- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహాత్మా గాంధీ ప్రాణ రక్షకుడు.. అయినా అన్యాయమే!
అహింసనే ఆయుధంగా చేసుకొని, ఆంగ్లేయులతో పోరాడిన సాధు శీలి మహాత్మా గాంధీ. ఆ అహింసావాదిని 1948 జనవరి 30న ఆరెస్సెస్ కార్యకర్త నాథూరాం గాడ్సే అతి కిరాతకంగా చంపేశాడు. కానీ ఆ ఘటనకు మూడు దశాబ్దాల క్రితమే బాపూ ప్రాణాలు రక్షించిన మనిషి ఎవరో బహుశా చాలా మందికి తెలియదు. ఆయనే ‘బతఖ్ మియా అన్సారీ’.
దేశానికి బాపూజీ నాయకత్వం లభించిందీ అంటే దానికి కారణం బతఖ్ మియా అన్సారీనే. అవును..ఆయన ఒక సాధారణ వంట మనిషి. అది కూడా ఇంగ్లీషు వాడి పని మనిషి. అన్సారీది బీహార్ రాష్ట్రంలోని మోతీహార్ అనే గ్రామం. ఇమ్రా ఖాతూన్ , మొహమ్మద్ అలీ మియా అన్సారీ తల్లిదండ్రులు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆంగ్ల అధికారి ఇర్విన్ దగ్గర వంట మనిషిగా చేరారు. అది భారతదేశంలో స్వాతంత్రోద్యమం చిగుర్లు తొడుగుతున్న తొలినాళ్ళ మాట. దక్షిణాఫ్రికా వెళ్ళిన గాంధీజీ ఆకాలంలోనే భారతదేశానికి తిరిగొచ్చారు. అప్పటి ప్రధాన రాజకీయ నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి భారతదేశ రాజకీయాలు, ఇక్కడి పరిస్థితులను పరిచయం చేశారు. ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గాంధీజీకి వివరించి కర్తవ్య బోధ చేశారు. అప్పటికే దక్షిణాఫ్రికాలో నల్లవారిపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీజీకి గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురువుగా మారారు. బీహార్ లోని బాగా వెనుకబడిన చంపారణ్ జిల్లాలో తెల్లదొరలు, వారి వందిమాగదులూ ఆహార పంటలు వదలి, నీలిమందు లాంటి వాణిజ్య పంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. పండించిన పంటకు అరకొర ధర ముట్టచెప్పేవారు. ఎవరైనా కాస్త గట్టిగా మాట్లాడితే రకరకాలుగా హింసించి, నోరునొక్కి అణిచి వేసేవారు.
భోజనంలో విషం పెట్టాలని ఆజ్ఞ
ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో, చంపారణ్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ శుక్లా, పీర్ ముహమ్మద్ మోనిస్ అన్సారీలు, రైతుల గోసను గాంధీజీకి వివరించి, చంపారణ్ రైతులను పరామర్శించమని అభ్యర్ధించారు. దీంతో 1917 ఏప్రిల్ 15 న గాంధీజీ చంపారణ్ జిల్లాలోని మోతీహార్ గ్రామం చేరుకున్నారు. మోతీహార్ రైల్వే స్టేషన్ లో గాంధీజీకి ఘనస్వాగతం లభించింది. నీలిమందు రైతుల్లో గాంధీజీ కి ఉన్న ఆదరణ చూసి తెల్ల దొరలకు వెన్నులో వణుకు పుట్టింది. ఎలాగైనా గాంధీ అడ్డుతొలగించుకోక పోతే తమ ఆటలు సాగవని భావించిన ఆంగ్ల అధికారి 'ఇర్విన్ ' ఓ కౄరమైన పథక రచన చేశాడు. గాంధీజీని భోజనానికి ఇంటికి ఆహ్వానించి, చంపెయ్యాలన్నది ఆ దుర్మార్గపు ఆలోచన. దీని కోసం తన వంట మనిషి బతఖ్ మియా అన్సారీని వాడుకోవాలని భావించాడు. వెంటనే అన్సారీని పిలిచి, గాంధీ మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు, పాలలో విషం కలిపి ఇవ్వాలని, ఏమాత్రం అనుమానం రాకుండా పథకం అమలు చేయాలని, జీతం పదింతలు పెంచుతానని, మంచి నజరానాతో పాటు, విలువైన భూములు కానుకగా ఇస్తానని వాగ్దానం చేశాడు. పథకం ఏమాత్రం విఫలమైనా, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. 'ఇర్విన్ ' కౄర మనస్తత్వం బాగా తెలిసిన మియా అన్సారీ మౌనంగా ఉండిపొయ్యారు.
గాంధీ ప్రాణాలు కాపాడిన అన్సారీ
అనుకున్నట్లుగానే గాంధీజీ ఇర్విన్ ఇంటికి వచ్చారు. ఆయన వెంట డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. ఇర్విన్ స్వయంగా దగ్గరుండి విషం కలిపించిన పాలను గాంధీజీకి ఇవ్వమని అన్సారీని పురమాయించాడు. ఇర్విన్ ఆజ్ఞను ధిక్కరిస్తే జరిగే పరిణామాలను తలచుకుంటూనే, గాంధీజీ ప్రాణాలను రక్షించవలసిందేనని నిశ్చయించుకున్నాడు. వెంటనే విషయాన్ని గాంధీజీ కి చెప్పి ఆయన ప్రాణాలు కాపాడారు. అన్సారీ గుండె ధైర్యం, ఆయన చూపిన తెగువ, దేశం పట్ల, గాంధీజీ పట్ల ఆయనకున్న ప్రేమ కారణంగా, 1917లో గాంధీజీ ప్రాణాలతో బయట పడి, స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించగలిగారు. తన పథకం విఫలం కావడంతో ఇర్విన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నా బానిసవై ఉండి నామాటే వినవా అంటూ తీవ్రమైన చిత్ర హింసలకు గురిచేశాడు. ఆయన్ని, ఆయన కుటుంబీకుల్ని తీవ్రంగా వేధించాడు. అన్సారీ ఇంటినీ, కొద్దిపాటి భూమినీ జప్తు చేసుకొని, ఊరి నుండి వెళ్ళగొట్టాడు. తను ఏమైపోయినా పరవాలేదు, గాంధీజీ ప్రాణాలు కాపాడగలిగానన్న తృప్తితో, కట్టుబట్టలతో కుటుంబాన్ని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయారు గాంధీజీ ప్రాణ దాత బతఖ్ మియా అన్సారీ.
సభలో హత్యా పథకం వెల్లడి
గాంధీజీ నాయకత్వంలో సాగిన చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం చివరికి విజయవంతమైంది. చంపారన్ అగ్రేరియన్ యాక్ట్ 1918 పేరుతో చట్టంగా కూడా రూపుదాల్చింది. కానీ, తన సర్వస్వాన్నీ పణంగా పెట్టి గాంధీజీ ప్రాణాలు కాపాడిన బతఖ్ మియా అన్సారీని అందరూ మర్చిపోయారు.1950లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మోతీహార్ వెళ్ళిన సందర్భంగా సభలో ప్రసంగిస్తున్నప్పుడు, సభికుల్లో నుండి ఓ వృద్ధుడు వేదిక వైపు రావడానికి ప్రయత్నించడం, పోలీసులు అతన్ని నిలువరించడం జరిగింది. ఈ దృశ్యాన్ని చూసిన బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆ వృద్ధుణ్ణి గుర్తుపట్టి తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. వెంటనే పోలీసులు అతడిని వేదిక పైకి తీసుకువెళ్ళారు. బాబూరాజేంద్రప్రసాద్ ఎంతో భావోద్వేగానికి లోనవుతూ అతణ్ణి ఆప్యాయంగా, గుండెలకు హత్తుకున్నారు. యోగ క్షేమాలు విచారించి వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఈ హటాత్ పరిణామానికి అచ్చెరువొంది, సంభ్రమాశ్చర్యాలకు లోనైన సభికులకు 1917 నాటి ఆ వృత్తాంతమంతా పూస గుచ్చినట్టు వివరించారు. ఆరోజు బతఖ్ మియా అన్సారీ గాంధీజీ ప్రాణాలు రక్షించిన సంఘటనకు ఆయనే ప్రత్యక్ష సాక్షి. తరువాత గాంధీజీ ప్రాణాలు కాపాడినందుకు ఆంగ్ల అధికారి ' ఇర్విన్ ' ఏ విధంగా వేధించాడో, ఎన్ని చిత్ర హింసలు పెట్టి తననూ, తన కుటుంబాన్నీ వీధి పాలుచేశాడో, తాము ఏ విధమైన బాధలు భరించారో అంతా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు వివరించారు అన్సారీ.
గాంధీ ప్రాణదాతకు ఘోర అన్యాయం
ఈ బాధామయ గాధ విన్న రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ .. అన్సారీ, ఆయన ముగ్గురు కుమారులు షేర్ ముహమ్మద్ అన్సారీ, ముహమ్మద్ రషీద్ అన్సారీ, ముహమ్మద్ జమాల్ అన్సారీల కుటుంబాలకు యాభై ఎకరాల భూమిని కేటాయించాయించాల్సిందిగా అప్పటికప్పుడు జిల్లా కలెక్టరుకు ఆదేశాలు జారీచేశారు. స్వయంగా భారత రాష్ట్రపతే ఆదేశాలు జారీ చేసేసరికి, ఇక తమ పేదరికం వదిలినట్లేనని సంతోషించిన అన్సారీ కుటుంబానికి ఆ సంతోషం కూడా ఎన్నాళ్ళో నిలువలేదు. చెప్పులరిగేలా ఏడేళ్లపాటు కార్యాలయాల చుట్టూ తిరిగినా రాష్ట్రపతి ప్రకటించిన భూమి జాడ కనిపించలేదు. చివరికి 1957 డిసెంబర్ 24న అన్సారీ ఈలోకం వీడి అనంతలోకాలకు వెళ్ళిపోయారు. తర్వాత కొన్నాళ్లకు అన్సారీ మరణవార్త తెలుసుకున్న భారత రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్సారీ కుటుంబాన్ని రాష్ట్రపతి భవన్‌కు పిలిపించుకొని వారిని పరామర్శించారు. అయినా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. తననూ, తన కుటుంబాన్ని లెక్కచేయకుండా, మహాత్ముని ప్రాణాలు కాపాడిన బతఖ్ మియా అన్సారీకి సరైన న్యాయం జరగకపోగా, చరిత్ర కూడా ఆయన త్యాగాలను, విస్మరించడం మరో విషాదం.
- యండి. ఉస్మాన్ ఖాన్
99125 80645