రైతుబంధు లో మార్పు రావాలి

by Ravi |   ( Updated:2022-09-03 14:47:58.0  )
రైతుబంధు లో మార్పు రావాలి
X

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో వ్యవసాయ రంగం కోసం దాదాపు 700 పథకాలు అమలులో ఉన్నాయి. అందులో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం 20వ స్థానంలో ఉన్నదని ఐక్యరాజ్యసమితి ఎఫ్‌ఏ‌ఓ డైరెక్టర్ జనరల్ జోష్ గ్రాసినో డేసిల్వా పేర్కొన్నారు. సగటు మనిషి నుంచి ఐక్యరాజ్య సమితి వరకు ప్రశంసలు పొందిన మొట్టమొదటి పథకం రైతుబంధు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు 10 మే 2018 నుంచి పెట్టుబడి సాయం అందజేస్తున్నది. మొదట రెండు దశలలో ఎనిమిది వేల రూపాయలుగా ఉన్న ఈ ఆర్థిక సాయాన్ని తరువాత పది వేల రూపాయలకు పెంచింది. దీనిని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలోనే జమ చేస్తున్నది.

సాగుచేయని భూమికి

తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 2 కోట్ల 40 లక్షల ఎకరాలు. ఇందులో వ్యవసాయ భూమి సుమారు 1 కోటి 53 లక్షల ఎకరాలు. ఈ ఏడాది వానాకాలం సీజన్ కింద రాష్ట్ర ప్రభుత్వం 68,94,486 మంది రైతులకు 7,654.43 కోట్ల రూపాయలను రైతుబంధు కింద పంపిణీ చేస్తున్నది. ఇప్పటివరకు తొమ్మిది దఫాలుగా పంపిణీ చేసింది. ఇందుకుగాను 57,956 కోట్లు విడుదల చేసింది. అంటే, ఈ పథకానికి ఏడాదిలో దాదాపు రూ. 15,000 కోట్లు కేటాయిస్తున్నది.

గత యాసంగి సీజన్‌లో 7,142 కోట్ల రూపాయలు 1 కోటి 49 లక్షల ఎకరాలకు రైతుబంధు కింద పంపిణీ చేసింది. నిజానికి ఇంత భూమిలో సగం మాత్రమే యాసంగిలో సాగు చేస్తారు. సాగు చేయని భూమికి కూడా రైతుబంధు అందుతున్నది. అంటే, సుమారు 3,750 కోట్ల రూపాయలు ప్రతి యాసంగి సీజన్‌లో సర్కారు కోల్పోతున్నది. ఖరీఫ్‌లోనూ దాదాపు 1 కోటి 30 లక్షల ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. కానీ, దాదాపు 23 లక్షల ఎకరాల సాగు చేయని భూమికి 1,150 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. పట్టణ, నగరవాసులు లక్షల ఎకరాలను కొనుగోలు చేశారు. అందులో కొందరు ఫాంహౌస్ పేరుతో చుట్టూ కాంపౌండ్ పెట్టుకొని అందులో పంటలు పండించకుండా రైతుబంధు తీసుకుంటున్నారు. కొందరు బంజరు భూములకు కూడా సాయం తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్ల రూపంలో అమ్మిన భూములకూ రైతుబంధు పొందుతున్నారు. ఇలాంటివారిలో పెద్ద పెద్ద వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులూ ఉన్నారు.

వాస్తవ సాగుదారుడికి చేరేలా

ప్రభుత్వం రైతుల పట్ల ప్రేమతో పెట్టుబడి సాయం కింద అందిస్తున్నప్పటికీ నిధులు నిజంగా వారికి ఉపయోగపడేది తక్కువే. అందుకే, ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్‌ను నియమించి, పండించిన పంటను వారి ద్వారా సర్వే చేయించి రైతుబంధు సాయం ఇవ్వాలి. పదెకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే అందేలా చూడాలి. నిజానికి కేసీఆర్ 14-09-2020 నాడు అసెంబ్లీలో చెప్పిన లెక్కల ప్రకారం ఐదెకరాల నుంచి పదెకరాల లోపు విస్తీర్ణం 30,94,854.59 ఎకరాలు. పట్టాదారుల సంఖ్య 4,65,298. పదెకరాల నుంచి ఇరవై ఎకరాల లోపు ఉన్న విస్తీర్ణం 11,09,304.63 ఎకరాలు. పట్టాదారుల సంఖ్య 84,606. ఇరవై ఎకరాల పైన ఉన్న విస్తీర్ణం 3,87,864.26. పట్టాదారుల సంఖ్య 14,046. దీని ప్రకారం ఐదెకరాల లోపు ఉన్న పట్టాదారులకు రైతుబంధు ఇస్తే సుమారు 2,300 కోట్ల రూపాయలు మిగులుతాయి. పది ఎకరాలలోపు వారికైతే 750 కోట్ల రూపాయలు మిగులుతాయి.

యాసంగి, ఖరీఫ్ సీజన్ ఆధారంగా అయితే నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి. కావున ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి. ఈ పథకం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నయా భూస్వాములకు రాష్ట్ర ఖజానాను దోచి పెట్టే విధంగా మారిందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో తగిన నిర్ణయం తీసుకుంటే మంచిది. లేదా ఇవే నిధులను పండించిన పంటకు బోనస్ రూపంలో ఇచ్చినా నిజమైన వ్యవసాయదారులకు ఎంతో మేలు జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఈ సాయం అందించేలా ప్రణాళిక రూపొందించాలి.

పులి రాజు

సామాజిక కార్యకర్త

99083 83567

Advertisement

Next Story