- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భగత్‌సింగ్ అమరత్వంపై 92 ఏళ్ళ ముందు పెరియార్ రాసిన సంపాదకీయంలో ఏముంది?
భగత్ సింగ్ ఎత్తిపట్టిన సిద్ధాంతానికి కాలం, స్థలం, సాధారణ ధోరణులు వ్యతిరేకమైనవి కావని మనందరికీ ఖచ్చితంగా తెలుసు. తన సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఎంచుకున్న మార్గంలో తప్పుచేసాడు అని నాకు అనిపించినా, అతను ఎంచుకున్న సిద్ధాంతం తప్పని చెప్పే ధైర్యం ఎప్పటికీ చేయను. ప్రపంచంలో శాంతి విజయవంతం కావాలంటే ఆ సిద్ధాంతం ద్వారా మాత్రమే సాధ్యం. సామాన్య ప్రజల లాగే భగత్ సింగ్ జబ్బు పడి బాధను అనుభవించి చనిపోలేదు. భారతదేశానికే కాదు... మొత్తం ప్రపంచానికి కూడా అసలైన సమానత్వానికి, శాంతికీ దారి చూపించే గొప్ప కారణం కోసం, తన విలువైన ప్రాణాలు అర్పించాడు. సాధారణంగా ఎవరూ అందుకోలేని అత్యున్నత శిఖరాలను అతను చేరుకున్నాడు. మా గుండె లోతుల్లోంచి అతని అమరత్వాన్ని పొగుడుతాం. పాటై పాడుతాం. ఈ సందర్భంగా (బ్రిటిష్) ప్రభుత్వానికి మాదో విన్నపం. ప్రతి ప్రావిన్స్‌లో భగత్ సింగ్ లాంటి వాళ్ళను గుర్తించి, అటువంటి ధైర్యాన్ని నేరంగా గుర్తించి నెలకు నలుగురి చొప్పున ఉరి తీయాలని మా మనవి ఇవి పెరియార్ మాటలు.
భగత్ సింగ్ ఉరి పట్ల బాధ వ్యక్తం చేయని వారు ఉండరు. భగత్ సింగ్‌ని ఉరికంబం ఎక్కించినందుకు ప్రభుత్వాన్ని ఖండించని వారు లేరు. తమను తాము గొప్ప దేశ ప్రేమికులమని, జాతీయ నాయకులు అని చెప్పుకునే వారు నేడు భగత్ సింగ్ ఉరికి గాంధీ కారణం అని నిందిస్తున్నారు. అదే సమయంలో ఈ స్వయం ప్రకటిత దేశ ప్రేమికులు జాతీయ నాయకులు గాంధీ-వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌ల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయినందుకు సంతోషాన్ని తెలియచేస్తున్నారు. భగత్ సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూనే, ఎటువంటి షరతు లేని ఈ ఒప్పందాన్ని ఒక విజయంగా సంబురాలు చేసుకుంటూ గాంధీని పొగుడుతున్నారు. వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
గాంధీ ఉప్పు సత్యాగ్రహం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, అంతేగాకుండా అది దేశ ఎదుగుదలకు వ్యతిరేకమైనదని అంతిమంగా పీడిత వర్గాల విముక్తికి చేటు అని ఆనాడే చాలా విస్తృతంగా వివరించాము. భగత్ సింగ్ లాంటి వాళ్ళు చేసిన పనులను, ఆ తాలూకా ప్రభావాన్ని నాశనం చేసి సరిదిద్దడం కోసమే సత్యాగ్రహం మొదలెడుతున్నానని గాంధీ స్వయంగా చాలా స్పష్టంగా దాని వెనుక కారణాలను వివరించాడు. అదే విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నాడు కూడా. ఈ విషయాలనే సమర్థిస్తున్నట్టుగా, నిజమైన సామ్యవాదులు చాలా గట్టిగా “గాంధీ పేద ప్రజలను మోసం చేశారు. సామ్యవాద సూత్రాలను నిర్ములించేందుకు ఇటువంటి పనులు చేస్తున్నాడు. గాంధీ నశించాలి, కాంగ్రెస్ నశించాలి” అని ప్రకటించారు. కానీ మన జాతీయ నాయకులు, దేశ ప్రేమికులు ఇటువంటి స్పందనలను పట్టించుకోలేదు. వాళ్ళు ఏ విషయాల పట్ల ముందు వెనుక, లాభ నష్టాలు గ్రహించలేదు. పట్టించుకోలేదు. దీపం పట్టుకుని బావిలో పడ్డ వాళ్ళ మాదిరిగా, పెద్ద రాయికి ఎదురొడ్డే సవాలును స్వీకరించే వాళ్ళలాగా, ఉప్పు సత్యాగ్రహం విషయంలో గుడ్డిగా అత్యుత్సాహం ప్రదర్శించారు. జైలుకు వెళ్లి ‘విజయ గర్వం’తో వెనుదిరిగారు. దానికి సంబంధించిన గౌరవాన్ని అంగీకరించారు. కానీ ఇప్పుడు భగత్ సింగ్‌ని ఉరి తీసిన తర్వాత, ‘గాంధీ నశించాలి’ ‘కాంగ్రెస్ నశించాలి’ అని నినదిస్తున్నారు. ఇటువంటి నడత వలన ఎటువంటి ప్రయోజనం ఉందో అసలు అర్థం కావడం లేదు.
మాకు సంబంధించినంత వరకు నిజం చెప్పాలంటే వీళ్లంతా ఈ గడ్డపై పుట్టిన మూర్ఖులు. వాళ్ళు కార్యక్రమాలు రూపొందించేటప్పుడు ముందు వెనుక ఆలోచించరు. ఆ కార్యక్రమాల ద్వారా వచ్చే లాభ నష్టాలను చూసుకోరు. స్వార్ధంతో కేవలం వాళ్ళ వ్యక్తిగత గౌరవం కోసమే ఆలోచిస్తారు. భగత్ సింగ్ ఉరికంబమెక్కడం మంచిదయింది అనిపిస్తుంది. ఒకవేళ భగత్ సింగ్ ఎక్కువ కాలం బతికి ఉంటే, అటువంటి ప్రజల చేతిలో బాధకు గురై ఉండేవాడు. చనిపోయి భగత్ సింగ్ ‘శాంతి’ పొందాడు. నాకు అటువంటి అరుదైన అవకాశం రాలేదని బాధ పడుతున్నాను.
ఈ సందర్భంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అసలు అంశం ఏంటంటే ఒక మనిషి తన కర్తవ్యం నిర్వర్తించాడా లేదా? పూర్తి చేశాడా లేదా? అంతేగానీ ఆ పని ఫలితాలను ఇచ్చిందా లేదా అనేది అంశం కాదు. స్థల కాలానుగుణంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని మనమందరము ఒప్పుకుంటాము. భగత్ సింగ్ ఎత్తిపట్టిన సిద్ధాంతానికి కాలం, స్థలం, సాధారణ ధోరణులు వ్యతిరేకమైనవి కావని మనందరికీ ఖచ్చితంగా తెలుసు. తన సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఎంచుకున్న మార్గంలో తప్పుచేసాడు అని నాకు అనిపించినా, అతను ఎంచుకున్న సిద్ధాంతం తప్పని చెప్పే ధైర్యం ఎప్పటికీ చేయను. ప్రపంచంలో శాంతి విజయవంతం కావాలంటే ఆ సిద్ధాంతం ద్వారా మాత్రమే సాధ్యం.
ఒక వేళ భగత్ సింగ్, అతను నమ్మిన సిద్ధాంతాలు సరి అయినవని, అతను ఎంచుకున్న దారి, నడిచిన పద్ధతి న్యాయమైనవి అనే బలమైన ముగింపుకు వచ్చినట్లయితే, అప్పుడు అతను ఏ పద్ధతినైతే నమ్మాడో, ఎలాగయితే నడిచాడో, అలాగే మాత్రమే చేయాల్సింది. అదే అంతిమం. ఒక వేళ అలా ప్రవర్తించకుండా ఉంటే, అతను నిజాయితీపరుడు అని చెప్పే వాళ్ళం కాదు. ఇప్పుడు భగత్ నిజమయిన మనిషి, నిజాన్ని నమ్మిన మనిషి అని మనం చెప్పొచ్చు. నిజానికి భారత దేశానికి భగత్ సింగ్ సిద్ధాంతం మాత్రమే కావాలి అనేది మా బలమైన విశ్వాసం. మాకు తెలిసినంత వరకు, సామ్యవాదం, కమ్యూనిజం సిద్ధాంతాలకు భగత్ సింగ్ ప్రతినిధి. పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్‌కి రాసిన ఉత్తరంలో అతని ప్రాపంచిక దృక్పధానికి సాక్ష్యంగా ఈ కింది విధంగా రాశాడు, కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు, ప్రజల్లో అసమానతలు అంతరించేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మమ్మల్ని చంపడం ద్వారా పోరాటానికి ముగింపు పలకలేరు. అది బహిరంగంగా, రహస్యంగా కొనసాగుతూనే ఉంటుంది.”
పైగా, భగత్ సింగ్‌కు దేవునిపైన, దైవిక వితరణ పైన ఎలాంటి నమ్మకం లేదు. అతను స్వయం విశ్వాసం కలిగిన ఒక మనిషి అని అనుకుంటాను. అటువంటి ప్రాపంచిక దృక్కోణం, ఆలోచన కలిగి ఉండటం ఏ చట్టం ప్రకారం నేరం కాదు. ఒకవేళ చట్టవ్యతిరేకమైనదిగా పరిగణింపబడినా భయపడాల్సిన అవసరం లేనే లేదు ఎందుకంటే భగత్ సింగ్ ఎత్తిపట్టిన సిద్ధాంతాలను పాటించడం ద్వారా ప్రజలకు ఎటువంటి హాని కలుగదు. ఒక వేళ జరిగితే అది అప్రయత్నంగా/యాధృచ్ఛికంగా జరిగినదే. ఆ సిద్ధాంతాలను వ్యక్తుల పట్ల, సమూహాల పట్ల, ఎక్కడి ప్రజల పట్ల నైనా ఎటువంటి విరోధ భావన లేకుండా మనస్ఫూర్తిగా ఆచరిస్తాం. ఎవరినీ గాయ పర్చకుండా మా పనిని చేస్తాం. మేము చేపట్టిన కార్యక్రమం కోసం ఎంతటి బాధనైనా అనుభవించడానికి సిద్దమే. కాబట్టి మనం దేని గురించైనా బాధపడాల్సిన అవసరం లేదు, దేనికీ భయపడాల్సిన అవసరం లేదు.
అంటరానితనాన్ని అంతమొందించాలనే తత్త్వం, పేదరికాన్ని అంతమొందించాలనే తత్వానికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. రెంటి మధ్య గొప్ప సారూప్యత ఉంది. అంటరానితనం అంతమొందించాలంటే మొదటగా ఎక్కువ కులం, తక్కువ కులం అనే భావనను, విలువను అంతమొందించాలి. అలాగే పేదరికాన్ని అంతమొందించాలంటే సమాజాన్ని పెట్టుబడిదారులు, శ్రామికులుగా విభజిస్తున్న విలువలను (సూత్రాలను) ధ్వంసం చేయాలి. ఆ అసమానతలను ధ్వంసం చేస్తూ వాటిని అంతమొందించాలనే విలువలను ఎత్తి పట్టేదే సామ్యవాదం, కమ్యూనిజం. భగత్ సింగ్ ఈ సిద్దాంతానికి కట్టుబడి ఉన్నాడు. ఇటువంటి విలువలు న్యాయమయినవని, సరైనవని భావించిన వాళ్ళు సహజంగా గాంధీని, కాంగ్రెస్‌ని ఖండిస్తారు. అవి పతనమవ్వాలని ఆశిస్తారు. ఇక్కడ వింతేమిటంటే ఆ విలువలు సరైనవని మద్దతిస్తున్న వాళ్ళు గాంధీని, కాంగ్రెస్‌ని పొగుడుతున్నారు.
దేవుడు మాత్రమే తనకు మార్గదర్శకత్వం చేస్తాడని, ప్రాపంచిక వ్యవహారాలను పాలించేందుకు వర్ణాశ్రమ ధర్మం మాత్రమే అత్యున్నత వ్యవస్థ అని, దేవుని ఆజ్ఞ ద్వారా మాత్రమే ఏదైనా జరుగుతుందని గాంధీ చెప్పిననాడే గాంధీ వాదానికి, బ్రాహ్మణ వాదానికి మధ్యలో ఎటువంటి తేడా లేదని, రెండూ ఒకటేనని ముగింపుకు వచ్చాం. అటువంటి సిద్దాంతానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీని రద్దు చేస్తే కానీ దేశానికి మంచి జరగదు. ఇప్పుడు అతి కొద్ది మంది అయినా ఈ విషయాన్ని పసిగట్టారు. గాంధేయవాదం పతనం అవ్వాలనే తెలివిని, ఆ పిలుపునిచ్చే ధైర్యాన్ని తెచ్చుకున్నారు. ఇది మా ఆశయ సాధనకు ఒక గొప్ప విజయం. ముందడుగు. భగత్ సింగ్‌ను ఉరి తీయకపోయుంటే, అతని బలిదానం లేకుంటే ఈ విజయం ఇంతగా జనంలోకి చొచ్చుకుని పోయే ఆస్కారమే లేకుండే. ఇంకో అడుగు ముందుకేసి ఏం చెపుతానంటే ఒకవేళ భగత్ సింగ్ తన ప్రాణాలను బలిచేయకపోయుంటే (ఉరి తీయకపోయుంటే) గాంధేయవాదం ఇంకా బలంగా పాతుకుపోయి ఉండేది. ఇంకా గొప్ప విజయం సాధించేది.
సామాన్య ప్రజల లాగే భగత్ సింగ్ జబ్బు పడి బాధను అనుభవించి చనిపోలేదు. భారత దేశానికే కాదు... మొత్తం ప్రపంచానికి కూడా అసలైన సమానత్వానికి, శాంతికీ దారి చూపించే గొప్ప కారణం కోసం, తన విలువైన ప్రాణాలను అర్పించాడు. సాధారణంగా ఎవరూ అందుకోలేని అత్యున్నత శిఖరాలను అతను చేరుకున్నాడు. మా గుండె లోతుల్లోంచి అతని అమరత్వాన్ని పొగుడుతాం. పాటై పాడుతాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మాదో విన్నపం. ప్రతి ప్రావిన్స్‌లో భగత్ సింగ్ లాంటి వాళ్ళను గుర్తించి, అటువంటి ధైర్యాన్ని నేరంగా గుర్తించి నెలకు నలుగురి చొప్పున ఉరి తీయాలని మా మనవి.
భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ ఇవి పెరియార్ 'కుడి అరసు' పత్రికలో 1931 మార్చి 29న సంపాదకీయం రాశారు. ఆ సంపాదకీయాన్ని ఇంగ్లీష్‌లోకి రెండు సార్లు అనువాదం చేశారు. వి. గీత, ఎస్వీ రాజాదురైలు అంబేడ్కర్ టుడే ఆన్లైన్ న్యూస్ పోర్టల్‌కి గాను ఈ సంపాదకీయాన్ని అనువాదం చేశారు. అలాగే రెవల్యూషనరీ డెమోక్రసీ అనే ఆన్లైన్ పోర్టల్‌కి ఆసాన్ అనువదించారు. ఈ రెండు అనువాదాలు పెరియార్ సంపాదకీయం పూర్తి సారాన్ని రెండు రూపాలలో తీసుకొచ్చాయి. ఈ రెండింటిని చదివి పరిశీలించి నేను చేసిన అనువాదం ఇది.
(భగత్ సింగ్ అమరత్వంపై ఇ.వి పెరియార్ ‘కుడి అరసు’ పత్రికలో 1931 మార్చి 29న రాసిన సంపాదకీయం)
డా. సతీష్ నైనాల
గీతం యూనివర్సిటీ
99666 14142
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672