సంస్కృతి, సంప్రదాయాల కలయిక

by Ravi |   ( Updated:2025-01-14 01:16:10.0  )
సంస్కృతి, సంప్రదాయాల కలయిక
X

హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండి వంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి?

భోగి మంటలు.. వ్యామోహానికి నిప్పు

మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రి వ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగి మంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూల తోట మీదుగా గాలి వెళితే అది సుగంధ భరితం అవుతుంది. అదే గాలి ఒక మురికి కాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంట్” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతో పాటు వదిలేయి.

భోగిపండ్లు… యోగిత్వం.. బదరీఫలం

సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాది నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (ఫైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగు పండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది.

గాలిపటం… దారంలాంటిది జీవితం

ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడులాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.

కోడిపందేలు.. యుద్ధనీతిని గెలిపించే పందెం

పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడి పందేలకు తరాల చరిత్ర ఉంది. కానీ ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారి తీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది. యుద్ధనీతిని తెలియజేసింది.

కొత్త బియ్యంతో పిండి వంటలు..

సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో పిండి వంటలు చేసుకోవడంలో అర్థం, పరమార్థం రెండూ ఉంటాయి. సంక్రాంతి నాటికి పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో గేదెలే కాదు, రైతుల మనసులు కూడా నిండుగా ఉంటాయి. కానీ.. కొత్తబియ్యంతో ఎవరూ అన్నం వండరు. అప్పుడే పండించిన బియ్యంతో వండిన అన్నం తింటే అజీర్ణం చేస్తుంది. అందుకే.. వాటిని నానబెట్టి, పిండి ఆడించి బెల్లం పాకం పట్టి అరిసెలు వండుతారు. అలాగే పాలు పొంగించి, కొత్తబియ్యంతో పరమాన్నాన్నీ వండుకుంటారు. ఇలా కొత్త బియ్యంతో తయారు చేసిన వంటకాలు తినడం వల్ల అజీర్ణం కూడా చేయదు. అలాగే.. కొత్త బియ్యంతో వండిన పిండివంటలను భగవంతుడికి నైవేద్యంగా అర్పించడం వల్ల, పంట సక్రమంగా చేతికి అందినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటారు రైతులు. సంక్రాంతి పర్వదినం రోజునే..

సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ

రంగోలి అంటే ముగ్గులు వేయడం. కలర్ ఫుల్‌గా ముగ్గులు వేయడం అనేది కూడా ఓ మంచి కళ. ఇంటి ముంగిళ్లలో వివిధ రకాలుగా ముగ్గులు వేస్తారు. చుక్కలు పెట్టి, చక్కలు పెట్టకుండా..డ్రాయింగ్‌లా, గీతలు గీయడం ఇలా పలు రకాలు ఉన్నాయి. ముగ్గులు పెట్టాలంటే క్రియశీలకమైన సజనాత్మకత కలిగి ఉండాలి. రంగోలిని బియ్యం పిండితో వేస్తారు. సంక్రాంతి అనగానే ముందుగా మనకి గుర్తు వచ్చేవి ముగ్గులు. రంగుల హరివిల్లు ముత్యాల ముగ్గులు..రత్నాల గొబ్బెమ్మలు..మహిళల కళాదృష్టికి చిహ్నంగా ముంగిళ్ల ముగ్గులు పెడతారు. ధనుర్మాసం నెల పెట్టింది మొదలు సంక్రాంతి పండుగ దాకా ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో కళకళలాడుతాయి. సంక్రాంతి పండుగ రోజున ఆడపిల్లలు ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిళ్లను తీర్చి దిద్ది, వివిధ రకాల పువ్వుల తోటి గొబ్బెమ్మలను అందంగా, ఆకర్షణీయంగా అలంకరిస్తారు.

కొనిండ్ల మోహన్

జర్నలిస్ట్

90527 11868

Advertisement

Next Story

Most Viewed