ప్రజాప్రతినిధులు.. అసెంబ్లీలో గౌరవంగా వ్యవహరించాలి!

by Ravi |   ( Updated:2025-03-14 00:31:07.0  )
ప్రజాప్రతినిధులు.. అసెంబ్లీలో గౌరవంగా వ్యవహరించాలి!
X

రాష్ట్ర ప్రజల కోసం, వారి అవసరాల కోసం చట్టాలు తయారు చేసే దేవాలయంలో నాయకులు చేసే పంచాయతీ శాసనసభకు మాయని మచ్చగా మిగిలిపోతుంది. ప్రజలకు మంచి చేయా ల్సిన సభలో అనవసరమైన రాద్ధాంతాలు చేయడం ఎంత వరకు సబబు? ప్రజల గొంతుకను వినిపించడానికి మిమ్మల్ని నాయకులుగా ఎన్నుకుంటే మీరేమో.. సభలో అనవసర చర్చ జరిపి వాకవుట్ చేస్తున్నారు. సభలో ఏ చర్చలు జరిగినా, చర్చలను తప్పుదారి పట్టిస్తున్నారు.. ప్రజల విలువైన ఆలోచనలను తప్పుదారి పట్టిస్తున్నారు.. మరి మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు జవాబుదారీ ఎవరు?

రాష్ట్రంలో జరిగే మంచి కార్యక్రమాలకు తోడ్పాటు అందించడం, విలువైన సూచనలు సలహాలు అందించి, తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చి సాధించుకోవడం నిజమైన నాయకుడి లక్షణం. కానీ అసెంబ్లీలో ఎక్కడ కూడా ప్రజా ప్రతినిధులు సమయానికి, సమస్యలకు విలువ ఇవ్వకపోవడం శోచనీయం. అనుభవం ఉన్న నాయకులూ సభను మార్చలేకపోతున్నారు. నాయకులకు కావలసింది సమయాన్ని వృధా చేయడమా? ప్రజల సమస్యలను పరిష్కరించడమా? ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒక రూపంలో సభను వాయిదా వేస్తున్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు అయితే ఈ సమావేశాల్లో కూడా పాల్గొనడం లేదు.. వారి నియోజకవర్గంలో సమస్యలు లేవా? లేదా అవి వారు పట్టించుకోనవసరం లేదా? ప్రజల దేవాలయంలా చూసే శాసన సభలో ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతగా మెలగాలి, ప్రతి ఒక్క సభ్యునికి గౌరవం ఇవ్వాలి. గౌరవమైన సంబోధన ఉండాలి. ఒక ప్రతినిధి మరో ప్రతినిధిని దూషించడం తప్పు. వ్యక్తిగత ద్వేషాలు ఉంటే శాసనసభ బయట దూషించుకోవాలి. మిమ్మల్ని నమ్మి ఓటు వేసి గెలిపించి శాసనసభకు పంపిస్తే, మీరు ప్రజల కోసం చేయాల్సిన కర్తవ్యాన్ని స్వచ్ఛమైన మనస్సుతో నిర్వర్తించండి.

డాక్టర్ వై. సంజీవ కుమార్

93936 13555



Next Story

Most Viewed