- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోకోణం:అబ్ కీ బార్ ఆప్ కా!?
పంజాబ్ ఎన్నికలలో ఘనవిజయంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయస్థాయి వార్తలలో నిలిచింది. తొమ్మిదేళ్ల కిందట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ఈ పార్టీ ప్రయాణం మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికలతో ఒక కొలిక్కి వచ్చింది. గోవాలో కూడా రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచినా, పంజాబ్ రాష్ట్రాన్ని ఊడ్చేసిన తీరు రాజకీయ విశ్లేషకులలో తీవ్ర చర్చను రేపింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండేళ్లుగా మోడీ సర్కారుపై రాజీలేని పోరాటం చేసిన పంజాబ్ రైతులు తమకు మద్దతిచ్చిన అధికార కాంగ్రెస్‌కు ఓటేయకుండా ఆప్‌ను ఎంచుకోవడాన్ని వాళ్లు సీరియస్‌గా తీసుకున్నారు.
ఇది భారతదేశపు భవిష్యత్ రాజకీయ చిత్రపటాన్ని ఆవిష్కరింపజేస్తోందని, జాతీయపార్టీల సరసన ఇప్పుడు ఆప్ చేరినట్లేనని భావిస్తున్నారు. కాంగ్రెస్ చతికిలపడిన చోట, ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీని గద్దె దించే చోట ఆప్ ప్రత్యామ్నాయంగా మారబోతున్నదని జోస్యం చెబుతున్నారు. ఈ ఏడాది చివరన జరిగే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలలోనూ, వచ్చే ఏడు జరిగే తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలలోనూ ఈ విషయం రుజువవుతుందని ఢంకా బజాయిస్తున్నారు. 2024 మే లోక్‌సభ పోరు బీజేపీ వర్సెస్ ఆప్ అన్నట్లుగా జరిగినా ఆశ్యర్యపోనక్కర్లేదంటున్నారు.
అలా గుర్తింపు పొంది
2012 నవంబర్ 26న ఆవిర్భవించిన ఆప్ మూలాలు అంతకు ముందటి ఏడాది గాంధేయవాది అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఉన్నాయి. వ్యవస్థలో, ప్రభుత్వాలలో గూడు కట్టుకున్న అవినీతిని సమూలంగా పెకిలించివేయడానికి పదునైన జన లోక్‌పాల్ బిల్లును చట్టసభలలో ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ ఈ ఉద్యమం కొనసాగింది. హజారేతో పాటు కేంద్ర మాజీ న్యాయమంత్రి శాంతిభూషణ్, ఆయన కుమారుడు, న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, విద్యావేత్త యోగేంద్రయాదవ్, ప్రస్తుత ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ఈ ఉద్యమానికి నేతృత్వం వహించారు.
అయితే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి, బ్లాక్‌మెయిల్ చేయడం కాదని, దమ్ముంటే ప్రజాక్షేత్రంలో నిలిచి గెలవాలంటూ వచ్చిన విమర్శలపై ఈ ఉద్యమనేతలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెజారిటీ నేతలు పార్టీ ఏర్పాటును ప్రతిపాదించగా, హజారే వర్గం వ్యతిరేకించి విడిపోయింది. అనంతరం కేజ్రీవాల్ కన్వీనర్‌గా ఆప్ ఏర్పడి, 2013 మార్చిలో రాజకీయపార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందింది.
ప్రజా ఆకాంక్షలే లక్ష్యంగా
సామాన్య మానవుడి సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన పార్టీగా అభివర్ణించుకునే ఆప్, ఆర్థిక విధానాలలో వామపక్ష సిద్ధాంతాలను, నైతిక విషయాలలో సంప్రదాయ పార్టీల స్వభావాన్ని కలిగివుందని చెబుతుంటారు. భారత రాజ్యాంగంలో, పీఠికలో చెప్పిన సమానత్వం, సామాజిక న్యాయం దేశ పౌరులకు లభించడం లేదని, గాంధీ ప్రవచించిన స్వరాజ్ (స్వయంపాలన, సమాజ నిర్మాణం, వికేంద్రీకరణ) భావనను తాము విశ్వసిస్తామని, డా. అంబేడ్కర్, షహీద్ భగత్‌సింగ్ తమకు ఆదర్శమని కేజ్రీవాల్ ప్రకటించారు.
తమను నడిపించే సిద్ధాంతం ఏదీ లేదని, ఆమ్ ఆద్మీ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే లెఫ్టిస్ట్ లేదంటే రైటిస్ట్ పార్టీల మద్దతు తీసుకుంటామన్నారు. కాగా, ఆప్ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ కనుసన్నలలో నడుస్తోందనే ఆరోపణలున్నాయి. ఫోర్డ్ ఫౌండేషన్, ఇతర అనుమానిత అమెరికన్ సంస్థల నుంచి నిధులు అందుతున్నాయని మీడియాలో వార్తలు రావడం గమనార్హం.
అధికారాన్ని నిలబెట్టుకుంటూ
2013 డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ మొదటిసారి పోటీ చేసి 70 సీట్లకు 28 సీట్లు సాధించి బీజేపీ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పరోక్ష మద్దతుతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీపై ఓ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంచలనం సృష్టించారు. జనలోక్‌పాల్ బిల్లును 2014 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, కాంగ్రెస్, బీజేపీ రెండూ ఆ బిల్లును వ్యతిరేకించడంతో వీగిపోయింది.
నైతికబాధ్యత వహిస్తూ ఆ వెంటనే కేజ్రీవాల్ ప్రభుత్వం గవర్నర్‌కు రాజీనామా సమర్పించింది. అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసింది. ఏడాది రాష్ట్రపతి పాలన అనంతరం 2015లో జరిగిన ఎన్నికలలో ఆప్ 67 స్థానాలు సాధించి బీజేపీ, కాంగ్రెస్‌లను నామరూపాలు లేకుండా దెబ్బతీసింది. మూడవ దఫా 2020 ఫిబ్రవరి ఎన్నికలలో సైతం 62 సీట్లు సాధించి ఆ రాష్ట్ర రాజకీయాలలో తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. ఐదేళ్ల పాలనలో ఏమాత్రం ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కోకుండా ప్రజల మెప్పుపొందింది.
క్రమక్రమంగా ఎదుగుతూ
జాతీయ పార్టీగా రూపుదిద్దుకునే ప్రయత్నాన్ని 2014 సాధారణ ఎన్నికలలోనే ఆప్ చేసింది. దేశవ్యాప్తంగా 434 మంది అభ్యర్థులను పోటీలో దింపి రెండు శాతం ఓట్లను సాధించింది. పంజాబ్ నుంచి నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. 2019 సాధారణ ఎన్నికలలో ఎత్తుగడలు మార్చి కేవలం 35 సీట్లలోనే పోటీ చేసి పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానాన్ని మాత్రమే నిలబెట్టుకుంది. కాగా, 2017 నుంచీ ఢిల్లీ, పంజాబ్‌ను దాటి ఇతర రాష్ట్రాల ఎన్నికలలోనూ ఆప్ పోటీ చేయడం ప్రారంభించింది. బిహార్, ఈశాన్యం తప్ప 15 ఉత్తరాది రాష్ట్రాలలోనూ, దక్షిణాన తెలంగాణలోనూ రంగంలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంది. గోవాలో తప్ప ఎక్కడా ఖాతా తెరువలేకపోయినా పార్టీ ఉనికిని దేశ పౌరులందరికీ తెలియజేయడంలో సఫలమైంది.
కలిసి వస్తున్న కాలం
ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరి, జాతీయపార్టీ గౌరవాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. సీపీఐ, సీపీఎం వంటి వామపక్షాలు, ఎన్‌సీపీ, బీఎస్‌పీ, ఎన్‌పీపీ వంటి ఇతర జాతీయపార్టీలు సైతం క్రమంగా ప్రజాదరణ కరువై మరుగునపడి ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఫలితంగా ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక శక్తుల, ఓటర్ల ఎదుట ప్రాంతీయ పార్టీలు కాకుండా మరో బలమైన ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఈ పరిస్థితులలో పంజాబ్‌లో ఘనవిజయం రాజకీయవర్గాలలో ఆమ్ ఆద్మీ పార్టీపై అంచనాలను పెంచింది. కాంగ్రెస్ లాంటి సెంట్రిస్ట్, సెంటర్ లెఫ్టిస్ట్ పార్టీగా కొనసాగే అర్హత ఆప్‌కు మాత్రమే ఉందనే భావన వాళ్లలో ఏర్పడింది.
రాబోయే 2024 సాధారణ ఎన్నికలలో దేశ ప్రజలు బీజేపీ వైపు కనుక మరోసారి మొగ్గని పక్షంలో అయితే ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, లేదంటే ఆప్ లాంటి పాపులిస్ట్, క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీకే ఆ అవకాశం ఉంటుందని వాళ్లు భావిస్తున్నారు. అవినీతి నిర్మూలన, స్వయం పాలన, అధికార వికేంద్రీకరణ, ఉచిత విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, ఇంటికో ఉద్యోగం హామీలతో ఆప్ ప్రతి రాష్ట్రంలోనూ రంగంలోకి దిగితే చరిత్ర గతిని మార్చే ఫలితాలు సైతం రావచ్చని నమ్ముతున్నారు. ప్రాంతీయపార్టీలలో ఐక్యత కొరవడడం, అధినేతలందరికీ ప్రధాని కావాలన్న కాంక్ష ఉండడం ఆప్‌కే కలిసి వస్తుందంటున్నారు.
తెలంగాణలో ప్రత్యామ్నాయం?
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఏ సమయంలోనైనా సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లవచ్చనే టాక్ కూడా నడుస్తోంది. ఇప్పటిదాకా ప్రధాన ప్రత్యామ్నాయాలలో ఒకటనుకున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల మూలంగా చతికిలపడింది. సీనియర్ నేతలందరూ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వారిని అదుపులో పెట్టడం పీసీసీ చీఫ్ రేవంత్ వల్ల కావడం లేదు. వారిలో కొందరు బహిరంగంగానే ఇతర పార్టీల్లోకి వెళతామని హెచ్చరిస్తున్నారు.
ఐదు రాష్ట్రాల ఫలితాల నేపథ్యంలో ఆ పార్టీ అధికార టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వడం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. ఇక, మరో ప్రతిపక్షం బీజేపీకి రాష్ట్రంలో పలు సానుకూలతలున్నా గత ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండడం అతిపెద్ద మైనస్. పైగా పట్టణప్రాంతాలలోనే ఆ పార్టీ ప్రభావం ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ కాంగ్రెస్‌కే పట్టు ఉంది. ఇక దళితులు, మైనారిటీలు, సెక్యులర్‌వాదులు, నక్సల్ సానుభూతిపరుల ఓట్లు కమలానికి పడడం కష్టం. అలాంటప్పుడు కేసీఆర్‌ను వద్దనుకున్న ఓటర్లకు కాంగ్రెస్ స్థానంలో ఆప్ మంచి ప్రత్యామ్నాయంగా కనిపించవచ్చు.
పాదయాత్రలతో ప్రారంభించి
ఆప్ కూడా ఈ దిశలో వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కేసీఆర్ పాలనపై, కుటుంబ అవినీతిపై ఆప్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సోమ్‌నాథ్ భారతి, రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరా శోభన్ ట్విట్టర్ వేదికగానూ, బయటా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో పాదయాత్రను ప్లాన్ చేసింది. యాత్రను జెండా ఊపి ప్రారంభించడానికి స్వయంగా కేజ్రీవాల్ హైదరాబాద్ వస్తున్నారు.
ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కమిటీల ఏర్పాటు, కార్యాచరణ ప్రణాళిక-ఎజెండా ఖరారు, ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన నినాదాలపై నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. దేశంలోని అన్ని పార్టీలకూ అవినీతి మరకలున్నాయని, 'ఆప్' మాత్రమే అందుకు మినహాయింపని, అదే తమకు ఓట్లు రాబడుతుందని పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.
వేచి చూడాలి
నిజంగానే వచ్చే రెండేళ్లలో ఆప్ కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందా? వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ అంచనాలను మించి లేచి పరుగులెత్తుతుందా? ప్రాంతీయపార్టీలే కింగ్ మేకర్లవుతాయా? కమలనాథుల ఏకఛత్రాధిపత్యం ఇకపైనా కొనసాగనుందా? తెలంగాణలో అధికారం ఎవరిది? చూడాలి.
డి మార్కండేయ