లోకేష్‌ రెడ్‌ బుక్‌ తెరుస్తాడా..!?

by Ravi |   ( Updated:2024-07-04 00:45:40.0  )
లోకేష్‌ రెడ్‌ బుక్‌ తెరుస్తాడా..!?
X

యువగళం పేరుతో పాదయాత్ర చేసిన తెలుగుదేశం యువనేత నారా లోకేష్‌ నాటి ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ఉన్నతాధికారులను, ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులను వేధించడమే కర్తవ్యంగా భావించిన వారి పేర్లను నమోదు చేసుకున్న పుస్తకాన్ని రెడ్‌ బుక్‌గా పేర్కొన్నారు. ఆయన అందులో ఉన్న వారిపై తమ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చర్యలు తప్పవని కూడా హెచ్చరించడంతో నాడు సీఐడీ వారు నారా లోకేష్‌పై కేసు కూడా నమోదు చేసారు. అలాగే ప్రజాప్రతినిధులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారిని కూడా నారా లోకేష్‌ తీవ్రంగా హెచ్చరించారు.

రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి విజయగర్జనకు జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దయనీయ పరిస్థితికి చేరింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న చర్చ లోకేష్‌ రెడ్‌ బుక్‌ తెరుస్తాడా? లేక దాచేస్తాడా! ఈ అనుమానానికి కారణాలు తెలుసుకోవాలంటే గతాన్ని కూడా గుర్తు చేసుకోవాలి.

బాబుపై కార్యకర్తల అసహనానికి కారణం..

దశాబ్ద కాలం రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటు కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు, ఆయన సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ 2004 ఎన్నికల్లో పరాజయం పొంది వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, హత్యలు, చాన్నాళ్ల పాటు కొనసాగాయి. ఎప్పుడు ఎవరి హత్య వార్త వినవలసి వస్తుందో అని ఆ పార్టీ అభిమానులు ఆందోళనలతో ఉండేవారు. మరణించిన వారి పిల్లలను హైదరాబాద్‌ యన్‌.టి.ఆర్‌. మోడల్‌ స్కూల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేసినా, మరణించిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పినా, తెలుగుదేశం శ్రేణులు మాత్రం ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. కారణం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కార్యకర్తల గురించి పదేపదే పలవరించి ప్రత్యర్థులను ఖబడ్దార్‌ అని హెచ్చరించి, ఈ హత్యలకు కారణమైన వారిని వదిలేది లేదని ప్రతిజ్ఞలు చేసిన చంద్రబాబు తీరా అధికారంలోకి రాగానే అధికారులతో మీటింగులు, వీడియో కాన్ఫరెన్స్‌లతోనే కాలం గడిపి పార్టీ విజయం కోసం ప్రాణాలొడ్డే వారిని మాత్రం మర్చిపోతారని కార్యకర్తలు మనస్తాపానికి గురయ్యేవారు.

ఆ చులకన భావంతో..

న్యాయం జరగడమే కాదు జరిగినట్లు ప్రజలకు కూడా తెలియపరచాలి అంటారు. అది పాలన విషయానికీ వర్తిస్తుంది. కమ్యూనిస్టు మేధావులుగా చలామణి అవుతూ అమరావతిని భ్రమరావతి అని ఒకరు, రాజధాని అవసరమే లేదని మరొకరు, ఇద్దరూ కలసి మూడు రాజధానులని మించింది లేదని ప్రశంసించడం తెలుగు ప్రజలందరికి తెలిసిందే. ఇక చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే... ప్రజల సమస్యలు తమ మేధాతనం కలగలపి ప్రకటించే ఆంధ్రా మేధావులు గత ఐదేళ్లుగా ఒక్కసారి కూడా ప్రజల పక్షాన మాట్లాడింది లేదు. కారణం చంద్రబాబునూ, ఆయన ప్రభుత్వాన్ని ఏమైనా అనొచ్చు.. ఆయనేమి చేయలేడు అనే చులకన భావం. ఆ భావమే కొందరికి ఏం మాట్లాడినా పర్వాలేదు, మనకు ఏమి కాదనే భరోసా కల్పించింది. పరుష పదజాలాలు, బూతులు, వెకిలి చేష్టలు దాటి మహిళల మానాలపైనా, పుట్టుకల పైనా మాట్లాడే నీచ స్థాయికి శాసనసభ వేదికయింది. ఇంతటి అవమానానికి, మనోవేదనకు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు గురి కావడానికి కారణం కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు గతాన్ని వదిలేయడమే.

ప్రతీకారమంటే గుణపాఠం నేర్పడం!

యన్‌.టి.ఆర్‌. రాజకీయాల్లో ఉన్నప్పుడూ ఇలాంటి హేళనలు, ప్రచారాలు చేయడానికి కొందరు సినిమా వాళ్లు, కొన్ని పత్రికలు ప్రత్యేకంగా ఉండేవి. ఆయనా వారి పట్ల కఠిన వైఖరితో ప్రవర్తించిన దాఖలాలు లేవు. ప్రతీకారం అంటే వెంటాడి వధించడం కాదు, గుణపాఠం నేర్పడం అదీ చట్టప్రకారం. తెలుగుదేశం పార్టీకి మూడు తరాల కార్యకర్తలున్నారు. వాళ్లందరూ ఇప్పుడు రెడ్‌బుక్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెడ్‌బుక్‌ తీసుకోబోయే చర్యల గురించి లోకేష్‌ బహిరంగ సభల్లోనే ప్రకటించారు కనుక. ప్రభుత్వం నిలపడాలంటే ప్రజల నమ్మకం ఎంత ముఖ్యమో పార్టీ నిలబడాలంటే కార్యకర్తల నమ్మకం అంతే ముఖ్యం. తెలుగుదేశం పార్టీ మూడవతరం నాయకుడిగా ప్రజల పాట్లు, కార్యకర్తల కష్టాలు పాదయాత్రలో తెలుసుకున్న నారా లోకేష్‌ నాయకుడంటే నమ్మకం కలిగించడమే కాదు... దానిని నిలబెట్టుకోవడం కూడా అని తెలుసుకునే ఉండొచ్చు.

నరసింహ ప్రసాద్‌ గొర్రెపాటి

94407 34501

Advertisement

Next Story