వృద్ధులకు రెడ్ సిగ్నల్

by Ravi |   ( Updated:2022-12-17 02:25:25.0  )
వృద్ధులకు రెడ్ సిగ్నల్
X

కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటన వృద్ధులను తీవ్రంగా కలచివేసింది. సీనియర్ సిటిజన్స్ రాయితీలను కొనసాగించలేమని పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో సకల జనులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చౌకగా లభించే సౌకర్యం చేజారటం నివ్వెర పరచింది. సమాజంలోని రకరకాల వర్గాలకు ఎన్నెన్నో మార్గాలలో రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వం, జనులందరికీ ఉపయుక్తంగా ఉన్న రాయితీని నిలిపివేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో 58 యేండ్లు నిండిన మహిళలకు 50 శాతం, 60 యేండ్లు నిండిన పురుషులకు 40 శాతం రాయితీ ఇచ్చేవారు. ఈ సౌకర్యం ఎన్నో యేండ్ల నుంచి అమలవుతోంది. కరోనా పుణ్యమాని నిలిపివేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నా రాయితీల పునరుద్ధరణ జరగలేదు.

ఈ రాయితీలు ప్రభుత్వానికి ఎంతో భారమవుతున్నాయని మన రైల్వే మంత్రి సెలవిచ్చారు. ప్రయాణికుల సేవల కోసం ప్రభుత్వం గత ఏడాది రూ. 59 వేల కోట్లు రాయితీ ఇచ్చిందని కేంద్రం చెబుతోంది. అదే సమయంలో ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు సమకూరుస్తున్నట్లు రైల్వే శాఖ వివరిస్తోంది. రాయితీల అంశం ప్రయాణికుల సదుపాయాలలోకి రాకపోవడం శోచనీయం. కోట్లాది రూపాయలు వెచ్చించి తీసుకొచ్చే ఉచిత పథకాల కన్నా ప్రజా బాహుళ్యాన్ని ఆకట్టుకునే, ఆదరించే రాయితీ కల్పన మేలు. రైల్వే రాయితీలు భారమవుతున్నాయంటున్న పాలకులు కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలకు దేశ సంపదను అప్పనంగా కట్టబెట్టటం లేదా? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.

సామాన్యుల కోసం గరీబ్ రథ్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఏసీ బోగీలలో ప్రయాణిస్తూ చౌకగా గమ్యాలను చేరుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ తరహాలో వృద్ధులకు రాయితీలిచ్చే సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవలే వందే భారత్ రైళ్లను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రధాన మార్గాలలో ప్రవేశ పెట్టారు. ఖరీదైన ప్రయాణం కావడంతో సాధారణ జనానికి అవి అందుబాటులో ఉండటం కద్దు. రోజూ నడిచే వందలాది రైళ్లలో లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు ఉంటారు. వారంతా రాయితీల కోసం ఎదురుచూస్తున్నారు. ఏతావాతా పలువురికి ఉపకరించే సీనియర్ సిటిజన్స్ రాయితీల పునరుద్ధరణపై కేంద్రం పెద్ద మనసుతో వ్యవహరించాలని, వారి అనుభూతులను పరిగణించాలని సకల జనుల ఆకాంక్ష.


చెన్నుపాటి రామారావు

విజయవాడ

9959021483

Also Read...

ఓఆర్ఎస్ సృష్టికర్త ఎవరో తెలుసా?

Advertisement

Next Story