ఈ 'మహా' ప్రభంజనానికి కారణాలు..

by Ravi |   ( Updated:2024-11-26 01:16:22.0  )
ఈ మహా ప్రభంజనానికి కారణాలు..
X

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి (బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవర్ నేషనలిస్టు పార్టీ) విజయం సాధిస్తుందని ఎన్నికల సర్వేలు చెప్పినప్పటికీ సీట్ల విషయంలో చాలా తేడా ఉంది. 288 సీట్లకు మహా యుతి కూటమి అనూహ్యంగా 234 సీట్లు సాధించడం దేశంలోని రాజకీయ విశ్లేషకులను సంభ్రమాశ్చర్యాలు గురిచేసిందంటే అతిశయోక్తి కాదేమో!

దేశ ఆర్థిక రాజధాని రాష్ట్రంగా పిలువబడుతున్న మహారాష్ట్రలో జాతీయవాదులు అనూహ్య విజయం సాధించడం, ఈ విజయం వెనుక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కృషి ఉండడం దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మహాయుతి ప్రభంజనం

15 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో 48 సీట్లకు 28 సీట్లు ఎన్డీయే కూటమి సాధించడం గొప్ప విషయం ఏమి కాదు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ఇచ్చిన ఉచిత గ్యారెంటీల హామీలతో కాంగ్రెస్ పార్టీ ఉద్ధవ్ థాకరే, శివసేన, శరద్ పవర్ నేషనలిస్ట్ పార్టీలతో జతకట్టి మహా వికాస్ అఘాడి కూటమి పేరుతో ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 48 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇక ఉపఎన్నిక జరిగిన రెండు పార్లమెంట్ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించడం ఆ పార్టీకి కొంత ఊరట నిచ్చే విషయమే!

ఆ ఒక్క నిర్ణయమే దెబ్బతీసిందా?

మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 48 లోక్ సభ సీట్లకు 30 సీట్లు సాధించిన ఈ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత ఘోరంగా వెనుకబడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం ఆల్ ఇండియా ముస్లిం ఉలేమా బోర్డు కోరిన 17 డిమాండ్లకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి నాయకులు అంగీకరించడం. ఈ విషయాన్ని హిందుత్వ సంస్థల కార్యకర్తలు హిందూ ఓటర్ల దగ్గరికి సానుకూలంగా తీసుకెళ్లడం మరొక కారణం. ఈ విషయంలో హిందుత్వం పట్ల ఆధారాభిమానం ఉండే ఓటర్లు ఓటింగ్ రోజు ఓటింగ్ కేంద్రాలకు వచ్చి బీజేపీ కూటమికి అనుకూలంగా ఓటును వేశారు. ఈ హిందూ అనుకూల ఓటర్ల సహాయంతోని షిండే శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేషనలిస్టు పార్టీ 41 సీట్లు సునాయాసంగా సాధించాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.

ఓబీసీ కార్డు పని చేయకున్నా...

ఇక ఓబిసి కుల సమీకరణ ఈ ఎన్నికల్లో బీజేపీకి పని చేయలేదు. అది పని చేసి ఉంటే-నాందేడ్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ ఉప ఎన్నికల్లో గెలిచేది. ఇక షిండే ప్రభుత్వం అమలు చేసిన 'లడికి బెహన్ యోజన' పథకం మహిళా ఓటర్లను బీజేపీ కూటమి వైపునకు మ ళ్లించిందనేది వాస్తవమే. ఎన్నికల ముందు రెండు లక్షల 34 వేల మంది మహిళలకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఆర్థిక సహకారం అందింది. 'ఏక్ హై తో సేఫ్ హై' ప్రధాని మోడీ ఇచ్చిన నినాదం ఓటర్ల మీద కొంత వరకు పనిచేసిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా‌ణ్ మహారాష్ట్రలోని అనేక నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ, బీజేపీ మతతత్వ పార్టీ కాదు మానవత్వ పార్టీ అని ఇచ్చిన నినాదం ఆ నియోజకవర్గాల ఓటర్ల పైన బాగా ప్రభావం చూపింది. 2014లో 122 సీట్లు, 2019లో 105 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఏకంగా 132 సీట్లు గెలుచుకోవడం అనూహ్య విజయం.

ఫలించని కమల వ్యూహం!

ఇక ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ముందు ఊహించినవే. కాంగ్రెస్‌తో జతకట్టిన జేఎంఎం కూటమి 81 సీట్లకు 56 సీట్లు సాధించడం వెనుక మావోయిస్టులు, మిషనరీలు, ఇస్లాం గ్రూపులు బలంగా పనిచేశాయనేది అక్షర సత్యం. ఆ రాష్ట్రంలో అక్రమ చొరబాట్ల సమస్య తీవ్రంగా ఉందని, రాష్ట్ర హైకోర్టు దీనిపై ఎంక్వయిరీ చేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చినప్పటికీ ,అక్రమ చొరబాటుదారుల ఓట్లతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే జేఎంఎం, కాంగ్రెస్, కమ్యూ నిస్టు, ఆర్జేడీ పార్టీల నాయకుల ఆశలు ఈ ఎన్నికల్లో నెరవేరాయి. ఇక తాము అధికారంలోకి వస్తే, అక్రమ చొరబాటుదారులను ఏరిపారేస్తామని, ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తామని బీజేపీ నాయకులు చెప్పిన మాటల్ని, అక్రమ చొరబాటుదారుల వల్ల భవిష్యత్తులో భారత దేశానికి భద్రత పరంగా ఎదురయ్యే సమస్యలను కొండ జాతి ప్రజలు సరిగా అర్థం చేసుకోలేదని ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ 21 సీట్లతో 33.17% ఓట్లను పొందింది. 23.17శాతం ఓట్లతో జేఎంఎం 34 సీట్లు సాధించడం ఆశ్చర్యం కలిగించినా బీజేపీ జాతీయవాదాన్ని వ్యతిరేకించే ఓటును జేఎంఎం కాంగ్రెస్ కూటమి బాగా ఒడిసి పట్టిందని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి. వాస్తవంగా హేమంత్ సోరేన్ ప్రభుత్వం అవినీతితో కూడుకున్నదే. ట్రైబల్ ప్రజలకు అవినీతి విషయంలో అంత పట్టింపు ఉండదు. జేఎంఎం కూటమి ప్రభుత్వం. 'మెయ్యా యోజన పథకం' ద్వారా ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సహకారం అందించడం, కూటమి మల్లా గెలిస్తే, దీనిని 2500 కు పెంచుతామని ఇచ్చిన హామీ ట్రైబల్ ఓటర్ల మనసుల మీద బాగా పనిచేసింది.

కులగణన తుస్సుమన్నట్లేనా?

ఇక చివరగా దేశ ఆర్థిక రాజధాని రాష్ట్రంగా పిలువ బడుతున్న మహారాష్ట్రలో జాతీయవాదులు అనూహ్య విజయం సాధించడం, ఈ విజయం వెనుక రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కృషి ఉండడం దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పైగా కుల గణన వల్ల దేశంలో సామాజిక మార్పు వస్తుందని కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలను మహారాష్ట్ర ఓటర్లు తృణీకరించినట్లు ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. 15 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో 48 సీట్లకు 28 సీట్లు ఎన్డీయే కూటమి సాధించడం గొప్ప విషయమే. ఇక ఉపఎన్నిక జరిగిన రెండు పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించడం ఆ పార్టీకి కొంత ఊరట నిచ్చే విషయమే!

- ఉల్లి బాల రంగయ్య

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877

Advertisement

Next Story

Most Viewed