గుబులు రేపుతున్న ఈడీ దాడులు

by Ravi |   ( Updated:2023-03-26 00:30:49.0  )
గుబులు రేపుతున్న ఈడీ దాడులు
X

ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) గురించే చర్చ కొనసాగుతోంది, ఇది రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖల కింద పని చేసే ప్రత్యేకమైన ఆర్థిక దర్యాప్తు సంస్థ. మనీలాండరింగ్ నేరాలను నిరోధించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పని చేస్తోంది. తమపై రాజకీయంగా ఆర్థికంగా ఈడి చేస్తున్న దాడుల నేపథ్యంలో మొన్న సాక్షాత్తు 14 మంది ప్రతిపక్ష నాయకులు ఒక్కటై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారంటే ఈడీ దాడుల తీవ్రత ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో తెలియజేస్తోంది. ఈ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కాం ఏపీ, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల రాజకీయ నాయకులను కుదిపేస్తోంది. పేరున్న నేతలకు సైతం వరుసగా నోటీసులు ఇస్తూ ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఈడీ పేరు చెప్పగానే... పేరుగాంచిన సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు, పదవిలో ఉన్న రాజకీయ నాయకులు సైతం భయపడిపోతుంటారు. కారణం ఈడీ సంస్ధకు చట్టబద్ధంగా దాఖలు పడిన పవర్‌ఫుల్ అధికారాల వల్లనే సుమా !

ఈడీ ఎందుకింత పవర్ ఫుల్..

సీబీఐ ఐటీ ఇతర సంస్థల కంటే ఈడీ చాలా చాలా పవర్ ఫుల్. కేసు నమోదైతే చాలా సందర్భాల్లో జైలుకు వెళ్లాల్సిందే, అసలు ఈడీ ఎలా పని చేస్తుందంటే…

1. ఫెమా (FEMA) అంటే ఫారిన్ ఎక్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్-1999. ఇది సివిల్ చట్టం. ఫెమాలో విదేశీ మారక ద్రవ్యం విషయంలో అవకతవకలు జరిగితే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటారు. 2. పిఎమ్ఎల్ఏ (PMLA) అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002. ఇది క్రిమినల్ చట్టం. అక్రమంగా డబ్బులు సంపాదించి.. చట్టానికి దొరకకుండా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునే వారిని టార్గెట్ చేస్తారు. అలా అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని.. ప్రభుత్వానికి అటాచ్ చేయడం ఈడీ మెయిన్ డ్యూటీ.

పిఎమ్ఎల్ఏ ప్రకారం ఈడీకి 3 సూపర్ పవర్స్ ఉన్నాయి. 1. కోర్టు అనుమతి లేకుండా ఎవరి ఆస్తులనైనా ఈడీ అటాచ్ చేయవచ్చు. దేశంలో మరే ఏజెన్సీకి ఈ అధికారం లేదు. కోర్టు పర్మిషన్ లేకుండా ముందస్తు సమాచారం లేకుండా దేశంలో ఎవరి ఇంట్లో, ఆఫీస్‌లోనైనా రైడ్స్ చేయవచ్చు. 2. పిఎమ్ఎల్ఏ సెక్షన్ 50 అండర్ 2 ప్రకారం.. ఈడీ ఎవరి స్టేట్మెంట్ ఐనా రికార్డు చేస్తే, అది కోర్టులో సాక్ష్యంగా తీసుకుంటారు. ఒకవేళ.. ఆ వ్యక్తి తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చారనుకోండి. మళ్లీ అతని మీదే చర్యలు తీసుకుంటారు తప్ప ఈడీ అధికారులకు దీనితో ఏ సంబంధం ఉండదు.

3. సాధారణంగా చట్ట ప్రకారం.. నేరం రుజువు కానంత వరకు ఎవరైనా నిర్దోషిగా ఉంటారు. కానీ ఇక్కడ ఇది రివర్స్...ఉదాహరణకు ఒక వ్యక్తి అక్రమంగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలున్నప్పుడు, తన డబ్బు సక్రమంగా సంపాదించిందేనని సదరు వ్యక్తే నిరూపించుకోవాలి. లేకపోతే తప్పు చేసినట్లే లెక్క. అందుకే ఈడీ మోపే ఆరోపణలకు తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఎవరికైనా తల ప్రాణం తోకలోకి వస్తుంది. అందుకే.. ఈ మధ్య కాలంలో సీబీఐ కంటే ఈడీ పైనే నజర్ ఎక్కువైంది.

బీజేపీ హయాంలో 99 వేల కోట్ల జప్తు....

2004-05, 2013-14 మధ్య యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) అధికారంలో ఉన్న సమయంలో కేవలం 112 దాడులు చేసి రూ.5,346 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌ జరిగింది. అదే ఇప్పటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) తన 8 ఏండ్ల అధికారంలో ఇప్పటివరకు అంటే 2014-22 మధ్య కాలంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఏ) కింద 3,010 దాడులు నిర్వహించి రూ.99,356 కోట్ల విలువైన నేరపూరిత ఆస్తులను అటాచ్ చేసింది. అదేవిధంగా, ఫెమా కేసుల నమోదు 1,722 (2012-13), 1,041 (2013-14), 915 (2014-15), 1,516 (2015-16), 1,993 (2016-17), 3,627-18 (2017) , 2,659 (2018-19), 3,360 (2019-20), 2,747 (2020-21), 5,313 (2021-22) స్థాయిలో జరిగింది.

ప్రతిపక్ష నాయకులే టార్గెట్‌గా....

2014 నుండి ఈడీ స్కానర్‌లో ఉన్న 95% ప్రతిపక్ష నాయకుల పార్టీల వారీగా జాబితా...కాంగ్రెస్ - 24, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) - 19, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) - 11, శివసేన - 8, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎమ్‌కే) - 6, అల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐడీఎంకే) -1, బిజు జనతా దళ్ (బీజేడీ) - 6, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) - 5, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) - 5, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) - 5, తెలుగుదేశం పార్టీ (టిడిపి) - 3, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) - 3,ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డి) - 3, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) - 3, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) -2, నేషనల్ కాన్పరెన్స్ (ఎన్‌సీ) - 2, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) - 2, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) - 1, ఎస్‌బీఎస్‌పీ - 1, టీఆర్ఎస్ - 3. కాగా యూపీఏ కాలంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు. ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలపై దాడులు నిర్వహించగా.. ముగ్గురికి మాత్రమే శిక్ష పడింది, ఎన్‌డీఏ కాలంలో ఒక ముఖ్యమంత్రి, 14 మంది మాజీ ముఖ్యమంత్రులు, 19 మంది మంత్రులు, 24 మంది ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు, 11 మంది మాజీ ఎమ్మెల్యేలు, 7 గురు మాజీ ఎంపీలపై ఈడీ దాడులు చేయగా, 19 మందిని అరెస్ట్ చేసి, 32 మందిపై ఛార్జ్ షీట్ తెరిచింది.

బీజేపీ వాళ్లపై దాడులు ఉండవా?

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో గత ఎనిమిదేళ్లలో బీజేపీ నేతలు లేదా వారి బంధువులపై ఎన్ని ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయి? గత 8 సంవత్సరాలలో బీజేపీ నాయకులు లేదా వారి బంధువులపై ఎన్ని ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయి? బీజేపీ ప్రజలందరూ సత్య హరిశ్చంద్ర బంధువులేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే, 2004-2014 యూపీఏ హయాంలో కనీసం 124 మంది ప్రముఖ రాజకీయ నాయకులు సీబీఐ స్కానర్ కిందకు వచ్చారు. సీబీఐ 72 మంది రాజకీయ నాయకులను విచారించగా, వారిలో 29 మంది కాంగ్రెస్‌ నేతలతో కల్పి 43 మంది ప్రతిపక్షాలకు చెందిన వారున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 6 మంది బీజేపీ నేతలు మాత్రమే సీబీఐ స్కానర్‌లో ఉన్నారు.

ఈడీ విశ్వసనీయత పెరగాలంటే...

విచిత్రంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఎక్కువగా ప్రతిపక్షాలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయించడం ఆనవాయితీగా మారిపోయింది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతికి సంబంధించిన అనేక సందర్భాలు ఉన్నప్పటికీ, అలాంటి దాడులు చేయకుండా సెలెక్టివ్ రైడ్స్‌ని మాత్రమే కేంద్ర ఏజెన్సీలు చేస్తున్నాయనే అపవాదు ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అనాడు కేంద్ర సంస్థలను ఇలానే విమర్శించింది. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేడు అదే రీతిలో బీజేపీపై విమర్శలు చేస్తున్నది, కేంద్ర సంస్థలైన ఈడీ, సీబీఐ సంస్థలు నిజాయితీగా నిష్పక్షపాతంగా, అవినీతిపరులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ సమదృష్టితో ఎంక్వయిరీ చేసి దేశాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే వాటికి విశ్వసనీయత పెరుగుతుందనటంలో సందేహం లేదు..

డా. బి. కేశవులు నేత. ఎండి.

చైర్మన్, అవినీతి వ్యతిరేక వేదిక

[email protected]

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story