నిరుద్యోగులతో పరిహాసమా?

by Ravi |   ( Updated:2023-04-27 23:15:30.0  )
నిరుద్యోగులతో పరిహాసమా?
X

చ్ఛే దిన్‌ ఆయేగా, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, అమృత్‌ కాల్‌... ఇలా మోడీ సర్కార్ నినాదాలకు కొదవ లేదు. కానీ మంచి రోజులన్నీ అదానీ, అంబానీలకే వచ్చాయని ఇప్పటికే జనం నిర్ణయానికి వచ్చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సంగతి సరే!, ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులైనా భర్తీ చేయండి మహాప్రభో అని యువత ఘోషిస్తున్నది.

దేశంలో నిరుద్యోగ రేటు 7.5 శాతానికి పెరిగిపోయింది. పట్టణాల్లో 8.7 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 7 శాతం ఉందని సీఎంఐఈ నివేదిక తాజాగా వెల్లడించింది. దేశంలో నిరుద్యోగులకు ఆశాకిరణంలా ఉండే రైల్వే ఖాళీలను భర్తీ చేయకుండా తొక్కిపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి మూడు లక్షల 15 వేల 780 ఖాళీలున్నట్లు భారత రైల్వే మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలే చెబుతున్నాయి. గత మూడేళ్లలో 1,41,886 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు.

ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కేటగిరీల్లో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు సైతం 18,670 ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది మార్చి 1 నాటికి దేశంలో 9.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా తెలిపింది. గత ఏడాది చివరి నాటికి రైల్వే, హోం వ్యవహారాల్లో 1.4 లక్షల ఉద్యోగాలు, సివిల్‌ డిఫెన్స్‌లో 2.6 లక్షల ఉద్యోగాలు, తపాలా శాఖలో 90 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి.

అగ్నివీర్‌ నియామకాల పేరుతో ఆర్మీ ఉద్యోగాలను సైతం నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతికి దిగజార్చారు. నయా ఉదారవాద విధానాలు అనుసరిస్తూ అదానీ, అంబానీ లాంటి దేశ, విదేశీ కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్ర సర్కారుకు దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగిత గురించి ఏమాత్రం ఫికర్‌ లేదు.

దేశంలో వినియోగ వ్యయం తదితర అంశాలపై గణాంకాలు 2011-12 నుంచి అందుబాటులో లేవు. 2017-18లో సేకరించిన వివరాలను సైతం విడుదల చేయకుండా కేంద్రం తొక్కిపట్టింది. ఉపాధికి సంబంధించిన గణాంకాల సేకరణకు అనుసరించే పద్ధతికి తిలోదకాలు ఇచ్చేసింది.

నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) అందించిన వివరాల ప్రకారం 2011-12 నుంచి 2017-18 మధ్య గ్రామీణ భారతదేశంలో తలసరి వాస్తవ నెలవారీ వ్యయంలో తొమ్మిది శాతం క్షీణత నెలకొంది. మన ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్న, ప్రముఖ ఆర్థిక నిపుణులతో కూడిన ప్రైవేటు సంస్థ సీఎంఐఈ నివేదికలే ఆధారం. ఆ సంస్థ గొంతు నొక్కేందుకు కేంద్రం యత్నిస్తోంది.

తాజాగా ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం గత నాలుగేళ్లలో 10.25 లక్షల కొత్త ఉద్యోగాలే లభించాయి. అంటే ఏటా 0.3 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. ఇది జనాభా పెరుగుదల రేటుతో పోలిస్తే చాలా తక్కువ. నిరుద్యోగుల సంఖ్య ఏటా 1.2 కోట్ల మేర పెరుగుతుందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 2019 మార్చిలో 42.7 శాతంగా ఉన్న కార్మిక భాగస్వామ్య రేటు గత నెల నాటికి 39.8 శాతానికి దిగజారింది.

వేతనాలు తక్కువ, ఉద్యోగ భద్రత లేకుండా పోవడంతో మహిళలు ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కోవడం తగ్గించారు. నిర్మాణ రంగంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. రిటైల్‌ వ్యాపారంలోనూ ఇదే పరిస్థితి. ఫిబ్రవరి, మార్చి మధ్య 80 లక్షల మంది రోడ్డున పడ్డారు. కాయకష్టం చేసే వారి పరిస్థితి గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి రైల్వేల్లో ఖాళీలను భర్తీ చేయాలి.

మేకల రవి కుమార్

82474 79824

Advertisement

Next Story