కార్యకర్తా... నువ్వు జాగ్రత్త!

by Ravi |   ( Updated:2024-09-14 01:00:31.0  )
కార్యకర్తా... నువ్వు జాగ్రత్త!
X

తెలంగాణ రాష్ట్రం కోసం, ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీ పిలుపుతో ఎంతో మంది కార్యకర్తలు, విద్యార్థులు తమ ప్రాణాలకు తెగించి పోరాటంలో ముందున్నారు. కొందరైతే ప్రాణాలు కూడా లెక్కచేయలేదు. అయితే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆ కార్యకర్తలకు గానీ, ఆ విద్యార్థులకు గానీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదనే వాదనలు ఉన్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు కావాలని తమ నోటి దూరుసుతో వివాదాలను సృష్టిస్తూ కార్యకర్తలను బలి పశువులు చేస్తుంటారు. తమ లీడర్ సర్వస్వం అనుకొని ఆ కార్యకర్తలు సైతం తమ లీడర్‌పై ఈగ కూడా వాలనీయకుండా నాయకుడిని కాపాడే క్రమంలో గాయాలపాలవ్వడంతో పాటు కేసులు కూడా నమోదైన ఘటనలను చూశాం. ఆ తర్వాత కార్యకర్తల పరిస్థితి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలు తమ కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా తను నమ్ముకున్న నాయకుడి కోసం ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. కానీ తెరవెనుక రాజకీయ నాయ కులు అందరూ ఒకటే అని కార్యకర్తలకు ఎప్పుడు అర్థమవుతుందో..?

తాజాగా రాష్ట్రంలో పరిస్థితి..

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితిని సృష్టించారు. అసలు ఎమ్మెల్యేల పార్టీ మార్పుని 2014 నుంచి ప్రోత్సహించిందే టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్షమే ఉండకూడదని ఆలోచనతో 2014 నుంచి 2023 వరకు దాదాపుగా 38 మంది ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్పించుకున్నారు. అప్పుడు అంతగా రాద్ధాంతం చేయని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడెందుకు ఇంత రాద్ధాంతం చేస్తుందో కార్యకర్తలు గమనించాలి. ఆ సమయంలో ఇతర పార్టీలో నుంచి వచ్చిన నాయకులే ముందుండి మంత్రి పదవులను, రాష్ట్రంలో అనేక కీలకమైన పదవులను పంచుకుని ముఖ్య పాత్ర పోషించారు. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన నాయకులకు మాత్రం పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వారే శత్రువులయ్యారు. అందుకే రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు శత్రువులు అవుతారో ఎప్పుడు ఎవరు మిత్రులవుతారో తెలియని పరిస్థితి ఉంటుంది.

అండగా ఉంటామని అంటున్నారే కానీ

నువ్వు నమ్ముకున్న నాయకుడి కోసం ముందుండే కార్యకర్తా... జాగ్రత్త. దాడులలో నీకు ఏమైనా అయితే పార్టీ పెట్టదు, ఇటు ప్రభుత్వం పెట్టదు. ఏదైనా అయ్యి ఆసుప్రతిలో చేరితే ఖర్చు మొత్తం నీ కుటుంబమే భరించాల్సి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగితే.. మీడియా ముందుకు వచ్చి మీ నాయకులు మేము ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటనలు ఇస్తారే తప్ప ఏ పార్టీనైనా, ఏ రాజకీయ నాయకుడైన ఇంతవరకు కార్యకర్త కుటుంబానికి అండగా నిలబడ్డ దాఖలాలయితే లేవు. తమ స్వార్థాల కోసం నీ జీవితాన్ని నీ కుటుంబం జీవితాన్ని రోడ్డుపైకి లాగే పరిస్థితులు నువ్వు ఎందుకు తీసుకురావాలి? వాళ్ల కోసం నువ్వు ముందుండి ఎందుకు పోరాడాలి? నీకు వారు ఏం చేశారనే విషయాన్ని ఇప్పటికైనా గ్రహించి రాజకీయ నాయకుల ముసుగులో ఇరుక్కున్న ప్రతీ పార్టీకి చెందిన కార్యకర్తను బయటకు రావాలని రాజకీయ నాయకులు తమ స్వార్థాల కోసమే మిమ్మల్ని వాడుకుంటున్నారని గమనించాలని కోరుకుంటున్న.

చట్టాలు కఠినతరం చేయాలి..

ప్రజాప్రతినిధి ఎవరైనా ఏ పార్టీవారైనా, అసభ్య పదజాలంతో కానీ.. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు గాని చేస్తే ముందుగా పోలీసులు వారిపై రౌడీషీట్ కేసునో, పీడీ యాక్ట్ కేసునో నమోదు చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలు రూపొందాలి. వారు ఏసీ రూములలో ఉంటూ ఏసీ కార్లలో తిరుగుతూ సామాన్య ప్రజలను కార్యకర్తలను రెచ్చగొట్టే ఈ రాజకీయ నాయకులను కఠినంగా శిక్షించాలని భారతదేశ పౌరుడిగా కోరుకుంటున్నాను.

సింగిరెడ్డి అశోక్ రెడ్డి

76618 01107

Advertisement

Next Story