- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆది శేషుని పడగలా శేషతీర్థం..
ఒక పెద్ద నీటి గుండం. గంప కింద కోడి ని కప్పెట్టినట్టుంది. దాని చుట్టూ కప్పేసిన కొండ అంచులు. దీపం గాలికి రెపరెపలాడకుండా రెండు చేతులతో కాపాడినట్టుంది. పైనెక్కడో ఆ అంచుల చీలిక నుంచి నీటి గుండంలోకి నిత్యం దుముకుతున్న జలధార. శేషాచలం కొండల్లో కొలువైన శేషతీర్థం. ఆది శేషుని పడగలా ఉంటుంది. మండు వేసవిలోనూ నీటి కొరత ఉండదు.
మే నెల 5వ తేదీ పౌర్ణమి నాడు శేషతీర్థ ఉత్సవం. ఉత్సవం అంటూ ఏమీ జరగదు. ఆరోజు వందల సంఖ్యలో ప్రకృతి ప్రియులు వెళ్ళివస్తుంటారు. శేషతీర్థం వెళ్ళిరావడం అంత తేలికకాదు. మిగతా తీర్థాలకంటే కష్టతరమైంది. చాల తక్కువమంది వెళ్లి వస్తుంటారు. ఈ తీర్థంలో రాత్రి నిద్రించడానికి వీలుండదు. తిరుమలలో సూర్యోదయానికంటే ముందు బయలుదేరితే, సూర్యాస్తమయం లోపు తిరిగి రావచ్చు.
అడవి పిలుస్తుంది..
తిరుమలలో గోగర్భం డ్యాం దాటాలి. డ్యాంకు కుడివైపున రోడ్డు మార్గాన వాహనాల్లో కొంత దూరం వెళ్ళవచ్చు. అక్కడి నుంచి తూర్పు వైపుగా నడక సాగించాలి. ఎదురుగా అకేషియా వనంలో నడక ఎంత చల్లగా, హాయిగా ఉంటుందో! ఆ వనంలోంచి నడుస్తూ, ఫైర్ సేఫ్టీ వాల్ దాటాలి. అక్కడినుంచి పూర్తిగా అడవే. పక్షుల పలకరింపులు. తెలతెల వారుతుండగా చెట్ల మాటునుంచి ప్రసరిస్తున్న సూర్యకిరణాలు. ఎంత ఆహ్లాదకర వాతావరణమో! పైన ఒక కొండ వరుస. యిరువైపులా లోతైన లోయలు. ఆ లోయల కావల సమాంతరంగా కొండల వరుసలు. కొంత దూరం సాగాక ఎదురుగా సానమిట్ట. మరి కాస్త నడిచాక ఎడమ వైపున లోయలోకి దిగాలి. లోయలో మెలికలు తిరిగిన దారి. చెట్ల కొమ్మలు పట్టుకుని జాగ్రత్తగా దిగాలి. పట్టు దొరకని చోట కూర్చునే పాకాలి. దారంతా దట్టంగా పెరిగిన బోద. దారంతా రాళ్ళగుట్టలు, పెద్ద పెద్ద బండరాళ్ళు.
టవల్ కూడా భారమే..!
ఆ రాళ్ళ మొదట్లోనే అరుదైన అకేషియా డల్హసి చెట్టు. ఇది మర్రిజాతికి చెందింది. దాని ఆకులు మర్రి ఆకుల్లానే ఉంటాయి. విదేశాల నుంచి వచ్చిన పక్షులు వేసిన రెట్టల్లోంచి విత్తనాలు పడి మొలిచిన చెట్టు. దీని ఆకులు తుంచితే పాలు తెల్లగా ఉంటాయి. కాసేపటికి నీలిరంగుగా మారతాయి. ఆ రాళ్ళ గుట్టలనుంచి కిందకు దిగడం పెద్ద ప్రయాస. బుజాన వేసుకున్న బ్యాగు భారమనిపిస్తుంది. తిరిగి ఎక్కేటప్పుడు బుజాన వేసుకున్న టవల్ కూడా భారంగానే ఉంటుంది. పెద్ద పెద్ద బండ రాళ్ళ పైనుంచి లోయలోకి దిగడమే ప్రయాస. అన్ని తీర్థాల్లోకి శేషతీర్థం కష్టతరం. శేషతీర్థంలో కూడా ఈ లోయలో బండరాళ్ళ పైనుంచి దిగడం మహాకష్టం.
దట్టంగా పెరిగిన చెట్లమధ్య నుంచి లోయలోకి దిగితే, పెద్ద అందాలేమీ ఉండవు. ఇరువైపులా కొండలు, మధ్యలో పెద్ద పెద్ద బండరాళ్ళు. వాటి మధ్య మొలిచిన అడివి మామిడి మహావృక్షం. రాళ్ళకింద నుంచే శేషతీర్థం నీళ్ళు తూర్పుకు సాగుతుంటాయి. పడమరగా చిన్న కొండెక్కి, దాని అంచునే అతి కష్టంపైన ముందుకు దిగాలి. కొండ అంచున నడక ఎంత ప్రమాదరకరమో! ఏ మాత్రం పట్టు తప్పి జారినా లోయలోకి పడిపోవడమే!
లోయలోకి దిగాక ఇరువైపులా ఎత్తైన కొండలు. ఆ కొండల మధ్య చీలికలో అనేక నీటి గుండాలు. నీటి గుండంలోని బండ రాళ్ళ పైనుంచి ఎదురుగా వస్తున్న ప్రవాహంలో ఈదుకుంటూ ముందుకు సాగాలి. ముందుకు వెళ్ళిన కొద్దీ కొండలో ఎన్ని మెలికలో! ఆ మెలికలు తిరిగి పడుకున్న పాములా ఉంది. ఆ నీటి ప్రవాహం మధ్యలో ఒక పెద్ద బండరాయి అడ్డంగా పడి ఉంది. ఆ బండరాయిని ఎక్కి ఆవలి వైపుకు దిగాలి. పట్టు దొరకడం లేదు. ఒకరి సాయంతో మరొకరు ఆ బండరాయి ఎక్కి దిగాలి. తలెత్తితే చాలు కనువిందు చేసే ప్రకృతి అభిషేకాలు ఈ ప్రకృతి రూపాలు. సుడులు తిరిగిన నీటి ఉదృతికి ఎత్తైన కొండ కూడా ఎన్ని అందమైన రూపాలను సంతరించుకుందో! కొండ అంచులు లేత గులాబీ రంగులో ఉన్నాయి.
విఠలాచార్య సినిమాలో సెట్టింగ్‌లా..
ఆ నీటి వాలులో పడుతూ లేస్తూ, నడుస్తూ, ఈదుకుంటూ, ఆ అందాలను ఆస్వాదిస్తూ, ఎట్టకేలకు గుండానికి సమీపిస్తాం. పై నుంచి పడుతున్న నీటి వైపు నడుస్తుంటే పాకుడు. జాగ్రత్తగా అడుగులువేస్తూ, ఆ రాతి నేలపైనుంచి కాస్త పైకి ఎక్కాలి. ఎదురుగా నీటి ధార దుముకుతోంది. దాని పక్క నుంచి జాగ్రత్తగా ఎక్కితే కొండ అంచులకు సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక ద్వారం లాంటి కొండ రూపం. ఆ ద్వారం వద్ద గుండం నుంచి పొంగిపొర్లుతున్న జలధార. ఏదో విఠలాచార్య జానపద సినిమాలో సెట్టింగ్‌లా ఉంది.
కాస్త ఎత్తైన రాయి ఎక్కితే ఎదురుగుండా నీటి గుండం. నీటి గుండాన్ని చుట్టూ అన్ని వైపులా కమ్మేసిన కొండ. ఎదురుగా కొండ అంచు నుంచి పడుతున్న జలధార. ఆ చీలికలోంచే కనిపిస్తున్న వెలుతురు. నిట్ట మధ్యాహ్నమైతే తప్ప, ఆ చీలిక నుంచి సూర్యుడు శేష తీర్థం అందాలను తొంగి చూడడు. నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో! ఎంత లోతుందీ నీటి గుండం! ఈదుకుంటూ, ఈదుకుంటూ జలధార వద్దకు వెళ్ళచ్చు. పై నుంచి పడుతున్న జలధార కింద ఉబ్బితబ్బిబ్బై పోతాం. జలధార కింద పట్టు దొరకదు. కొండ అంచుకు వెళితే ఒకరిద్దరు నిలుచోడానికి పట్టుంటుంది.
అంతటా ప్రకృతి వైచిత్ర్యమే..
నీటి గుండం కింద ఈదుతుంటే బైటికి రాబుద్ది కాదు. ఏ తీర్థంలోనూ లేని అందం దీని సొంతం. ఏ తీర్థం లోనూ పొందలేని ఆనందం ఇక్కడే సాధ్యం. నీటిపై వెల్లకిలా పడుకుని ఈదితే ఈ శేషతీర్థాన్ని కప్పేసినట్టున్న కొండ అందాలను ఆస్వాదించవచ్చు. ఏమిటీ వైచిత్రి! శేషతీర్థమంతా ఆదిశేషుని తలపిస్తుంది. జలధారతో నిండిన దారంతా ఆదిశేషుని తోకలా మెలికలు తిరిగి ఉంటుంది. నీటి గుండం, దాని చుట్టూ కప్పి ఉన్న కొండ ఆదిశేషుని పడగలా ఉంటుంది. అందుకే దీనికి శేషతీర్థం అన్న పేరు వచ్చింది. శేషతీర్థం వెళ్ళి రావడం సాహసమే. ఈత వచ్చి ఉండాలి. శ్రమకు ఓర్చుకోగాగాలి. ప్రకృతిని ఆస్వాదించే హృదయం ఉండాలి. ఇక ఆలస్యమెందుకు వచ్చే పౌర్ణానికి శేషతీర్థానికి బయలుదేరుదాం రండి.
(మే 5 పౌర్ణమికి తిరుమలలో శేష తీర్ధ ఉత్సవం)
- రాఘవశర్మ,