- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్రీడా కురుక్షేత్రమే ఒలింపిక్స్
జీవితంలో ముఖ్యమైన విషయం జయించడమే కాదు, బాగా పోరాడడం కూడా. ఇదే క్రీడలకు కూడా వర్తిస్తుంది. ఏ క్రీడ అయినా గెలుపొందడం కంటే పాల్గొనడం చాలా ముఖ్యమని ఆయన ప్రధాన సందేశం. ఒకవేళ ఓటమి చవి చూసినా క్రీడా స్ఫూర్తితో ఆ క్రీడను ఆస్వాదిస్తారు. ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు పియరీ డి కూబెర్టిన్ ప్రధాన ఆశయం కూడా ఇదే. మొదటి స్థానంలో నిలబడటం అనే ఆత్రుత పక్కన పెట్టి పాల్గొనడం, బాగా ఆడటం క్రీడల ఆశావాద దక్కోణంగా క్రీడాకారులందరూ గుర్తించాలనేది ఒలింపిక్ క్రీడల ప్రధాన సందేశం. ప్రపంచాన్ని మార్చే శక్తి, స్ఫూర్తినిచ్చే శక్తి క్రీడలకు ఉంది. అంతే కాదు మరెవ్వరూ చేయని విధంగా ప్రజలను ఏకం చేసే శక్తి క్రీడలకు ఉంది. దీనిని నిరూపిస్తూ నిర్వహిస్తున్న క్రీడలే ఒలింపిక్ క్రీడలు. ఎన్నో క్రీడలు.. మరెన్నో దేశాలు.. ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లందరూ కలిసి పోటీపడే విశ్వ వేదిక ఒలింపిక్స్. ఆటలాడే ప్రతి దేశానికి ఆశల సౌధం అది! క్రీడాకారుల ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం అది! పతకం నెగ్గి తమ దేశ జెండా ఎగురుతుంటే పోడియం మీద గర్వంతో రొమ్ము విరుచుకు నిలబడాలని కోరుకునే.. క్రీడా కురుక్షేత్రమే ఒలింపిక్స్
ఐదు ఖండాలను ఒక్కతాటిపైకి తెస్తూ.. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఆటల పండుగది దశాబ్దాల ఘన వారసత్వం.14 దేశాలు, 241 అథ్లెట్లతో మొదలైన ఆధునిక ఒలింపిక్స్ ఇప్పుడు 200 పైచిలుకు దేశాల నుంచి 11 వేల క్రీడాకారులతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా వేడుకగా మారింది. అందుకే ఒలింపిక్స్ విశ్వ వ్యాప్తంగా ఆదరణ పొందింది ఈ విశ్వ క్రీడల కోసం క్రీడా ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తుంది. ఇందులో తమ క్రీడాకారులు ఆడాలని పతకాలు గెలవాలని, వేదికపై తమ దేశ జెండా ఎగరాలని ప్రతి దేశం కోరుకుంటుంది. మరెన్నో దేశాలు ఒట్టి చేతులతోనే తిరిగొస్తున్నాయి. అయినా పోటీ పడడమే గొప్ప అనుకుంటాయి. అంత గొప్పది ఒలింపిక్స్ విశ్వ క్రీడలకు 3000 ఏండ్ల చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం 776 లోనే ఒలింపిక్స్ ప్రారంభమైనాయి . క్రీస్తు శకం 393 తర్వాత ఆగిపోయాయి. వాటిని ప్రాచీన ఒలింపిక్ క్రీడలు గా పిలిచారు. మళ్లీ 1896లో మొదలై, నాలుగేళ్లకోసారి జరుగుతున్నాయి. వీటిని ఆధునిక ఒలింపిక్స్ అంటున్నారు. ఇవి ప్రపంచ యుద్ధాల సమయంలో (1914, 1940, 1944) ఆగిపోగా.. కరోనా కారణంగా ఒక ఏడాది ఆలస్యంగా మొదలయ్యాయి.
ఒలింపిక్స్ పుట్టుక వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దంలో గ్రీకు సామ్రాజ్యంలోని రాజ్యాల మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్లు. గ్రీకు సామ్రాజ్యంలో ఎప్పుడు అశాంతి ఉండేది. దాంతో, ఈ యుద్ధాలు ఆపి, రాజ్యాల మధ్య శాంతి నెలకొల్పాలని గ్రీకులు అనుకున్నారు. అందుకు రాజ్యాల మధ్య ఆటలు ఆడించడమే మంచిదని నిర్ణయించారు. అలా క్రీస్తు పూర్వం 776లో తొలిసారి దక్షిణ గ్రీసులో ఒలింపియా అనే ప్రాంతంలో ఆటల పోటీలను నిర్వహించారు. క్రమంగా దానికి ఒలింపిక్స్ అనే పేరొచ్చింది.
యుద్ధాలను ఆపిన ఒలింపిక్స్
ప్రతి నాలుగేండ్లకోసారి నిర్వహించే ఈ ఈ క్రీడా పోటీలు జరిగేటప్పుడు యుద్ధాలు ఆపేవారు. ప్రజలు తమ పనులన్నీ పక్కన పెట్టి మరీ.. క్రీడలు జరిగే పట్టణానికి వచ్చేవాళ్లు. కానీ, రోమ్ చక్రవర్తి థియోడోసియస్ గ్రీస్ సామ్రాజ్యాన్ని జయించాక అన్ని ఉత్సవాలను నిలిపివేశాడు . దాంతో, క్రీస్తు శకం 393 లో ఒలింపిక్స్ కూడా ఆగిపోయినయ్. అయితే, ఫ్రాన్స్కు చెందిన చరిత్రకారుడు చార్లెస్ పియెర్ డి ఫ్రెడీ, బెరోన్ డి కోబర్టీన్ ఒలింపిక్స్ మళ్లీ మొదలు పెట్టేందుకు కృషి చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)ని 1896లో స్థాపించారు. వీళ్ల కృషి వల్ల., ప్రాచీన క్రీడలు ఆగిన ప్రదేశం ఏథెన్స్ లోనే 1896లో ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైనాయి ఈ క్రీడోత్సవంలో 14 దేశాలకు చెందిన 241 అథ్లెట్లు పోటీ పడ్డారు. వాళ్లంతా పురుషులే. పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా నాలుగేళ్లకోసారి గేమ్స్ నిర్వహిస్తున్నారు. ఆధునిక ఒలింపిక్స్ అధికారిక క్రీడలుగా గుర్తించగా... ఇప్పటిదాకా 28 సార్లు జరిగాయి. ప్రపంచ యుద్ధాల కారణంగా మూడు సార్లు రద్దయ్యాయి.
రెండు కళ్లు చాలవు
పది, పదిహేను దేశాలు పోటీపడే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీనే హంగామాగా ఉంటుంది. అలాంటిది పదుల సంఖ్యలో జరిగే క్రీడలు ఒక్కచోట జరిగితే.. వందల దేశాలు, వేలాది మంది ఆటగాళ్లు ఒకే వేదికపై పోటీపడితే మామూలుగా ఉంటదా! పైగా, ఆ క్రీడోత్సవం నాలుగేళ్లకోసారి జరిగితే.. దానికోసం ఆతిథ్యమిచ్చే దేశం వేలాది కోట్లు ఖర్చు పెడితే.. పోటీల కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు! ఒలింపిక్స్ ఉండే ఆదరణ అది. ఎప్పట్లాగే, ఈసారి కూడా పారిస్ ఒలింపిక్స్ కోసం అంత ఆతృత. ఎవరెలా ఆడతారు ఏ దేశం హవా నడుస్తోంది ఎన్ని రికార్డులు బద్దలవుతాయనే లెక్కలేసుకున్నారు.
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా వేడుక
విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ ఈ నెల 26 నుంచే. పారిస్ వేదికగా అంగరంగ వైభవంగా క్రీడలను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఎప్పట్లాగే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా ఒలింపిక్స్‌కు సిద్ధమైంది. గత పర్యాయం తో పోలిస్తే ఈసారి ఒలింపిక్స్లో పోటీపడే అథ్లెట్ల సంఖ్య తగ్గింది. సంఖ్య తగ్గినా ఒలింపిక్స్ లో 124 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.. కాబట్టి ఈసారి టోక్యోకు దీటుగా పతకాలు సాధించగలమనే ధీమా భారత బృందంలో ఉంది.
2021లో జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్ సువర్ణాధ్యాయాన్ని నిఖించిన నీరజ్ చోప్రా మరోసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు. గత క్రీడల్లో కాంస్యం సాధించిన హాకీ జట్టు ఈసారి పతకం రంగు మార్చాలనే పట్టుదలతో ఉంది. 2016, 2021లో నిరాశపరిచిన షూటర్లు ఈసారి పతకాలు కొల్లగొట్టాలనే కసితో ఉన్నారు. ఇంకా బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్లోనూ పతకాశలు రేపుతున్న క్రీడాకారులు చాలామందే ఉన్నారు. మరి ఈ బృందం అంచనాలను అందుకుంటుందా పతకాల సంఖ్యను రెండంకెలకు తీసుకెళ్తుందా ’ఐక్యత మరియు స్థితిస్థాపకత’. ఆనే నినాదం తో పారిస్ వేదికగా జులై 26 నుండి జరగబోయే ఒలింపిక్స్‌లో క్రీడాభిమానులు, నిపుణుల అంచనాలకు అనుగుణంగా మన క్రీడాకారులు భారత్ పతాకాన్ని పారిస్ వినువీధుల్లో గర్వంగా ఎగురవేస్తారని, పతకాల పంట పండిస్తారని ఆశిద్దాం.
వాడవల్లి శ్రీధర్
99898 55445