విదేశాలకు కుబేరులు

by Ravi |   ( Updated:2023-06-18 01:15:28.0  )
విదేశాలకు కుబేరులు
X

భారత మిలియనీర్ల కుటుంబాలు దుబాయ్, సింగపూర్‌ లాంటి ఆకర్షణీయ, అత్యాధునిక దేశాలకు వలస బాట పడుతున్నాయనే ఆశ్చర్యకర విషయాన్ని ‘హెన్లీ ప్రైవేట్‌ వెల్త్‌ మైగ్రేషన్‌’ విడుదల తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. ఈ కారణంగానే ‘గోల్డెన్‌ వీసా’ ద్వారా దుబాయ్‌ని ‘భారత 5వ నగరం’గా (ఫిఫ్త్‌ సిటీ ఆఫ్‌ ఇండియా) పిలవడం పరిపాటి కావడం మనకు తెలుసు. 2023లో 6,500 భారతీయ మిలియనీర్ ధనవంతులు (హై నెట్‌ వర్త్‌ ఇండియన్స్‌, హెచ్‌ఎన్‌ఐ లేదా అధిక నికర ఆస్తుల విలువ కలిగిన వ్యక్తులు) తమ మాతృభూమిని వదిలి విలాసవంతమైన జీవితాలను వెతుక్కుంటూ విదేశాలకు వలసలు వెళుతున్నారని నివేదిక. ఒక మిలియన్‌ డాలర్లు (రూ 8.2 కోట్లు) లేదా అంతకన్న ఎక్కువ సంపద కలిగిన వ్యక్తులను హై నెట్‌ వర్త్‌ ఇండియన్స్‌ లేదా హెచ్‌ఎన్‌ఐ వర్గం కిందికి వస్తారు.

ఆ వలసలకు కారణాలు

ఇండియాలో కఠిన పన్నుల విధానం, నాణ్యమైన జీవన ప్రమాణాలు, భద్రత కలిగిన జీవితం, శాంతిభద్రతలు, కాలుష్య రహిత ఆరోగ్యకర ఆహ్లాదకర వాతావరణం, ఆస్తుల రక్షణ, తక్కువ పన్నులు, పిల్లలకు నాణ్యమైన చదువులు, ఆధునిక వైద్య వసతులు, రాజకీయ నైతికత స్థిరత్వం, వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛ, అవినీతి రహిత పారదర్శక పాలన లాంటి కారణాలతో భారతీయ ధనిక వర్గాలు సరిహద్దులు దాటి జన్మభూమిని వదలడం గమనిస్తున్నాం. విదేశాల్లో భారీ పెట్టుబడులు పెట్టే భారతీయులకు విదేశాలు సులభంగా పౌరసత్వం ఇవ్వడం కూడా ధనికుల వలసలకు ఊతం ఇస్తున్నట్లు తెలుస్తున్నది.

విదేశీ వలసల లెక్కలు..

2023లో అత్యధిక కుబేరుల విదేశీ వలసలు నమోదైన 20 దేశాల్లో అగ్ర భాగాన చైనా నుంచి 13,500 మంది, ఇండియా నుంచి 6,500 మంది, యూకే నుంచి 3,200, రష్యా నుంచి 3,000 మంది, బ్రెజిల్‌ నుంచి 1,200 మంది, హాంకాంగ్‌ నుంచి 1,000 మంది ధనవంతులు విదేశాలకు వలస క్యూ కట్టారని తెలుస్తున్నది. చైనాలో 7.8 లక్షలు, ఇండియాలో 3.45 లక్షల మిలియనీర్లు ఉన్నట్లు అంచనా. భారతీయ మిలియనీర్ల వలసలు గత ఏడాదితో పోల్చితే యూకేలో రెట్టింపు కావచ్చని అంచనా వేస్తున్నారు. ‌శాశ్వతంగా విదేశాల్లో స్థిరపడటానికి భారతీయ కుబేరులు ఆస్ట్రేలియా(5,200 మంది), యూఏఈ(4,500 మంది), సింగపూర్(3,200 మంది)‌, యూయస్(2,100 మంది)‌, స్విట్జర్లాండ్‌(1,800 మంది) దేశాలను ఇష్టపడుతున్నట్లు గమనించారు.

భారతీయ కుబేరులు

ఇండియాలో ఒక మిలియన్‌ డాలర్ల కన్న అధిక సంపద కలిగిన వ్యక్తుల అల్ట్రా రిచ్ వర్గంలో 3.45 లక్షల‌ మంది, 100 మిలియన్‌ డాలర్ల కన్న అధిక సంపన్నులు 1,078 మంది, బిలియన్‌ డాలర్ల కన్న అధికంగా 123 మంది భారతీయులు ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2031 నాటికి అత్యంత అభివృద్ధి రేటును నమోదు చేస్తున్న భారతంలో 80 శాతం మిలియనీర్లు పెరగవచ్చనే వార్త సంతోషదాయకంగా నిలుస్తున్నది. నేడు ఇండియాలో క్రమంగా జీవన ప్రమాణాలు పెరగడంతో విదేశాల నుంచి భారతీయ ధనికులు తిరిగి తమ మాతృభూమికి వలసలు రావచ్చని కూడా విశ్లేషిస్తున్నారు. భారతీయ మిలియనీర్ల విదేశీ వలసలు కన్న అధికంగా కొత్తగా మిలియనీర్లు తయారు అవుతున్నందున భారత దేశ భవితకు పెద్ద ప్రమాదమేమీ ఉండదని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవము అని కవి అన్నట్లుగా మన భారత కుబేరులు భూమాత సౌభాగ్యానికి దోహదపడాలని ఆశిద్దాం.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037

Advertisement

Next Story

Most Viewed