సీపీఎస్ రద్దుకు ఉద్యోగుల సమరం!

by Ravi |   ( Updated:2023-05-24 23:46:21.0  )
సీపీఎస్ రద్దుకు ఉద్యోగుల సమరం!
X

మధ్య దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉన్న ప్రధాన డిమాండ్ సీపీఎస్ రద్దు. ఈ అంశం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకొని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం చూపి ఆయా రాష్ట్రాలలో సీపీఎస్ రద్దుకై హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలు విజయం సాధించాయి. గత వారంలో కర్ణాటక ఎన్నికల్లో సైతం సీపీఎస్ రద్దుని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్‌డీఏ ప్రభుత్వం 2001-02 బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం ఇచ్చే పెన్షన్‌లో మార్పులు చేయడానికి బి.కె భట్టాచార్య నేతృత్వంలో కమిటిని ఏర్పాటు చేసి వారి ప్రతిపాదనల ప్రకారం 01.01.2004 తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిని రాష్ట్రాలు అవసరమైతే అమలుపరచుకోవచ్చని తెలిపింది.

రాజకీయంగా నష్టమని భావించి

అయితే సీపీఎస్‌ను రాష్ట్రాలు పోటీ పడి మరీ అమల్లోకి తీసుకొచ్చాయి. దీని ప్రారంభంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పట్టించుకోలేదు. ఎప్పుడైతే సీపీఎస్ రద్దు ప్రధాన ఎజెండాగా సీపీఎస్ సంఘాలు ఆవిర్భవించాయో అప్పటినుంచి సీపీఎస్ రద్దు ప్రధాన అంశంగా విస్తృతంగా ఉద్యోగుల్లోకి చేరిపోయింది. అప్పుడే ప్రధాన సంఘాలు కూడా సీపీఎస్ రద్దుని ప్రధాన డిమాండ్‌గా పెట్టడం ప్రారంభించాయి. దీంతో కోల్పోయిన గ్రాట్యూటీ, ఫ్యామిలి పెన్షన్ నైనా సాధించగలిగారు. నిజానికి ఈ సీపీఎస్ పెన్షన్ వల్ల ఉద్యోగికి ఎంత పెన్షన్ వస్తుందనే అంశంపై స్పష్టత లేదు. ఎంత పెన్షన్ అనేది అప్పటి మార్కెట్ నిర్ణయిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి నెలనెలా పెన్షన్ మారుతూ వృద్ధ్యాప్యంలో వారి ఆర్థిక భద్రతను గాలిలో దీపంగా మార్చుతుంది. దీనిని బట్టే ఈ విధానం మార్కెట్ శక్తుల నుంచి పుట్టిన నయా ఉదారవాద విషవృక్షమని అర్థం అవుతుంది. అయితే ఇప్పటివరకు సీపీఎస్ అమలుచేయని ఏకైక రాష్ట్రం పశ్చిమబెంగాల్. దేశంలోని అన్ని రాష్ట్రాలు సీపీఎస్‌ని అమలు చేసినప్పటికి, ఈ మధ్య కాలంలో సీపీఎస్‌పై ఉద్యోగులు వ్యతిరేకత చూపడంతో చాలా రాష్ట్రాలు ఓపీఎస్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇందులో చత్తీస్‌ఘడ్, తరువాత రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ప్రస్తుతం కర్ణాటక ఇలా ఒకటి తరువాత మరొక రాష్ట్రం సీపీఎస్ రద్దు పల్లవి అందుకొని ఓపీఎస్ వైపు వెళ్తున్నాయి. ఇక తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో సీపీఎస్ రద్దు అంశం ప్రస్తుతం ప్రయత్నంలో ఉంది.

అయితే దేశవ్యాప్తంగా సీపీఎస్ రద్దుపై ఉద్యమం ఉధృతం కావడంతో, రాజకీయంగా నష్టం జరుగుతుందని కేంద్రం కంటితుడుపు చర్యలు ప్రారంభించింది. కేంద్రం సీపీఎస్‌ను మెరుగుపరిచే అంశాన్ని పరిశీలించుటకు కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని వేసింది. అయితే ఈ కమిటీ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆడుతున్న నాటకమని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్ వైపు వెళ్తుంటే పీఎఫ్ఆర్‌డిఏ చట్టం ఒప్పుకోదని సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఇక దేశంలోని ఉద్యోగులందరూ సీపీఎస్ ను రద్దుచేయమని కోరుతుంటే కేంద్రం సీపీఎస్ ను మెరుగుపరిచే అంశంపై కమిటీ వేయడం అంటే సీపీఎస్ పై కేంద్ర వైఖరి ఎలాంటిదో ఉద్యోగ, ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి.

ఆ పార్టీలకే ఉద్యోగులు మద్దతివ్వాలి!

ఇక మన ఉమ్మడి రాష్ట్రంలో ఈ సీపీఎస్ విధానాన్ని 2004 సెప్టెంబర్ 1నుండి అమలుపరిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఈ రాష్ట్రానికి ఓపీఎస్‌ను అమలుచేసే అధికారం ఉన్నా తెలంగాణ ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కొనసాగించడానికి ఒప్పుకుంది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో సీపీఎస్‌‌ని రద్దుచేస్తామని కానీ, కనీసం ఆలోచిస్తామని కానీ ఏ పార్టీ ప్రకటించలేదు. కేవలం కాంగ్రెస్ మాత్రమే దీనిని రద్దు చేయడానికి కృషి చేస్తామని ప్రకటించింది. మన రాష్ట్రంలో ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. అందుకే ఇదే సరైన సమయం. సీపీఎస్ సంఘాలు ఉద్యమాన్ని సీపీఎస్ రద్దు అంశాన్ని ఉధృతం చేయాలి. ఏ పార్టీ అయితే సీపీఎస్ రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి హామీ ఇస్తుందో ఆ పార్టీలకే ఉద్యోగుల ఓట్లు అని తీర్మానాలు చేయాలి. అప్పుడైతేనే ప్రధాన సంఘాలు కూడా సీపీఎస్ రద్దు గూర్చి ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తాయి. ఈ ఆరు నెలల్లో దశాల వారీగా అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమ నిర్మాణాన్ని రూపొందించుకోవాలి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికలను ఉదాహరణగా చూపిస్తూ ప్రచారం చేయాలి. ఈ సమయం దాటితే మరో ఐదు సంవత్సరాలు సీపీఎస్ రద్దు డిమాండ్‌ని ఎవరు పట్టించుకోరు. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కేవలం బిక్షకాదు జీవితకాలం పనిచేసినందుకు ఉద్యోగి పొందే హక్కు. సామాజిక భద్రత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వాలు 30 సంవత్సరాలకు పైగా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగికి భద్రత కల్పించలేదా? ఇక సీపీఎస్ ను రద్దుచేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా ప్రయోజనమే. సీపీఎస్ రద్దుతో వేల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ రూపంలో ఖాజానాలో జమఅయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ అయిన సీపీఎస్ ని రద్దు చేసి, ఓపిఎస్ పునరుద్ధరణ చేపట్టి తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమనే మాటను నిలుపుకోవాలి.

జుర్రు నారాయణ యాదవ్

తెలంగాణ టీచర్స్ యూనియన్

94940 19270

Advertisement

Next Story

Most Viewed