- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
న్యాయమూర్తుల తీర్పుల్లో అభ్యంతరాలు..
ఈ మధ్య కాలంలో న్యాయవ్యవస్థ విపరీతమైన విమర్శకు గురవుతున్నదనేది వాస్తవం. ఇందుకు కారణం తీర్పులు వెలువరించటంలో జరిగే అసాధారణ జాప్యం. కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కేసు తీర్పును రిజర్వు చేసి, నెలల తరబడి తీర్పు వెలువరించక పోవడంతో సంబంధిత కక్షిదారులకి ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి ఏర్పడుతుంది. సంబంధిత పిటిషన్‌లో వాదనలు ముగిసిన పిదప ఎంత కాలంలోగా హైకోర్టులు తీర్పులు వెలువరించవలసి ఉంటుందనే దానిపై చట్టాలచే నిర్దేశించబడిన నిబంధనలు ఏవీ లేవు. కానీ, ఈ విషయంలో సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా హైకోర్టులకు స్పష్టంగా ఎన్నోసార్లు మార్గదర్శకాలు సూచించింది.
ఒక సందర్భంలో, అలహాబాద్ హైకోర్టు వాదనలు విని తీర్పు వెలువరించక అసాధారణ జాప్యం చేసిన విషయం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకపోగా, ఏదేని హైకోర్టు న్యాయమూర్తి వాదనలు ముగిసిన కాలం నుండి ఆరు నెలల్లోగా తీర్పు చెప్పక పోయినట్లయితే, సంబంధిత ప్రధాన న్యాయమూర్తి ఆ కేసును మరో న్యాయమూర్తికి కేటాయించాలని ఉత్తర్వు లిచ్చింది. ఆ న్యాయమూర్తి వాదనలు విని తీర్పు చెప్పాలి. ఇంతవరకు బాగానే ఉంది కానీ, మరో న్యాయమూర్తి ముందు మరోసారి తాజాగా వాదనలు అంటే, కక్షిదారులకు ఖర్చుతో కూడుకున్న పని.
తీర్పు వెల్లడి కుదరకపోతే..
ఉదాహరణకు గుజరాత్ హైకోర్టు వెలువరించిన ఒక తీర్పును సుప్రీంకోర్టు ముందుకు కక్షిదారుడు తీసుకుని వెళ్లాడు. ఆ వివరాల్లోకి వెళితే, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి 2023 మార్చి 1న ఒక కేసులో వాదనలు విని ఈ కేసు ‘కొట్టివేయబడింది’ అంటూ ముగించారు. కానీ కేసును కొట్టివేయడానికి గల కారణాలతో కూడిన తీర్పు వెలువరించే తేదీ విషయం ప్రస్తావించలేదు. తీర్పును కోర్టులో నూ డిక్టేట్ చేయలేదు. ఇదిలా ఉండగా, దాదాపు సంవత్సరం తర్వాత అనగా 2024 ఏప్రిల్ 30 తేదీన కక్షిదారుడికి కారణాలతో కూడిన తీర్పు సాఫ్ట్ కాపీ హైకోర్టు ద్వారా అందించబడింది. అయితే అందులోని తీర్పు తేదీ 2023 మార్చి 1వ తేదీగా ఉంది. కక్షిదారుడు చెప్పిన ఈ వాదనలో నిజా నిజాలు తెలుసుకోడానికి సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుండి నివేదిక తెప్పించుకుని పరిశీలించింది. అంతేకాకుండా 2023 మార్చి 1 తేదీకి సంబంధించి వీడియో రికార్డ్ చేయబడిన కోర్టు ప్రొసీడింగ్స్‌ను కూడా పరీక్షించి, పాత తేదీతో తీర్పును ఏప్రిల్ 30న వెలువరించినట్లు నిర్దారించింది.
తీర్పు వెల్లడిలో జాప్యం ఉల్లంఘనే...
దీంతో సుప్రీంకోర్టు ఆ ఆక్షేపిత తీర్పును పక్కకు పెడుతూ, కేసును తాజాగా విచారించి తీర్పు ఇవ్వటానికి మరో న్యాయమూర్తికి కేటాయించాల్సిందని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హైకోర్టు కేసులోని వాదనలు ముగిసిన పిదప, సమయాభావం వల్లే, తీర్పులోని తుది ఫలితాన్ని మాత్రమే ప్రకటించాలనే అభిప్రాయానికి వచ్చినట్లయితే, కారణాలతో కూడిన పూర్తి తీర్పును రెండు నుండి ఐదు రోజుల్లో గా ప్రకటించాలని ఆదేశమిచ్చింది. లేదా తీర్పును రిజర్వు చేస్తూ, 6 నెలల్లోగా పూర్తి తీర్పును వెలువరించాలని పేర్కొంది. ఒకవేళ ఇలా జరగకపోతే కక్షిదారులకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా ఒసగిన హక్కును కోర్టు ఉల్లంఘన చేసినట్లవుతుందని అభివర్ణించింది. పైగా హైకోర్టులకు గతంలోనే మార్గదర్శకాలను నిర్దేశించినప్పటికీ మరోసారి గుర్తు చేస్తున్నామని ఒక తీర్పులో ఆవేదన వ్యక్తపరచింది.
వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తపరచవద్దు!
ఇక కొందరు న్యాయమూర్తులు కేసుల విచారణ సందర్భంలో బహిరంగంగా అనవసర, అభ్యంతరకర వ్యాఖ్యానాలు చేస్తూ ప్రజల దృష్టిలో చిన్న చూపుకు గురవుతున్నారు. ఒక హైకోర్టు న్యాయ మూర్తి ఒక కేసు విచారణ సందర్భంలో, భారత దేశంలోని ఒక భూభాగాన్ని పాకిస్తాన్‌గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతిస్పందిస్తూ హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడే ప్రతి మాట ప్రజలకు కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చేరుతుందని, ఒక మతాన్ని లేదా ఒక ప్రాంతాన్ని పక్షపాత వైఖరితో మాట్లాడటం భావ్యం కాదని సలహా ఇచ్చింది. అలాగే ఒక హైకోర్టు న్యాయమూర్తి యువతుల లైంగిక ప్రవర్తనపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తీర్పులో ప్రస్తావించగా, న్యాయమూర్తులు తీర్పుల్లో కేసుకు సంబంధం లేని తమ వ్యక్తిగత అభిప్రాయాలు పేర్కొ నడం సముచితం కాదని సుప్రీంకోర్టు ఆ హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు కేసుకు సంబంధించిన ఆరోగ్యకరమైన వ్యాఖ్యలు అయితే ఎవరూ తప్పు పట్టవలసిన అవసరం లేదని పేర్కొనింది.
అర్థమయ్యే విధంగా తీర్పు ప్రతి ఉండాలి!
అదే విధంగా, ప్రతి విషయానికి ప్రభుత్వ అధికారులను కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలివ్వటం, తద్వారా ప్రభుత్వ అధికారుల రోజువారీ కార్యకలాపాలకు భంగం కలగచేయటం తగదని, అత్యవసరమైతేనే హాజరుకు ఆదేశాలివ్వాలని కోర్టుల తీర్పులు ఉన్నాయి. అలాగే కోర్టులు వెలువరించిన తీర్పు కక్షిదారుడికి అర్థమయ్యే విధంగా ఉండాలే తప్ప, డాంబికమైన ఇంగ్లిషు భాష కాదని గౌరవ సర్వోన్నత న్యాయస్థానం నొక్కి వక్కాణించింది. ఇంగ్లిషు భాషపై పట్టు లేకుండానే ప్రతి ఒక్కరూ జస్టిస్ కృష్ణయ్యర్‌ను అనుకరించాలనుకోవడం లేదా పోటీపడటం ఏ విధంగానూ హర్షించదగిన విషయం కాదు. చివరకు ఆ తీర్పు న్యాయమూర్తులకే అర్ధం కాని విధంగా తయారవుతుందని కోర్టుల తీరు తెన్నులను పరిశీలించే వారి అభిప్రా యం. ఒక మహిళా న్యాయవాది ఉన్నత న్యాయస్థా నం ఇచ్చిన తీర్పుపై ప్రస్తావిస్తూ తాను ఆ తీర్పును అర్ధం చేసుకోవడానికి ఒక ఇంగ్లిష్ ప్రొఫెసర్‌ను అద్దెకు నియమించుకోవాల్సి ఉంటుందని, ఒక్కో వాక్యం ఫుల్ స్టాప్ అనేది లేకుండా ఒక పేజీ మొత్తంగా ఉందని వ్యాఖ్యానించిందట. అందుకే కో ర్టులు వెలువరించిన తీర్పు ఇరుపక్షాలను అయోమయానికి గురి చేయకుండా స్పష్టతతో కూడినదై ఉం డాలని, మితిమీరిన జాప్యం ఉండొద్దని ప్రతి కక్షిదారుడు కోరుకోవడంలో మరో ఆలోచన ఉండకూడదు.
తడకమళ్ళ మురళీధర్,
విశ్రాంత జిల్లా జడ్జి,
98485 45970