- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షేమం చుట్టూ… పార్టీలు!
సాధారణ ఎన్నికలు కొద్ది నెలల్లో జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు వ్యూహాల్లో నిరంతరం మునిగితేలుతూ ఎన్నికలు ఇప్పుడే వచ్చినట్లుగా వాతావరణం సృష్టిస్తున్నాయి. జుగుప్సాకరంగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఒకరికి మించి ఒకరు సంక్షేమ పథకాల పేరుతో వరాల జల్లులు కురిపిస్తున్నాయి. పేదలకు అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నాయి. ప్రజలకు, పాలక ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు దేని కోసం ప్రకటిస్తున్నాయి, సంక్షేమ పథకాల కోసం పేదలు ఎందుకు చూడవలసి వస్తున్నది, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల కోసం కాకుండా స్వశక్తిపై పేదలు బతకడానికి కావాల్సింది ఏమిటి అన్న విషయాలను అర్థం చేసుకుంటేనే సంక్షేమ పథకాల్లో దాగి ఉన్న కుట్రను అర్ధం చేసుకోగలము.
దేశానికి ‘స్వాతంత్య్రం' వచ్చి 76 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ కాలంలో పేదల జీవితాల్లో మౌలిక మార్పులు సంభవించాయా అంటే వచ్చే సమాధానం లేదు. పేదల పరిస్థితులు, వారి జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయా అంటే కూడా లేదనే సమాధానం వస్తుంది. ఇందుకు పాలక ప్రభుత్వాలు కారణమా అంటే అవును అని వెంటనే సమాధానం వస్తుంది. పేదల జీవన పరిస్థితులు మెరుగు పడటం అనేది పాలించే పాలక పార్టీల, ప్రభుత్వాల వర్గ స్వభావంపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. భారత పాలక పార్టీల, ప్రభుత్వాల వర్గ స్వభావం దోపిడీ వర్గాలను కాపాడే స్వభావం. అందువలన అధికార మార్పిడి జరిగిన దగ్గర నుంచి నేటి వరకు ప్రభుత్వాలన్నీ బడా పెట్టుబడిదారుల, భూస్వాముల, సామ్రాజ్యవాదుల దోపిడీ ప్రయోజనాలకు ప్రాతినిధ్య వహిస్తూ ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నవే. ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారాన్ని పక్కన పెడుతున్నవే.
పోరాటాల అణిచివేతే లక్ష్యంగా..
భారత దేశం నేటికీ వ్యవసాయక దేశమని పాలక పార్టీలతో సహా అందరూ అంగీకరిస్తున్నారు. ఇప్పటికీ 68% ప్రజలు గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు. గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు, సేద్యానికి కావాల్సిన భూమి, పని చేయడానికి ఉపాధి. 76 సంవత్సరాల ‘స్వాతంత్ర్య' పాలనలో గ్రామీణ పేదలకు ఈ రెండు లభించేది. పట్టణ పేదలకు, శ్రామికులకు, ఉన్న ఉపాధి కూడా తరిగి పోతున్నది. ఫలితంగా గ్రామీణ, పట్టణ పేదలు దుర్భరమైన పేదరికంలో మగ్గుతున్నారు. పేదరికానికి, దుర్భర జీవితాలకు తాము సేద్యం చేసి పంటలు పండించే భూమిపై హక్కు లేక పోవటమని గ్రహించిన గ్రామీణ పేదలు భూమిపై హక్కు కోసం పోరాటం ప్రారంభించారు.
అలా వచ్చిన పోరాటాలే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్బరీ, శ్రీకాకుళం రైతాంగ గిరిజన పోరాటాలు. ఇవి గాక దేశంలో అనేక ప్రాంతాల్లో పేదల భూ పోరాటాలు జరిగాయి. హక్కుల కోసం, ఉపాధి కల్పన కోసం, నిరుద్యోగ నివారణ కోసం, ధరల అదుపు కోసం శ్రామికులు, పట్టణ పేదల మిలిటెంట్ ఆందోళనలు చేశారు. గ్రామీణ పేదల, పట్టణ పేదల, శ్రామికుల పోరాటాలు పాలక వర్గాల వెన్నులో వణుకు పుట్టించాయి. పోరాటాలపై తీవ్ర అణచివేతను అమలు జరుపుతూనే కొన్ని చట్టాలు, సంక్షేమ పథకాలు పాలక ప్రభుత్వాలు ప్రవేశపెట్టక తప్పలేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో ప్రారంభమైన పథకాలు నేడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నేడు సంక్షేమ పథకాల పేరు చెప్పకుండా పాలక పార్టీలు మనుగడ సాగించలేకపోతున్నాయి. ఇందిరాగాంధీ చేసిన భూ సంస్కరణల చట్టం, బ్యాంకుల జాతీయకరణ, పేదలకు బ్యాంకుల రుణాలు, గొర్రెలు, బర్రెల వంటి పథకాలు, నేడు అనేక రాష్ట్రాలు మితిమీరిన సంక్షేమ పథకాల ప్రకటనలలో పోటీ పడటం ప్రజల వ్యతిరేకత నుండి బయటపడేందుకే.
సంక్షేమ పథకాలను అమలు చేయటంలో పాలక ప్రభుత్వాలకు వ్యూహాత్మక విధానం ఉంది. సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తమకు అనుకూలంగా పైరవీ కారులను తయారు చేయటం, వారి ద్వారా ప్రజలను ఉద్యమ బాట నుంచి తప్పించి, ఆర్థిక ప్రయోజనాల కోసం తమ చుట్టూ తిరిగేలా చేయటం, ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయటం. తద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవడమే పాలకుల లక్ష్యం.
ప్రజలను ఆదుకోవడానికే సంక్షేమమా?
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పధకాలను ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రకటిస్తున్నాయి. నవరత్నాల పేరుతో, అనేక పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టి, ప్రజలు వాటి కోసం ఎదురు చూసేలా వారి మనస్సును మళ్లించింది. ప్రజా సంఘాల్లో, ఉద్యమాల్లో ప్రజలు సంఘటిత పడకుండా, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, వెట్టి చాకిరీ చేసేలా వాలంటీర్లను నియమించి వారి ద్వారా సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రజలకు చెప్పటం ద్వారా, ప్రజా సంఘాల ద్వారా ఉద్యమాలు చేయవద్దని పరోక్షంగా ప్రజలకు హెచ్చరిక పంపింది. ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రజా ఉద్యమాల్లో ప్రజలు సంఘటిత పడకుండా అడ్డుపడుతున్నది.
సంక్షేమం పప్పులో కాలేసిన చంద్రబాబు
నవరత్న పధకాలను తీవ్రంగా విమర్శించి, ఆ పథకాల కోసం అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు సంక్షేమ పథకాల ప్రకటనలలో మునిగితేలుతున్నారు. తెలుగు దేశం పార్టీ జరిపిన మహానాడులో ప్రకటించిన మినీ ఎన్నికల ప్రణాళికలో అనేక పథకాలు ప్రకటించాడు. 45 నుండి 60 లోపు మహిళలకు వైసీపీ ప్రభుత్వం సంవత్సరానికి 18 వేలు ప్రకటిస్తే, టీడీపీ మినీ ప్రణాళికలో 18 నుంచి 59 సంవత్సరాల మహిళలకు నెలకు 1,500 ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా-పీఎం కిసాన్ ద్వారా పంట ముందస్తు పెట్టుబడి కోసం రూ. 13,500 వేలు ఇస్తుంటే, టీడీపీ మినీ ప్రణాళికలో రూ. 20 వేలు ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా కుటుంబంలో బడికి వెళ్లే ఒక బిడ్డకు ప్రతి సంవత్సరం 15 వేలు ఇస్తుంటే, ప్రతి బిడ్డకు చంద్రబాబు 15వేలు ఇస్తానంటున్నాడు. ఇంకా మినీ ఎన్నికల ప్రణాళికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి నెలకు రూ. 3వేలు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ప్రతి ఇంటికి కుళాయి, ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రకటించారు. వీటిని అమలు జరపటానికి జగన్ కన్నా అప్పులు ఇంకా ఎక్కువ చేయాలి గదా! 2014 ఎన్నికల ప్రణాళికలో కూడా చంద్రబాబు నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన వాగ్దానం చేశారు. కానీ ఆచరణలో అమలు జరపడం లేదు. పంట రుణాల రద్దు పూర్తిగా అమలు కాలేదు.
కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలు
నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా పీఎం ఆవాస్ యోజన ఉచిత బియ్యం పథకం, ఉచిత వైద్య సేవలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లాంటి సంక్షేమ పథకాలు అమలు జరుపుతూనే, రాష్ట్రాలు మాత్రం సంక్షేమ పథకాలు అమలు జరపరాదంటున్నది. 2022 అక్టోబర్ 23న పీఎం ఆవాస్ యోజన పధకం లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటించడంపై విమర్శలు గుప్పించాడు. టాక్స్ పేయర్స్ (పన్నులు చెల్లించే వారు) తాము చెల్లించే పన్నులను ఉచిత పథకాలకు ఖర్చుపెట్టడం పై వారు ఎంతో ఆవేదన చెందుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం పన్నుల సొమ్మును ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టటంపై వారు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. పన్నులు కట్టేది బడా పెట్టుబడిదారులు, సంపన్న వర్గాలే కాదు, వారికన్నా సామాన్య ప్రజలు, పేదలు వివిధ రూపాల్లో ఎక్కువగా పన్నులు చెల్లిస్తున్నారు. ఇది మోదీకి తెలియదా! ప్రజల సొమ్ము వారికి కాకుండా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే కట్టి పెడతానని మోదీ చెప్పకనే చెబుతున్నాడు. అందులో భాగమే ప్రతి సంవత్సరం లక్షల కోట్లమేరకు బడా పారిశ్రామిక వేత్తల బ్యాంకుల అప్పులను మొండి బకాయల పేరుతో రద్దు చేయటం.
సంక్షేమ పథకాల అమలు గురించి మాట్లాడేవారు పేదల మౌలిక సమస్యల పరిష్కారం గురించి ఏమి చెబుతారు. వారు ఎల్లకాలం పాలక ప్రభుత్వాల సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తూ, యాచకులుగా బ్రతకాల్సిందేనా! వారి సమస్యల పరిష్కారానికి మౌలిక కారణంగా ఉన్న భూమిని, ఉపాధిని సాధించుకుని ఎవరి దయ మీద ఆధార పడకుండా స్వతంత్రంగా బ్రతకమని చెప్పరా! అసలు సంక్షేమ పథకాలే వద్దనే వారు పేదలకు కాకుండా ప్రజల సొమ్మును బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే కట్టబెట్టాలని కోరుకుంటున్నారా! గ్రామీణ, పట్టణ పేదలు పాలక వర్గాల సంక్షేమ పథకాల్లో దాగి ఉన్న రాజకీయ స్వార్ధాన్ని అర్ధం చేసుకొని, వాటిని ఉపయోగించుకుంటూనే మౌలిక సమస్యలైన సేద్యపు భూమిని, ఉపాధిని సాధించుకున్నప్పుడే ఎవరి మీదా ఆధారపడకుండా స్వయం శక్తితో జీవించగలమని తెలుసుకుని వాటిని సాధించుకునేందుకు ఉద్యమించాలి.
- బొల్లిముంత సాంబశివరావు
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
రైతు కూలీ సంఘం ( ఆం.ప్ర)
98859 83526