'మధ్యతరగతి'అపోహలు-వాస్తవాలు

by Ravi |   ( Updated:2022-09-03 17:19:05.0  )
మధ్యతరగతిఅపోహలు-వాస్తవాలు
X

54 శాతం కుటుంబాలు ఇంకా కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దేశంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతాయి. 2020 ఆక్స్‌ఫామ్ రికార్డుల ప్రకారం దేశంలోని ఒక శాతం ధనికుల వద్ద 42.5 శాతం దేశ సంపద పోగుబడి ఉంది. 50 శాతం ప్రజల వద్ద 2.8 శాతం మాత్రమే సంపద ఉంది. కొవిడ్ మహమ్మారి తర్వాత లక్షలాది మంది మధ్యతరగతి ప్రజలు పేదరికం లేదా తక్కువ ఆదాయ వర్గంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వాలు సరైన ఆర్థిక ప్రణాళికలను అమలు చేసి, నిరుద్యోగాన్ని తగ్గించి, ఆదాయాన్ని పెంచే మార్గాలను అమలు చేస్తేనే మధ్యతరగతి పెరిగే అవకాశముంటుంది.

దేశంలోని ఎక్కువ శాతం మంది జనాభా తమను తాము మధ్యతరగతికి చెందినవారుగా అభివర్ణించుకుంటారు. కుటుంబ ఆదాయం కూడా అదే స్థాయిలో ఉందని భావించుకుంటారు. దేశంలో మధ్యతరగతి జనాభే ఎక్కువ అని పాలకులు కూడా ప్రసంగాలు ఇస్తుంటారు. పత్రికలు కూడా అదే చెబుతూ ఉంటాయి. మనం మధ్యతరగతికి పరిపూర్ణ నిర్వచనాన్ని ఇవ్వలేకపోయినా, కొన్ని సర్వే సంస్థలు, ఆర్థిక వేత్తలు 'మధ్యతరగతి'అనే పదానికి వేరువేరు నిర్వచనాలు అందించారు. అసలు మధ్య తరగతి ఎవరు? మధ్యతరగతి కుటుంబ ఆదాయం ఎంత ఉండాలి? అసలు దేశంలో మధ్యతరగతి జనాభా ఎంత? ప్రభుత్వాలు చెబుతున్న దాంట్లో వాస్తవమెంత? దేశ ఆర్థికాభివృద్ధిలో మధ్యతరగతి పాత్ర ఏమిటి? వివిధ సర్వే సంస్థలు ఏం తేల్చాయి? ఆర్థిక వేత్తల అభిప్రాయాలేమిటో ఓ సారి గమనిద్దాం.

సర్వేలు ఏమంటున్నాయి?

దేశంలో ఇటీవల ఓ సంస్థ వివిధ ప్రాంతాలలో సర్వే నిర్వహించింది. కుటుంబాల ఆదాయ వివరాలు సేకరించింది. సర్వేలో 50 శాతం మందికి పైగా తమను తాము మధ్యతరగతి కుటుంబాలుగా చెప్పుకున్నారు. అయితే, ఇందులో 90 శాతానికి పైగా మధ్యతరగతికి చెందిన వారు కాదు. వారు పేదరికం లేదా తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు. అనేక రీసెర్చి సంస్థలు ఈ విషయాన్ని ఎన్నోసార్లు తేటతెల్లం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో విశ్వసనీయత కలిగి ఉన్న ప్యూ రీసెర్చి సెంటర్ భారతదేశంలో 2015లో ఓ సర్వే నిర్వహించింది.

దేశంలో రెండంటే రెండు శాతం మంది మాత్రమే మధ్యతరగతికి చెందినవారని గుర్తించింది. 130 కోట్ల జనాభాలో రెండు శాతం మంది మాత్రమే మధ్యతరగతి ఆదాయ వర్గంలో ఉన్నట్లు తేల్చింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం మధ్యతరగతి అంటే కుటుంబ ఆదాయం నెలకు 300 నుంచి 600 డాలర్లు ఉండాలి. అంటే కనీసం నెలకు రూ. 23 వేల నుంచి 45 వేల రూపాయలు. అప్పుడే వారు మధ్యతరగతి వర్గంలోకి వస్తారు. ఇంతకంటే తక్కువ ఆదాయం ఉంటే మధ్యతరగతి వర్గంలోకి రారు.

మధ్యతరగతి నిర్వచనం ఇలా

మధ్యతరగతి అనే పదానికి ఒకటే నిర్వచనాన్ని చెప్పడం కష్టం. చాలా మంది వ్యక్తులు, సర్వే సంస్థలవారు మధ్యతరగతికి వివిధ రకాల నిర్వచనాలు ఇచ్చారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ 111 దేశాలలో సర్వే నిర్వహించింది. ప్రతి దేశం జనాభాను ఆదాయాన్ని బట్టి ఐదు గ్రూపులుగా విభజించింది. పేదరికం, తక్కువ ఆదాయం, మధ్య ఆదాయం, ఎగువ మధ్య ఆదాయం, అధిక ఆదాయం ఇలా వేరువేరుగా చేసింది. రోజు 10 నుంచి 20 డాలర్లు సంపాదించే కుటుంబం, అంటే రూ. 700 నుంచి రూ. 1400 వరకు సంపాదించే కుటుంబాన్ని మధ్యతరగతిగా అభివర్ణించింది. దీని ప్రకారం రెండు శాతం కుటుంబాలు మాత్రమే మధ్యతరగతి పరిధిలోకి వస్తాయి.

మరి, వీరేమంటున్నారు?

ఆర్థిక వేత్తలు సంధ్యకృష్ణన్, నీరజ్ హాటెకర్ మధ్యతరగతికి వేరే నిర్వచనాన్ని ఇచ్చారు. ఒక కుటుంబం రోజువారీ ఆదాయం 2 నుంచి 10 డాలర్లు, అంటే రూ. 150 నుంచి రూ. 700 సంపాదించే వారిని మధ్యతరగతిగా చెప్పారు. దీని ప్రకారం 50 శాతం మంది ప్రజలు మధ్య తరగతిలోకి వస్తారు. అంటే రోజుకు 150 రూపాయలు సంపాదించిన వారు కూడా మధ్యతరగతికి చెందినవారిగానే వీరు పరిగణించారు. వీరి నిర్వచనం ప్రకారం పారిశుధ్య కార్మికులు, ఇండ్లల్లో పని చేసే వారు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, భవన నిర్మాణ, అసంఘటిత రంగ కార్మికులు కూడా మధ్యతరగతికి చెందిన వారిగానే పరిగణించాల్సి ఉంటుంది. ఈ నిర్వచనాలు ఆర్థికవేత్తలు, లేదా వివిధ సంస్థలు ఇచ్చినవి మాత్రమే. ఏదైనా ఉద్యోగం, లేదా చిన్నపాటి వ్యాపారం ఉండి, సొంత ఇల్లు, సొంత వాహనం, పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న వారిని సమాజం మధ్యతరగతివారిగా గుర్తిస్తుంది.

మధ్యతరగతి పెరుగుతోందా!

దేశంలో మధ్యతరగతి రోజురోజుకు పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవన్నీ అవాస్తవాలేనని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది. ప్యూ రిపోర్ట్ నివేదిక ప్రకారం పేదరికం రేటు 2001లో 35 శాతం ఉంటే, 2011లో 20 శాతానికి పడిపోయింది. మధ్యతరగతిగా భావించే మధ్య ఆదాయంగా పరిగణించబడే భారతీయ జనాభా వాటా ఒక శాతం నుండి మూడు శాతానికి మాత్రమే పెరిగింది. ఈ నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినప్పుడు పేద ప్రజలు తక్కువ ఆదాయమున్న వర్గానికి మారారు తప్ప, మధ్యతరగతి వర్గంలోకి రాలేదు. తక్కువ ఆదాయ వర్గంలోని చాలా తక్కువ మంది మాత్రమే మధ్య ఆదాయ వర్గంలోకి మారారు. 2001 నుంచి 2011 మధ్య చైనా అభివృద్ధిని పరిశీలిస్తే మధ్య ఆదాయ వర్గం 3 శాతం నుంచి 18 శాతానికి ఎగబాకింది.

పరిశ్రమల తప్పుడు అంచనాలు

దేశంలో మధ్య ఆదాయ వర్గం చాలా ఎక్కువగా ఉందని పరిశ్రమలు తప్పుడు అంచనాలు వేసి, అనుకున్న లక్ష్యాలను సాధించక నిరాశకు గురైన సంఘటనలు సైతం ఉన్నాయి. ఉదాహరణకు స్టార్ బక్స్ భారతదేశంలో ఎన్నో పెద్ద ప్రణాళికలు వేసి తన వ్యాపారాన్ని మొదలుపెట్టింది. రెండేళ్ల డేటాను పరిశీలిస్తే స్టార్ బక్స్ దేశంలో ప్రతి నెలలో కేవలం ఒక కొత్త షాపును మాత్రమే తెరవగలిగింది. ఎందుకంటే ప్రతి రోజు 150 నుంచి 300 రూపాయలు సంపాదించే వ్యక్తి కేవలం కాఫీ కోసం రూ. 200 ఖర్చు చేస్తాడని భావించడం తప్పే అవుతుంది. చైనాలో కేవలం 15 గంటలకు ఒక స్టార్ బక్స్ నూతన దుకాణం తెరుచుకుంటోంది. భారతదేశంలో ఎన్నో పెద్దపెద్ద కంపెనీలు అందించే సేవలను అతి కొద్ది శాతం ప్రజలు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. ఓలా కంపెనీ దాదాపు 100 నగరాలలో తన సేవలను అందిస్తోంది. 80 శాతానికి పైగా వ్యాపారం మెట్రో సిటీల నుంచి మాత్రమే వస్తున్నది.

అసలు సంగతి ఇదీ

2015లో కేంద్ర ప్రభుత్వం ఎన్ హెచ్ఎఫ్ఎస్ ఆధ్వర్యంలో ఓ సర్వే నిర్వహించింది. టీవీ, ఏసీ, కూలర్, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్ వంటివి ఉన్నాయా? అని వివరాలు సేకరించింది. ఈ సర్వేలో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. దేశంలో ఉన్న వాషింగ్ మెషీన్లలో 33 శాతం ఢిల్లీ, ముంబై, పూనె, చెన్నై, హైదరాబాద్, కలకత్తా, బెంగుళూర్ వంటి నగరాలలోనే ఉన్నాయి. ఏసీలు 15 శాతం ఢిల్లీలోనే ఉన్నాయి. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు తమ దృష్టిని ప్రధానంగా నగరాలపై కేంద్రీకరించి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి.

పల్లెల వైపు చూస్తే అసలైన భారతదేశం మనకు కనిపిస్తుంది. పేదరికంలో మగ్గుతున్న జనం అనే వాస్తవం తెలిసొస్తుంది. 54 శాతం కుటుంబాలు ఇంకా కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దేశంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతాయి. 2020 ఆక్స్‌ఫామ్ రికార్డుల ప్రకారం దేశంలోని ఒక శాతం ధనికుల వద్ద 42.5 శాతం దేశ సంపద పోగుబడి ఉంది. 50 శాతం ప్రజల వద్ద 2.8 శాతం మాత్రమే సంపద ఉంది. కొవిడ్ మహమ్మారి తర్వాత లక్షలాది మంది మధ్య తరగతి ప్రజలు పేదరికం లేదా తక్కువ ఆదాయ వర్గంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వాలు సరైన ఆర్థిక ప్రణాళికలను అమలు చేసి, నిరుద్యోగాన్ని తగ్గించి, ఆదాయాన్ని పెంచే మార్గాలను అమలు చేస్తేనే మధ్యతరగతి పెరిగే అవకాశముంటుంది.

ఫిరోజ్‌ఖాన్

జర్నలిస్ట్, కాలమిస్ట్

96404 66464

Advertisement

Next Story

Most Viewed