భూముల అమ్మకం.. ప్రభుత్వ సమర్థతా? అసమర్థతా?

by Viswanth |   ( Updated:2023-08-10 00:30:27.0  )
భూముల అమ్మకం.. ప్రభుత్వ సమర్థతా? అసమర్థతా?
X

తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను, ఆస్తులను హారతి కర్పూరంలా ఖర్చుచేస్తే వారిని సమాజం అసమర్ధులుగానే వేలెత్తి చూపుతుంది. ఇప్పుడు ప్రభుత్వం విషయంలోనూ అదే అభిప్రాయం నెలకొన్నది. కస్టోడియన్‌గా భూములను రక్షించాల్సిన ప్రభుత్వం అమ్మేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటేటా ఇలా అమ్మేస్తూ ఉంటే భవిష్యత్ అవసరాలకు ఏం మిగులుతుందనేదే అందరి అనుమానం. సంపదను సృష్టించడానికి ఉపయోగపడితే ఇబ్బంది ఉండేది కాదు. కానీ రాష్ట్రానికి సంపదగా ఉన్న భూముల్ని హారతి కర్పూరంలా కరిగించేయడమే ఈ విమర్శలకు కారణం.

సర్కారు తన భూముల్ని అమ్ముకోవడం చట్టబద్ధతా కాదా? అనేది వేరే చర్చ. ఆ అధికారం ఉన్నదా లేదా అనేది కూడా వేరే విషయం. ప్రజలకు ఉపయోగపడే స్కూళ్ళు, కాలేజీలు, ఆస్పత్రులు, కమ్యూనిటీ హాళ్లు, ప్రాజెక్టులు తదితరాలకు ప్రభుత్వ భూముల్ని వినియోగిస్తే అభ్యంతరం ఉండేది కాదు. కానీ ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అప్పజెప్పడమే మింగుడు పడడం లేదు. ఆదాయం ఆర్జించడానికి, తనకు అనుకూలంగా ఉన్నవారికి కట్టబెట్టడానికి ఉద్దేశపూర్వకంగా అమ్ముతూ ఉన్నదనేది సర్వత్రా వినిపిస్తున్న చర్చ. కరోనా కాలం నుంచి మొదలైన ఈ ప్రక్రియ ఇప్పుడు ఏకైక ఆదాయ వనరుగా మారింది.

ప్రజా ప్రయోజనం తూచ్..

నిర్దిష్ట అవసరాలకు వాడడం లేదనో, నిరుపయోగంగా ఉన్నాయనే పేరుతోనో వేలాది ఎకరాల భూముల్ని విక్రయించడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నది. రెండో టర్ములో రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ తదితర సంస్థలు విచ్చలవిడిగా ప్లాట్లు, ఫ్లాట్‌లను విక్రయిస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊహకు అందని తీరులో పెరిగిపోయింది. ప్రభుత్వమే ఈ రంగంలో ఉద్దేశపూర్వకంగానే ‘బూమ్’ను సృష్టించింది. ప్రభుత్వమంటే వ్యాపార సంస్థ కాదంటూ కరోనా సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆచరణ దీనికి భిన్నంగా సాగుతున్నది.

ప్రభుత్వ భూముల్ని కొంటున్నదీ, లీజుకు తీసుకుంటున్నదీ ఎక్కువగా అధికార పార్టీకి చెందినవారు. లేదా ఆ పార్టీతో అంటకాగుతున్న వ్యక్తులు, సంస్థలు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే పది తరాలకు సరిపోయేంతగా సంపాదించుకుంటున్నారు అనే సాధారణ అభిప్రాయం జనంలో ఏర్పడింది. భూములతోనే సంపన్నులవుతున్నారనేది నిర్వివాదాంశం. వివాదాస్పద భూములను సెటిల్‌మెంట్లు చేయడం, ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేయడం, అసైన్డ్ లాండ్స్ లబ్ధిదారులను ప్రలోభపెట్టి తక్కువ ధరకు కొనేసుకోవడం లాంటివి వారు అనుసరిస్తున్న విధానాలు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై స్వయానా ఆయన కూతురు ఈ ఆరోపణలే చేశారు.

అన్ని ప్రభుత్వాల తీరూ అంతే..

ప్రభుత్వ భూముల అమ్మకం కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ, రైల్వే సంస్థల తీరూ అలాగే ఉన్నది. ఆర్థిక వనరుల సమీకరణ కోసం దీర్ఘకాలం లీజుకు ఇస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయి. వాటిలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతున్నాయి. ఇందుకోసం కేంద్రంలో ఏకంగా ఒక మంత్రిత్వశాఖే ఏర్పడింది. ఒక ప్రభుత్వాన్ని మరొకటి వేలెత్తి చూపుకుంటున్నాయి. ముద్దుగా ఆ ప్రక్రియకు ‘మానిటైజేషన్’ అనే పేరు పెట్టాయి.

రైల్వే బోర్డు ఏకంగా రైల్ లాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ అనే వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నది. ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న రైల్వే భూములను వాణిజ్యపరమైన అవసరాలకు లీజుకు ఇస్తున్నది. ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో నిర్దిష్ట పాలసీనే రూపొందించుకున్నది. తెలంగాణ ప్రభుత్వం సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. హైదరాబాద్ నగరంలో అనేక స్థలాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు అప్పజెప్పింది. వాటి నుంచి ప్రభుత్వానికి క్రమం తప్పకుండా చెల్లింపులు జరగాలి. కానీ హైదరాబాద్ నగరంలో స్థలాన్ని లీజుకు తీసుకున్న ప్రైవేటు సంస్థలు కొన్నేండ్లుగా చెల్లించకపోవడంతో కోట్లాది రూపాయలను బకాయిలు పడ్డాయి.

అమ్మేది కోట్లలో.. సేకరణ లక్షల్లో ..

తెలంగాణ ఒక్క ఎకరం భూమి ఉన్న రైతు కోటీశ్వరుడు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పే మాట. అదే నిజమైతే సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పేరుతో రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు చెల్లించింది ఎంత? కేవలం లక్షల్లోనే. ఒక్కో ఎకరం వంద కోట్ల ధర పలుకుతున్నదని, ఇది ప్రభుత్వ పరపతికి నిదర్శనమంటూ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు కేటీఆర్ అసెంబ్లీ వేదికగా ఒకింత గర్వంగా ప్రకటించుకున్నారు. కోకాపేటలోని ఈ భూములకు దగ్గర్లోని ముచ్చెర్ల ఫార్మా సిటీలో భూ సేకరణకు ప్రభుత్వం రైతులకు చెల్లించింది ఎంత? ఇది తెలిస్తే ఈ ఆర్టిఫిషియల్ రియల్ బూమ్ ఎవరి కోసమో.. ఎందుకోసమో తేలిపోతుంది.

ప్రభుత్వం కేవలం తన అధీనంలో ఉన్న భూములనే కాక గత ప్రభుత్వాలు దళితులకు, పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా రకరకాల పేర్లతో స్వాధీనం చేసుకున్నది. కొన్ని చోట్ల వివాదాలను సృష్టించి అప్పటివరకూ అనుభవిస్తున్నవారే బలవంతంగా అమ్ముకునేలా అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారు. మరికొన్ని చోట్ల లోకల్ లీడర్ల దౌర్జన్యాలను తట్టుకోలేక ఆ భూములను వదిలి మరో చోటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నిజాం కాలం నాటి భూస్వాములు, పెత్తందారీతనం ఇప్పటి తెలంగాణలో సరికొత్త రూపం తీసుకున్నది. పెద్దమొత్తంలో భూమి కార్పొరేట్ సంస్థల చేతుల్లో కేంద్రీకృతమైంది. పేదలకు సొంత భూమి, సొంతిల్లు అందని ద్రాక్షగా మారింది.

డబుల్ ఇండ్లకు జాగ లేదు..

దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని తూతూ మంత్రంగా అమలుచేసి అటకెక్కించింది. ఇందుకు ప్రభుత్వం చెప్పిన కారణం.. ప్రభుత్వం దగ్గర జాగ లేదని, ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనడానికి ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తున్నదని పేర్కొన్నది. మరోవైపు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికీ ప్రభుత్వం ఇదే కారణాన్ని చెప్తున్నది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే.. చందంగా పేదల సంక్షేమ పథకాలకు ప్రభుత్వానికి అందుబాటులోకి రాని భూమి రియల్ వ్యాపారం కోసం మాత్రం పుష్కలంగా దొరుకుతున్నది. ఎవరి అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.

ఆదాయం కోసం వ్యాపారం..

అధికారంలోకి రావడానికి అనేక వాగ్ధానాలను ఇచ్చిన కేసీఆర్ వాటి అమలుకు పైసల్లేక తిప్పలు పడుతున్నారు. సంక్షేమ పథకాలతో తెలంగాణ ఆదర్శం అని గొప్పగా చెప్పుకుంటున్నా అదే ఇప్పుడు ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఆదాయానికి మించి వెల్ఫేర్ స్కీమ్‌లకు ఖర్చు చేయడం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అమలు చేయకుంటే ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం పోతుంది. అమలు చేయాలంటే ఏదో ఒక రూపంలో నిధులు సమకూర్చుకోవాలి. పన్నులు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అసలుకే ఎసరు పడుతుంది. అందుకే భూముల్ని అమ్మేయడాన్ని భేషైన మార్గంగా ఎంచుకున్నది. ఒకవైపు అప్పులు.. మరోవైపు భూముల పందేరం.. చివరకు సర్కారు తీరు అప్పుచేసి పప్పుకూడు తరహాలో ఉన్నది.

ఎన్. విశ్వనాథ్

99714 82403

Advertisement

Next Story