- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పరీక్ష యేడులోకి రాహుల్ పరుగు…
రాహుల్ గాంధీ రాజకీయంగా పరిణితి కనబరుస్తున్న నిష్పత్తిలోనే దేశంలో ఆయనకు ఆదరణ పెరుగుతోంది. క్రమంగా దేశ రాజకీయాలకు కేంద్రక స్థానం వైపు ఆయన పయనం సాగుతున్నట్టు ఒక దృశ్యం ఆవిష్కృతమవుతోంది. తనను ఇష్టపడే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఆయనంటే గిట్టని వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ తటస్థుల సంఖ్య తగ్గుతుండటం విశేషం! 53వ జన్మదినం పూర్తి చేసుకొని నేటితో 54వ ఏట ప్రవేశిస్తున్న రాహుల్‌గాంధీ భారత సమకాలీన రాజకీయాల్లో తనదైన ముద్ర వేయదగ్గ సంవత్సరంగా రాజకీయ పండితులు కొన్ని ఊహలు చేయవచ్చు.
దేశం దక్షిణ కొస కన్యాకుమారి నుండి ఉత్తర కొస కాశ్మీర్ వరకు ‘భారత్ జోడో’ యాత్ర పూర్తిచేసి, పార్లమెంటులో రాహుల్‌గాంధీ ఒక ప్రభావవంతమైన ప్రసంగం చేసినపుడు నేనో వ్యాఖ్య చేశా! ‘రాజకీయంగా పరిణితి చూపాడు’ అని. తెలంగాణ వాడుక నానుడి ప్రకారం ‘ముడ్డి కింద 54 పెట్టుకొని, ఇప్పుడు పరిణితి చూపడమేంటి సార్ మీరు భలే మాట్లాడుతారు!’ అన్నాడు నా జర్నలిజం శిష్యుడొకరు. నేను ప్రిన్సిపల్‌గా జర్నలిజం బడిలో చదువుకున్న సుమారు 300 మందిలో ఓ 50 నుంచి 100 మంది అప్పుడప్పుడైనా నాతో మాట్లాడుతుంటారు. కాస్త ఆలస్యంగా ఆ పరిణితి వచ్చిందో, ఆయనలోని రాజకీయ సుగుణాన్ని మనమే ఆలస్యంగా గుర్తిస్తున్నామో కానీ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా లోక్‌సభలో ఆయన చేసిన ప్రసంగం ప్రశంసనీయంగా ఉందని ఆ యువ జర్నలిస్టుకు పలు ప్రమాణాలతో సహా వివరించాల్సి వచ్చింది. సభానాయకుడైన ప్రధాన మంత్రిని నిరుత్తరుడిని చేయడం, ప్రత్యర్థులు రెచ్చగొడుతున్నా ప్రసంగం గాడి తప్పకపోవడం, ఇన్వెస్టర్ల నమ్మకం సడలించి, కోట్ల రూపాయల స్టాక్ విలువలు ఆవిరైన స్కామ్‌లో అదానీ సందేహాస్పద పెట్టుబడులను, ఆయనతో ప్రధాని సంబంధాల్ని ప్రశ్నించడం, ఎంత ప్రతిఘటన ఎదురైనా తన పంథాను నిర్భయంగా, అంతకుమించి నిర్మలంగా కొనసాగించడం...ఇవన్నీ చెప్పాను. అప్పుడే తాజాగా ముగిసిన పాదయాత్రలో ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, లేవనెత్తిన సందేహాలను కూడా ఎంతో సందర్భోచితంగా రాహుల్ తన గంట ప్రసంగంలో మేళవించిన తీరు సభికులను, దేశ ప్రజలను ఆకట్టుకుంది. అయినా నా శిష్యుడి లాంటి కొంతమంది రాహుల్‌ని వ్యతిరేకించారు. రాహుల్ బలహీనంగా ఉండటమే తాము ఎంతో అభిమానించే మోదీకి రక్ష అని, ఇన్నాళ్లు యువనాయకుని పట్ల తటస్థ భావనతో ఉన్న వారు కూడా కొత్తగా ఆయన్ని వ్యతిరేకించడం, అయిష్ట చూపడం ప్రారంభించారు. అదీ ఒక రకంగా రాహుల్ విజయంగానే పరిగణించవచ్చేమో!
సర్వే తేల్చిన నిజాలు..
దేశంలో రాహుల్‌ని ఇష్టపడేవారి సంఖ్య భారత్ జోడో యాత్ర తర్వాత రమారమి పెరిగినట్టు నెలకింద జరిగిన తాజా సర్వే తేల్చింది. రాహుల్‌ని ఎప్పుడూ ఇష్టపడుతామని 25.6 శాతం భారతీయులంటే, పాదయాత్ర తర్వాత ఇష్టం పెరిగిందని 15.3 శాతం మంది చెప్పారు. 16.1 శాతం మంది అయిష్టత వ్యక్తం చేశారు. 26.8 శాతం మంది మాత్రం ఇష్టం లేదు, అలా అని అయిష్టతా లేదన్నారు. మోదీపట్ల జనంలో అయిష్టత 23.1 శాతం, ఇష్టపడే వాళ్లు 39.5 శాతం ఉన్నారు. ప్రాతినిధ్య నమూనాలో 19 రాష్ట్రాల్లోని, 71 నియోజకవర్గాలు, 282 పోలింగ్ స్టేషన్ల పరిధిలోని 7202 మంది ఓటర్లు శాంపిల్‌గా ఎన్డీటీవీ (యాజమాన్యం అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోకి వచ్చాక) సీఎస్‌డీఎస్-లోక్‌నీతి ఉమ్మడిగా ఈ సర్వే నిర్వహించాయి. మే 9-19 మధ్య (10న కర్ణాటకలో అసెంబ్లీ పోలింగ్) ఈ దేశవ్యాప్త సర్వే జరిగింది. తదుపరి ప్రధాని ఎవరు అయ్యే అవకాశముంది అన్న ప్రశ్నకు 43.4 శాతం మంది ప్రస్తుత ప్రధాని మోదీ పేరు చెబితే 26.8 శాతం మంది రాహుల్ పేరు చెప్పారు. ఇది 2019లో వ్యక్తమైన అభిప్రాయం కన్నా 4 శాతం అధికం. 2014లో వ్యక్తం చేసిన వారికన్నా 13 శాతం అధికం. ప్రధానిగా రాహుల్ తర్వాతి స్థానాల్లో 4 కన్నా తక్కువ శాతాల్లో మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేష్‌లున్నారు. ప్రధాని మోదీని ఎవరు ఢీకొట్టగలరు అన్న ప్రశ్నకు కూడా 34.1 శాతం మంది రాహుల్ పేరు చెబితే 11 శాతం మంది కేజ్రీవాల్ అని, 4.9 అఖిలేష్ అని, 4.2 శాతం మమత అని అన్నారు.
మూడడుగుల వటువు
కొన్ని విషయాల్లో రాహుల్ గాంధీ కనబర్చే నిబద్దత, నిలకడతనం రాజకీయ పరిశీలకులనూ విస్మయానికి గురిచేస్తుంది. అధికారం, హోదాపట్ల నిరపేక్షత, పలు విషయాల్లో ఏ తొందరపాటులేని నిదానం, నిలకడతనం, నిర్భయంగా ప్రశ్నించే తత్వాన్ని అన్ని వేళలా కొనసాగించడం వంటివి ఇతర సమకాలీన నాయకులకన్నా రాహుల్‌ని విభిన్నంగా నిలబెడుతాయి. ముఖ్యంగా మూడు పరిణామాలతో ఆయన పట్ల జనాదరణ పెరిగింది. మొదటిది భారత్ జోడో పాదయాత్ర. ఈ యాత్ర తర్వాత 15.3 శాతం మందిలో ఆయన పట్ల ఇష్టత పెరగడం ఇందుకు నిదర్శనం. వ్యాపారవేత్త అదానీ ప్రధాని మోదీ మధ్య ఏమిటి సంబంధం అని ప్రశ్నిస్తూ, గట్టిగా నిలబడి చేసిన పార్లమెంటు ప్రసంగం మంచిపేరు తెచ్చి పెట్టింది. తర్వాత గుజరాత్‌లోని సూరత్ కోర్టు జైలు శిక్ష విధించిన దరిమిలా..లోక్‌సభ సభ్యత్వం రద్దు, అధికారిక నివాసం ఖాళీ చేయించడం వంటి పరిణామాలతో ఆయన పట్ల ఒక సానుభూతి, ఉదారభావనలు పెరిగాయి.
ఇన్ని రాష్ట్రాలున్న ఇంత పెద్ద దేశంలో...సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు (రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్) రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన స్థితి నుంచి క్రమంగా మెరుగుపరుస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో గెలుపు తర్వాత 42.9 శాతం ఓటు షేర్‌తో కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రంలో విజయం కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్తేజాన్ని తెచ్చింది. భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్‌కు మేలు జరిగిందా అన్న సర్వే ప్రశ్నకు అవునని 72.4 శాతం మంది అంటే, లేదని 27.6 శాతం మంది అన్నారు. 2019 నాటి ఎన్నికలతో పోల్చి చూస్తే కాంగ్రెస్ తన ఓటు శాతం 10 (19 నుంచి 29 శాతానికి) పెంచుకొని, మరింత మెరుగుపరుచుకునే క్రమంలో ఉంది.
యువ నాయకత్వ వాసనలు
దేశ ప్రజలు క్రమంగా యువ నాయకత్వం వైపు ఆకర్షితులవుతున్నట్టు వివిధ రాష్ట్రాల్లో వీస్తున్న రాజకీయ గాలులు ధ్రువీకరిస్తున్నాయి. బీహార్‌లో తేజస్వీ, యూపీలో అఖిలేష్, రాజస్థాన్‌లో సచిన్ బలపడుతున్నారు. ఏపీలో జగన్మోహన్‌రెడ్డి రాజకీయంగా స్థిరపడ్డారు. జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయంగా ఇక జీవన్మరణ పోరుకు దిగారు. తెలంగాణలో మంత్రి కె.టి.రామారావు, ఏపీలో లోకేష్‌లు తమ అదృష్టం పరీక్షించుకుంటూ నిరీక్షణలో ఉన్నారు. శరద్ పవార్ తనయ సుప్రియా సూలే మహారాష్ట్రలో ఎన్సీపీ వారసత్వ పగ్గాలు చేబుచ్చుకున్నారు. కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌లలో ముఖ్య రాజకీయ నేతల పిల్లలు దూసుకొని వస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారత్‌లో యువతరం రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా కొత్త ఒరవడిలోకి పయనించడం ఆశావహ పరిణామంగానే పరిశీలకులు భావిస్తున్నారు. ఇక కావాల్సిందల్లా ప్రజాభీష్టానికి పెద్దపీట వేసి, అందుకనుగుణంగా రాజకీయం, పాలనా వ్యవస్థల్ని నడిపించడమే!
వారసత్వం నీడలో..
గాంధీ-నెహ్రూ కుటుంబ వారసత్వ ప్రతినిధిగా రాహుల్‌కు బలం ఎంతో బలహీనం కూడా అంతే కావాలని ప్రత్యర్థుల లక్ష్యం. అందుకోసం అవసరమైతే చరిత్ర గతంలోకి నడిచైనా...గాంధీపైన, నెహ్రూపైన ఇప్పుడు బురద చల్లడానికి కూడా వెనకాడరు. నిత్యం అదే జరుగుతోంది. సదరు విమర్శలను ఎదుర్కొంటూ తనదైన పంథాలో కొత్త రాజకీయాలను నిర్వచించి, నిర్వహించాల్సిన బాధ్యత రాహుల్‌పైన ఉంది. 1997లో పార్టీ క్రియాశీల పాత్రలోకి వచ్చినా 1998, 1999 ఎన్నికల్లో పోరాటం తర్వాతే సోనియా గాంధీ తన నాయకత్వాన్ని 2004లో నిరూపించుకోగలిగారు. రాహుల్ గాంధీకి కూడా అది తప్పదు. రాహుల్‌ను మోదీతో పోలుస్తూ పలువురు రాజకీయ విశ్లేషకులు లేవనెత్తే ప్రశ్నకు ‘నా వయసులో మోదీ ఏమి చేస్తుండేవారని’ ఆయన తనదైన శైలిలో ఎదురు సవాలు విసిరేవారు. రాజకీయ ఓనమాల నుండి చతురతను ప్రదర్శిస్తున్న రాహుల్ 2014, 2019 ఎన్నికల తర్వాత....ఇప్పుడిప్పుడే మరింత రాజకీయ పరిణితి కనబరుస్తున్నారు. ఇంకో జన్మదినం వచ్చేలోపు భారత రాజకీయాల్లో ఆయన ఏమైనా కొత్త సంచలనాలు సృష్టించగలరా అన్నది తేల్చే సంవత్సరం ఇది.
-దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ,
99490 99802