేల కోట్ల అంచనా వ్యయం ఎక్కువ కావడంతో పాటు 2,800 మెగావాట్ల విద్యుత్ అవసరమని చెబుతున్నారు. మొదటి ప్రాజెక్టు రీడిజైన్‌తో 165 అడుగుల ఎత్తుకు అదనంగా నీటిని తోడాల్సి వస్తున్నది. 75 కిలోమీటర్లు ఉండాల్సిన ఆయకట్టు కాలువ (రిజర్వాయర్ల లింకేజీ కాలువలు)103 కిలోమీటర్ల దూరం పెరిగింది. పైగా శ్రీశైలంలో 840 అడుగుల నీరు ఉన్నప్పుడే ఈ పథకంతో ఉపయోగం. ప్రస్తుతం శ్రీశైలం నుంచి అన్ని అవసరాలకు గాను రోజుకు ఎనిమిది టీఎంసీలు వాడుకుంటున్నారు. ఏడాదిలో రెండు, మూడు నెలలు మాత్రమే ఈ పథకానికి నీటి లభ్యత ఉంటుంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు నీరు రావడానికి జూరాల ద్వారానే సాధ్యం. అక్కడి నుంచి 70 నుంచి 80 టీఎంసీల నీటిని తోడడానికి అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు చిన్నదే కానీ ఎగువ నుంచి నీరు వస్తుంది. పైగా వరదలు వచ్చినప్పుడు జూరాల ద్వారా ఇతర ప్రాజెక్టులనూ నింపుకోవచ్చు. అంచనా వ్యయం కూడా రూ. 40 వేల కోట్లల్లో రూ. 10 వేల కోట్లు తగ్గుతుంది కూడా. గతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను రీ-డిజైన్ చేయడం మూలనా రాష్ట్ర ప్రజలపై వేల కోట్లు అదనపు భారం పడిందని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.
ఓట్లేనా.. బాగోగులు వద్దా?
సాంకేతిక విషయాలు పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఏ విధంగా కావాలని కోరితే ఆ విధంగా ఇంజినీర్లు డీపీఆర్‌లు తయారు చేయడం మూలంగా ఈ నష్టం జరుగుతున్నది. వ్యాప్‌కోస్ ఇచ్చిన నివేదికే ఇందుకు సాక్ష్యం. ఆ రిపోర్టుల్లో శాస్త్రీయత లేదని ప్రస్తుత ప్రభుత్వం వాదిస్తున్నది. కానీ, దీనిపై సాగునీటి రంగ నిపుణులతో ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టలేదు. బడ్జెట్‌లో కేటాయింపులే గాక ఆయా సంస్థల ద్వారా ప్రాజెక్టుల కోసం తెచ్చిన అప్పును లెక్కవేస్తే రూ.80 వేల కోట్లు. మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పథకాల కింద కాలువల పనులను చేపట్టకపోవడం, ప్రాజెక్టులను పూర్తిచేయకపోవడం మూలంగా జిల్లా ప్రజలకు సాగునీరు ఇస్తామన్న ప్రకటనలు కాగితాలకే పరిమతమయ్యాయి. నిర్మాణంలోనున్న ప్రాజెక్టుల కాలాన్ని పొడిగించకుండా నిర్దిష్ట సమయంలోగా పూర్తిచేసి రైతులు, ప్రభుత్వానికి ఆదాయం రాబట్టాల్సి ఉంది. 2003లో కృష్ణా మిగులు జలాల పంపిణీ కోసం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నియమించింది. ఆ ట్రిబ్యునల్ 2010లో మధ్యంతర తీర్పును వెలువరించింది. దీనిపై 2010లో రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 2014లో తెలంగాణ ఆవిర్భావం జరగడంతో తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం 12.50 లక్షల ఎకరాలను ఆయకట్టుగా స్థిరీకరించడం అనివార్యం.
నిజాం నియంతృత్వ కబంధ హస్తాల నుంచి బయటపడ్డ తర్వాత హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు షాద్‌నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటువంటి నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుంటే అందరూ మౌనంగా తిలకించడం కడు శోచనీయం. ఈ నియోజకవర్గంలోని ఫార్మా కంపెనీల నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు ఈ నీటి విషయంలోనూ అన్యాయం జరిగితే... వారి ఇబ్బందులు అరణ్య రోదన అవ్వాల్సిందేనా? గత ప్రభుత్వాలు రూపొందించిన ప్రాణహిత- చేవెళ్ళ, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తయితే షాద్‌నగర్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో షాద్‌నగర్ రైతులకు తీవ్రంగా అన్యాయం చేసింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం, గత తొమ్మిది సంవత్సరాలలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎందుకంటే సీఎం కేసీఆర్‌కి, స్థానిక ఎమ్మెల్యేకు షాద్‌నగర్ ప్రజల ఓట్లు కావాలి తప్ప, ప్రజల బాగోగులు పట్టడం లేదు. ఇప్పటికైనా వచ్చే ప్రభుత్వాలు షాద్ నగర్ ప్రజలు, రైతాంగం కోసం ఈ ప్రాజెక్టు పనులు ఇక్కడ కూడా చేపట్టాలని కోరుకుందాం. లేనిపక్షంలో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు ఇక్కడ మూల్యం చెల్లించుకునేందుకు ఓట్ల ద్వారా ప్రజాకోర్టులో సిద్ధంగా ఉండాలని హెచ్చరిద్దాం.
మన్నారం నాగరాజు
రాష్ట్ర అధ్యక్షుడు, లోక్‌సత్తా పార్టీ
95508 44433